Calicut Riders Family: సాఫ్ట్వేర్ ఇంజనీర్, హోం మేకర్స్.. ఇంకా
తీరిక దొరికినప్పుడు ఏదో ఒక పుస్తకంలో మునిగిపోయి ఇల్లుదాటేది కాదు సాఫ్ట్వేర్ ఇంజనీర్ నయన. ఈసారి చదివిన ఒక పుస్తకం ప్రభావం వల్ల ఇల్లే ప్రపంచం కాదని, ఇల్లు దాటితేగాని ప్రపంచం పరిచయం కాదనే విషయం అర్థమైంది. ‘ఎర్నెస్టో చే గువేరా మోటర్ సైకిల్ డైరీస్ పుస్తకం నన్ను మార్చేసింది. మిత్రుడితో కలిసి బైక్‌పై తొమ్మిది నెలల్లో వందలాది కిలోమీటర్ల దూరం ప్రయాణించాడు చే.
కొండలు, కోనలు దాటుతూ ఒకే ప్రపంచంలో అనేక ప్రపంచాలు చూశారు ఇద్దరు. ఈ ప్రపంచాన్ని తెలుసుకోవడానికి మాత్రమే కాదు మనల్ని మనం తెలుసుకోవడానికి ప్రయాణం ఉపయోగపడుతుందనే వాస్తవం ఈ పుస్తకం ద్వారా తెలుసుకున్నాను’ అంటున్న నయన ‘సీఆర్ఎఫ్’ తరపున మూడు రోజుల ‘కాసరగాడ్ టు కన్యాకుమారి’ యాత్రను విజయవంతంగా పూర్తిచేసింది.
సీఆర్ఎఫ్ (కాలికట్ రైడర్స్ ఫ్యామిలీ)లో కేరళలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు సభ్యులుగా ఉన్నారు. ఒక ప్రాంతానికి చెందిన రైడర్స్ వేరే ప్రాంతం మీదుగా వెళుతున్నప్పుడు అక్కడి ‘సీఆర్ఎఫ్’ సభ్యులు ఆతిథ్యం ఇస్తుంటారు. ఒకరికొకరు పరిచయం అవుతుంటారు. ‘సీఆర్ఎఫ్’లో సభ్యులుగా గృహిణులు, విద్యార్థులు, రకరకాల ఉద్యోగాలు చేస్తున్న మహిళలు ఉన్నారు.
‘సీఆర్ఎఫ్’ సభ్యురాలైన షామ్న మొదట్లో సరదాగా భర్త బైక్ తీసుకొని అక్కడక్కడే రైడ్ చేసేది ‘సీఆర్ఎఫ్’లో భాగం అయిన తరువాత ఆమె ప్రయాణ విస్తృతి పెరిగింది. ‘బైక్‌పై భర్త వెనక కూర్చొని వేరే ఊరికి పోవడం తప్ప, నేను సొంతంగా డ్రైవ్ చేస్తూ పరాయి ఊరు ఎప్పుడూ వెళ్లలేదు, దీనికి కారణం భయం. నాలోని భయాన్ని సీఆర్ఎఫ్ తొలగించి, ప్రయాణంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేర్పింది’ అంటుంది షామ్న.
‘మినీ కె టు కె’ గ్రూప్‌లోని పద్నాలుగు మందిలో షామ్న ఒకరు. ‘కాసరగాడ్ టు కన్యాకుమారి’ బైక్ రైడ్‌కు ‘మినీ కె టు కె’ అని పేరు పెట్టుకోవడానికి ప్రధాన కారణం వారి భవిష్యత్ లక్ష్యం... కె టు కె. అంటే కన్యాకుమారి టు కశ్మీర్. ‘మినీ కె టు కె’ రైడ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన పద్నాలుగు మంది బృందం భవిష్యత్ ‘కె టు కె’ లక్ష్యంపై దృష్టి పెట్టింది.
‘మినీ కె టు కె’లో జావా, బీఎండబ్యూ, కేటియం డూక్, రాయల్ ఎన్ఫీల్డ్, క్లాసిక్ అండ్ హిమాలయన్.. ఇలా సభ్యులు ఒక్కొక్కరూ ఒక్కో కంపెనీ బైక్‌లు వాడారు. రోడ్డుపై ఈ బైక్‌లు పరుగులు తీస్తుంటే...అదొక సుందరదృశ్యం. ‘జర్నీ ఈజ్ మై హోమ్’ అనే వాక్యాన్ని గుర్తు చేసే సందర్భం!
చదవండి: Mental Health: ‘తులసి’ గురించి ఈ ఆసకక్తికర విషయాలు తెలుసా?!
పాత వీడియో