థాయ్ః యాప్ ద్వారా అద్దె కార్ల సౌకర్యాన్ని కల్పిస్తున్నఉబెర్ సంస్థ మరో కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో వినియోగదార్లకు ఇప్పటివరకూ కార్లను మాత్రమే సరఫరా చేస్తున్న సంస్థ తాజాగా మోటర్ బైక్ ట్యాక్సీ సర్వీసులను ప్రవేశ పెడుతోంది. బ్యాంకాక్ లో పైలట్ పథకాన్ని ప్రారంభించిన ఉబెర్.. త్వరలో ఆసియా మొత్తం తమ సేవలను విస్తరించనున్నట్లు తెలిపింది.
కారు యజమానులు ఎక్కువవడం, సిటీ ప్లానింగ్ సరిగా లేకపోవడంతో థాయ్ రాజధాని నగరం ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు పడుతోంది. ఇది గమనించిన ఉబెర్ సంస్థ నగరంలో మోటర్ బైక్ ల వాడకానికి నాంది పలికింది. ట్రాఫిక్ జామ్ లను నివారించడంలో భాగంగా ప్రారంభించిన ఉబికిటస్ మోటార్ బైక్ ట్యాక్సీ డ్రైవర్లు ఆరెంజ్ జాకెట్లను ధరించి నగరంలో ప్రత్యేకంగా దర్శనమివ్వనున్నారు. ప్రస్తుతం సింగపూర్ కు చెందిన గ్రాబ్ ట్యాక్సీ బైక్ ట్యాక్సీ సర్వీసులను ప్రవేశపెట్టి, ప్రయాణీకులను ఆకట్టుకుంటుండగా... ఉబెర్ పోటీగా తన మోటర్ బైక్ సర్వీసులను ప్రారంభించింది. గతేడాది బ్యాంకాక్ లో ట్యాక్సీలను పరిచయం చేసిన సంస్థ.. ఇంటినుంచి, లేదా ఆఫీసులనుంచి ప్రయాణీకులను తరలిస్తూ ఇప్పటికే ఎంతో పేరు తెచ్చుకుని, ప్రస్తుతం మోటర్ బైక్ సర్వీసులను కూడ ప్రారంభించింది.
అమెరికాకు చెందిన ఉబెర్ సంస్థ... ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 బిలియన్ డాలర్లతో 68 దేశాల్లోతమ సేవలను ప్రారంభించినప్పటినుంచీ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటోంది. పలు ప్రాంతాల్లో డ్రైవర్ల కారణంగా ఎన్నో అడ్డంకులను చవిచూసింది. అయితే ఇతర ట్యాక్సీల మీటర్లు, రేట్లతో ఇబ్బంది పడుతున్న అనేక మంది ప్రయాణీకులను ఆకట్టుకోవడంతో పాటు బ్యాంకాక్ లో గ్రాబ్ టాక్సీలకు సవాలుగా నిలుస్తోంది. సాధారణ మోటర్ బైక్ ట్యాక్సీలకంటే భిన్నంగా అత్యంత చవుకగా ఇప్పుడు ఉబెర్ మోటర్ బైక్ ట్యాక్సీలను ముందుగా బ్యాంకాక్ లోని కొన్ని జిల్లాల్లో ప్రవేశ పెడుతోంది. ట్రాఫిక్ సమస్యతో బాధపడే థాయిల్యాండ్ పై అధికంగా దృష్టిని పెట్టిన ఉబెర్... ఇప్పుడు ఆసియాలోని అనేక ట్రాఫిక్ బాధిత ప్రాంతాలపై కూడ దృష్టి సారించనుంది.
బ్యాంకాక్ లో ఉబెర్ బైక్ ట్యాక్సీలు
Published Wed, Feb 24 2016 4:21 PM | Last Updated on Sun, Sep 3 2017 6:20 PM
Advertisement