ఓ మట్టిమనిషి.. వ్యవస్థను మార్చాడు! ఇది చదవండి..
కంధమాల్ : ఎవరికి వారే కేంద్ర బిందువులుగా ఉండే వ్యవస్థలో మార్పు.. మొదట ఒక్కరి ప్రయత్నంతోనే ఆరంభమవుతుంది. వ్యవస్థ కూడా ఆ మంచికి చేదోడుగా నిలిస్తే అదొక సమిష్టివిజయం అవుతుంది. అలా ఓ మట్టిమనిషి ఒంటరిగా తలపెట్టిన లక్ష్యం, సాధించిన విజయం గురించి ప్రపంచం చర్చించుకుంటోంది. ఆ మట్టిమనిషి పేరు జలంధర్ నాయక్. వయసు 45. ఊరు.. ఒడిశా కధమాల్ జిల్లా ఫుల్బనీ తాలూకాలోని కుగ్రామం గుమ్సాహి. ఒంటిచేత్తో కొండను తొలిచి గ్రామానికి రోడ్డు వేసిన బిహారీ దశరథ్ మాంఝీ తరహాలో.. జలంధర్‌ను ‘ఒడిశా మౌంటెయిన్ మ్యాన్’గా కీర్తిస్తున్నారు స్థానికులు.
రెండేళ్లుగా వెలుగులోకిరాని కథ : కంధమాల్ జిల్లాలోని గుమ్సాహి గ్రామానికి కనీసం నడవడానికి అనుకూలమైన రోడ్డు కూడా లేదు. ఇక విద్యుత్, మంచినీటి సరఫరా ముచ్చట మాట్లాడకుంటేనే మేలు! భరింపశక్యం కాని పరిస్థితుల్లో మిగతావారంతా ఊరు విడిచి వెళ్లిపోయారు. కూరగాయలు అమ్ముకుంటూ అతికష్టం మీద జీవనం సాగించే జలంధర్ నాయక్ కుటుంబమొక్కడే మిగిలిందక్కడ! నాయక్ దంపతులకు ముగ్గురు కొడుకులు. పేదరికంలోనూ పిల్లల్ని చదివించాలనే పట్టుదలవారిది. రాతిదిబ్బల గుండా పిల్లలు ప్రతిరోజూ గుమ్సాహి నుంచి ఫుల్బనీలోని పాఠశాలకు నడిచివెళ్లే క్రమంలో ఎన్నోదెబ్బలు తగిలేవి. కొన్నేళ్లకు పిల్లలు ముగ్గురికీ ఫుల్బనే ప్రభుత్వ హాస్టల్లో సీట్లు దొరికాయి. రోజూవారీ కష్టాలు తప్పినా, సెలవుల్లో ఇంటికి వెళ్లిరావడం నరకప్రాయంగా ఉండేది. గుమ్సాహి గ్రామానికి రోడ్డు కోసం నాయక్ కలవని నాయకుడంటూ లేడు. కానీ ఫలితం శూన్యం. దీంతో రెండేళ్ల కిందట.. ఒకరోజు నాయక్ తనకు తానే రోడ్డు నిర్మించాలని నిశ్చయించుకున్నాడు. భార్య కట్టిన సద్దిమూటను చేతబట్టుకుని, పలుగు-పారను భుజాన వేసుకుని అడివిలోకి నడిచాడు..
లోకల్ పేపర్లో చిన్న వార్త.. : 2018, జనవరి 9న కంధమాల్‌లో ఒక స్థానిక వార్తా పత్రికలో జలంధర్ గురించిన వార్త ప్రచురితమైంది. గడిచిన రెండేళ్లుగా రోజుకు 8 గంటలు కష్టపడుతూ.. అడవిలోని రాళ్లు, రప్పలను పక్కకు తొలగిస్తూ చక్కటి రోడ్డును నిర్మిస్తున్నాడని వార్త సారాంశం. గుమ్సాహి నుంచి ఫుల్బనీకి మొత్తం దూరం 15 కిలోమీటర్లు. రెండేళ్లలో జలంధర్ ఒక్కడే 8 కిలోమీటర్ల రోడ్డును నిర్మించాడు. మిగిలిన 7 కిలోమీటర్ల రోడ్డును వచ్చే మూడేళ్లలో పూర్తి చేయాలన్నది అతడి లక్ష్యం. కంధమాల్ జిల్లా కలెక్టర్ డి. బృందా.. ఆ వార్తను చదివి ఆలోచనలో పడ్డారు. హుటాహుటిన అధికారులను పంపించి జలంధర్ నాయక్‌ను కలెక్టరేట్‌కు పిలిపించారు. ఆఫీసులో కాసేపు మాట్లాడి, ఆయన నిర్మించిన రోడ్డును చూసేందుకు బయలుదేరారు.
సమిష్టి విజయం : పెద్ద వాహనాలు కూడా సులువుగా ప్రయాణించగలిగినంత పెద్ద రోడ్డును చూసి కలెక్టర్ బృందా ఆశ్చర్యపోయారు. మిగిలిన 7 కిలోమీటర్ల రోడ్డును ప్రభుత్వమే నిర్మిస్తుందని జలంధర్‌కు మాటిచ్చారు. అంతేకాదు.. 8 కిలోమీటర్ల రోడ్డు నిర్మించినందుకు అతనికి పూర్తివేతనాన్ని ఉపాధి హామీ పథకం కింద చెల్లించేందుకు ఏర్పాట్లుచేశారు. రోడ్డు నిర్మాణం పూర్తయ్యేవరకు పనులు పర్యవేక్షించే బాధ్యతను జలంధర్కే కట్టబెట్టారు. గుమ్సాహి గ్రామానికి రోడ్డుతోపాటు విద్యుత్, మంచినీటి సరఫరా పనులుకూడా ప్రారంభమయ్యాయి. మరికొద్ది రోజుల్లో జరుగనున్న కధమాల్ ఉత్సవాల్లో జలంధర్‌ను ఘనంగా సత్కరించనున్నారు. వేర్వేరు ఊళ్లలో బతుకుతున్న గుమ్సాహి వాసులంతా స్వగ్రామబాట పట్టడం అప్పుడే మొదలైంది. ‘ఇంకొన్ని రోజుల్లోనే మా బిడ్డలు సునాయాసంగా ఇంటికొచ్చివెళ్లే పరిస్థితి వస్తుంది. ఆలస్యంగానైనా మమ్మల్ని గుర్తించిన అధికారులకు ధన్యవాదాలు’’ అంటున్నాడు వ్యవస్థను మార్చిన మట్టి మనిషి జలంధర్ నాయక్.
కంధమాల్ కలెక్టర్ బృందా, పక్కన జలంధర్ దంపతులు
22 ఏళ్లు శ్రమించి కొండను తొలిచి రోడ్డు నిర్మించిన జీతన్ మాంఝీ(ఫైల్ ఫొటో)