
మహారాష్ట్రలోనూ ‘మౌంటెన్ మేన్’
57 ఏళ్లలో 40 కి.మీ రోడ్లు నిర్మించిన ధీరుడు
ముంబై: పొరుగూరికి రోడ్డు వేయడానికి కొండను పిండి చేసిన బిహార్ యోధుడు దశరథ్ మాంఝీ. ఆయన జీవితకథ ఆధారంగా ఇటీవలే ‘మాంఝీ- ద మౌంటెన్ మేన్’ పేరుతో హిందీలో ఓ సినిమా వచ్చింది. మాంఝీలాంటి వీరుడొకరు మహారాష్ట్రలోనూ ఉన్నాడు. ఆయన పేరు రాజారామ్ భాప్కర్. ఆయన 57 ఏళ్లు అవిరామంగా కష్టపడి ఏడు కొండలను నుగ్గు చేసి పలు గ్రామాలకు ఏడు రోడ్లను నిర్మించాడు.
వాటి మొత్తం పొడవు 40 కి.మీ. ఈ సాహసాన్ని గౌరవించి ఆ ధీరుడిని అక్కడి ప్రజలు ‘భాప్కర్ గురూజీ’ అని ఆప్యాయంగా పిలుస్తుంటారు. 84 ఏళ్ల వయసున్న భాప్కర్ మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా గుండెగావ్‌లో టీచర్‌గా పనిచేసి రిటైరయ్యాడు. ఆయన ఏడో తరగతి వరకే చదువుకున్నారు. తెల్లచొక్కా, పైజామా, గాంధీ టోపీతో సౌమ్యుడిగా కనిపించే ఆయన మదిలో ఉక్కు సంకల్పం ఉంది. స్వాతంత్య్రం వచ్చేనాటికి గుండెగావ్ నుంచి పక్క ఊరికి కాలిబాట కూడా ఉండేది కాదు. ఆయన కొలెగావ్‌లో పనిచేస్తున్నప్పుడు గుండెగావ్ ప్రజలు అక్కడికి చేరుకోవడానికి మూడు గ్రామాలను దాటాల్సి వచ్చేది.
700 మీటర్ల ఎత్తున్న సంతోష కొండను పగలగొట్టి రోడ్డు వేయాలని భాప్కర్ ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో ఒంటరి పోరాటం ప్రారంభించారు. కొండను పగలగొట్టే పనిలోకి దిగారు. తనతోపాటు పనిచేస్తున్న వారికి తన జీతంలోంచి వేతనాలు చెల్లించాడు. రోడ్డు పనికి యంత్రాలను కూడా అద్దెకు తీసుకున్నారు. ‘సగం జీతాన్ని పనివాళ్ల వేతనాలకు ఖర్చు పెట్టాను. రోడ్డు పనికి ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు.
రిటైర్ అయ్యాక వచ్చిన డబ్బులు, పింఛను మొత్తం రోడ్డు పనికే ఖర్చు పెట్టాను’ అని భాప్కర్ చెప్పారు. రోడ్లు నిర్మించక ముందు కొలేగావ్ నుంచి గుండెగావ్‌కు 29 కి.మీ ప్రయాణించాల్సి వచ్చేది. కొండ పగలగొట్టి 1997లో రోడ్డు నిర్మాణం పూర్తి చేశాక ప్రయాణం 10 కి.మీకి తగ్గింది. 1968లో అక్కడి కాలిబాటలో సైకిల్ కూడా సరిగ్గా వెళ్లేది కాదు. ఇప్పుడు భారీ వాహనాలు కూడా వెళ్తున్నాయి.