హెలెన్... హై ఎలర్ట్
సాక్షి, కాకినాడ : ఊహించనిరీతిలో విరుచుకుపడిన ‘హెలెన్’తుపాను విలయతాండవం చేసింది. జిల్లాలో ఆరుగుర్ని పొట్టనపెట్టుకుని అపారనష్టాన్ని మిగిల్చిన దీని తీవ్రతను జిల్లా యంత్రాంగం ముందుగానే అంచనా వేయగలిగింది. కచ్చితంగా ఉభయగోదావరి జిల్లాల మధ్య ఇది తీరాన్ని దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేయడంతో ఈ రెండు జిల్లాలను హై ఎలర్ట్ జోన్‌గా ప్రకటించారు. దీంతో జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. అయితే దీని తీవ్రతను పూర్తి స్థాయిలో అంచనా వేయలేక పోయింది. కలెక్టరేట్‌తో పాటు ఆర్డీఒ, మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి అప్రమత్తం చేయడంతో కొంతవరకు నష్ట తీవ్రతను అరికట్టగలిగారు.
పునరావాస కేంద్రాల ఏర్పాటుపై మాటపడే పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకు, పునరావాస కేంద్రాల ఏర్పాటు కోసం మండలానికి లక్షరూపాయల చొప్పున కలెక్టర్ నీతూ ప్రసాద్ గురువారమే విడుదల చేశారు. తీరంలోని 14 మండలాల్లో తుపాను ప్రభావం చూపింది. కాగా జిల్లాలో 5931 మందిని 40 కేంద్రాలకు తరలించారు. జిల్లావ్యాప్తంగా ఆరుగురు మృత్యువాతపడగా, వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. వీటికి సంబంధించిన సమాచారం మాత్రం శుక్రవారం రాత్రి వరకు జిల్లా కేంద్రానికి చేరలేదు. కలెక్టర్ విజ్ఞప్తితో జాతీయ విపత్తు నివారణ సంస్థ నుంచి రెండు రెస్క్యూ టీమ్‌లు రాగా ఒక టీమ్‌ను అమలాపురం, మరొక టీమ్ ను రాజోలుకు పంపారు.
కోనసీమలోనే మకాం
కలెక్టర్ అమలాపురం ఆర్డీఒ కార్యాలయంలోనే మకాం వేసి తుపాను పునరావాస చర్యల్ని సమీక్షించారు. జేసీ ఆర్. ముత్యాలరాజు రాజోలులోనూ, ఏజేసీ మార్కండేయులు భైరవపాలెంలోనూ మకాం వేసి సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులను తీరానికి చేర్చేందుకు శ్రమించారు.
మత్స్యకారులంతా క్షేమం
వేటకు వెళ్లిన వివిధ ప్రాంతాల మత్స్యకారులు 57 మంది హెలెన్ ప్రభావంతో సముద్రంలో చిక్కుకున్నారు. కాకినాడ పర్లోపేటకు చెందిన ఆరుగురు మత్స్యకారులు నిజాంపట్నం వద్ద , తొండంగి మండలం కె.పెరుమాళ్లపురానికి చెందిన 13 మంది ఓడలరేవు వద్ద శుక్రవారం రాత్రికి తీరానికి చేరుకున్నారు. కాకినాడఏటిమొగ, కొండబాబు కాలనీ, ఆటోనగర్, సూర్యారావుపేటలకు చెందిన మరో 38 మంది సముద్రంలో చిక్కుకున్నారు. మెరైన్, కోస్టుగార్డు సిబ్బందితో పాటు విశాఖపట్నం నుంచి కోస్టుగార్డు గస్తీనౌక, హెలికాప్టర్ల సాయంతో వీరిని గుర్తించారు. సముద్రం కల్లోలంగా ఉండడంతో వీరిని తీరానికి తీసుకొచ్చేందుకు శుక్రవారం రాత్రి వరకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వీరంతా ఫోన్లో టచ్‌లో ఉన్నారని శనివారం ఉదయం ఒడ్డుకు తీసుకొస్తామని జిల్లా అధికారులు చెబుతున్నారు.
48 గంటల పాటు భారీ వర్షాలు
రానున్న 48 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ స్పష్టం చేయడంతో మత్స్య కారులను వేటకు వెళ్లవద్దని కలెక్టర్ హెచ్చరించారు. పల్లపుప్రాంతప్రజలు పునరావాస కేంద్రాలకు రావాలని కోరారు. కోనసీమలో 216 జాతీయ రహదారిపై నేలకూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలను వెంటనే తొలగించి రాకపోకలు పునరుద్ధరించారు. జిల్లా వ్యాప్తంగా 11కేవి హైటెన్షన్ పోల్స్ 526, 33 కేవీ లోటెన్షన్ పోల్స్ కూలడంతో రాజమండ్రి, కాకినాడ నగరాలు, ప్రధాన పట్టణాలతో పాటు 900 గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోగా శుక్రవారం రాత్రికి 80 శాతం గ్రామాల్లో విద్యుత్ పునరుద్ధరించారు. జిలా లో 179 పూరిళ్లు, 4 పక్కా ఇళ్లు పూర్తిగా ధ్వసమయ్యాయి.
నేడు రవిచంద్ర సమీక్ష
పునరావాస చర్యల పర్యవేక్షణకు జిల్లా ప్రత్యేకాధికారిగా నియమితులైన ఎం. రవిచంద్ర శనివారం రానున్నారు. ఉదయం 10 గంటలకు కాకినాడలో అధికారులతో సమీక్షిస్తారు. కేంద్ర మంత్రి ఎం.ఎం.పళ్లంరాజు, రాష్ర్ట మంత్రి తోట నరసింహం పాల్గొంటారు. కాగా శనివారం జరగాల్సిన జిల్లా విజిలెన్స్ అండ్ మోనటరింగ్ కమిటీ సమావేశాన్ని, డయల్ యువర్ జేసీ కార్యక్రమాన్ని రద్దు చేశారు.