Mrinalini Sarabhai
-
ఆమె చనిపోతే.. ప్రధానికి పట్టదా?
అహ్మదాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి, సామాజికవేత్త మల్లికా సారాభాయ్ విమర్శలు గుప్పించారు. తన తల్లి, ప్రముఖ నాట్యకళాకారిణి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత మృణాళిని సారాభాయ్(97) మృతిపట్ల ప్రధాని సంతాపం వ్యక్తం చేయకపోవడాన్ని ఆమె తప్పుబట్టారు. దేశ ప్రతిష్టను ఇనుమడింప చేసి, గుజరాత్ కు చెందిన సీనియర్ కళాకారిణి కన్నుమూస్తే నివాళులర్పించలేదని మల్లికా సారాభాయ్ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఈ విషయం ప్రధానికి పట్టలేదని ఆమె తన ఫేస్బుక్ లో వ్యాఖ్యానించారు. నాట్యకళారంగానికి ఎనలేని సేవలను చేసి ప్రపంచ వ్యాప్తంగా భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు సంపాదించిపెట్టిన కళాకారిణి మరణంపై దేశ ప్రధాని స్పందిచపోవడం శోచనీయమన్నారు. రాజకీయంగా పరస్పరం భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కనీస మర్యాదలను పాటించాలని హితవు చెప్పారు. ఆమె ఘనమైన సేవలను దేశ ప్రధానిగా గుర్తించాల్సిన అవసరం ముందని వ్యాఖ్యానించారు. లెజండ్రీ నాట్య కళాకారిణి మృణాళిని సారాభాయ్ గుజరాత్ హస్తకళల అభివృద్ధి సంస్థకు అనేక సంవత్సరాలపాటు చైర్ పర్సన్‌గా పనిచేశారు. గ్రామీణ హస్తకళలు, తోలుబొమ్మలాట వంటి కళారూపాల పునరుద్ధరణకు విశేష కృషి చేశారు. మృణాళిని సారాభాయ్ గురువారం కన్నుమూసిన విషయం తెలిసిందే. కాగా 2012 గుజరాత్ అల్లర్ల సందర్భంగా మల్లికా సారాభాయ్ అప్పటి ముఖ్యమంత్రి నరేంద్రమోదీపై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. -
మృణాళిని సారాభాయి కన్నుమూత
అనారోగ్యంతో నర్తకి తుదిశ్వాస అహ్మదాబాద్: ప్రముఖ శాస్త్రీయ నృత్యకళాకారిణి మృణాళిని సారాభాయి గురువారం అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమె వయసు 97 సంవత్సరాలు. ఆరోగ్య సమస్యలతో ఆమె బుధవారం అహ్మదాబాద్‌లోని ఒక ఆస్పత్రిలో చేరారు. గురువారం ఉదయం ఆమెను స్వగృహానికి తరలించడంతో అక్కడ తుదిశ్వాస విడిచారు. శాస్త్రీయ నృత్యం ద్వారా ఆధునిక సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు మృణాళిని సారాభాయి ఎనలేని కృషి చేశారు. చెన్నైలో స్థిరపడిన కేరళ కుటుంబంలో మృణాళిని జన్మించారు. సారాభాయి చిన్నతనంలోనే గురువు మీనాక్షి సుందరం పిళ్లై వద్ద భరతనాట్యంలో శిక్షణ పొందారు. ఆ తర్వాత ఆమె కథాకళి నేర్చుకున్నారు. ప్రాథమిక విద్యను చెన్నైలో పూర్తిచేసిన మృణాళిని.. ఫ్రాన్స్.. స్విట్జర్లాండ్‌లో పై చదువులను అభ్యసించారు. అనంతరం శాంతినికేతన్లో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన విశ్వభారతి విశ్వవిద్యాలయంలో ఉన్నతవిద్యను అభ్యసించేందుకు స్వదేశం వచ్చారు. అక్కడ ఇతర కళల్లో సైతం ఆమె శిక్షణ పొందారు. అమెరికాలోని అమెరికన్ అకాడమీ ఆఫ్ డ్రమెటిక్ ఆర్ట్స్‌లోనూ.. జావా(ఇండోనేసియా)లోనూ ఆమె నటనలో శిక్షణ తీసుకున్నారు. 1942లో భారత అంతరిక్ష పరిశోధనల పితామహుడు విక్రం సారాభాయిని మృణాళిని వివాహం చేసుకున్నారు. సెంటర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ వ్యవస్థాపకుడు కార్తికేయ సారాభాయి, ప్రముఖ నృత్యకారిణి మల్లికా సారాభాయి వీరి సంతానమే. విక్రం సారాభాయి అందించిన మద్దతుతో ఆమె 1948లో ‘దర్పణ్’ పేరిట అహ్మదాబాద్‌లో నృత్యం, డ్రామా, సంగీత అకాడమీని ప్రారంభించారు. ఆ తర్వాత నృత్యం నేర్చుకునే దేశ విదేశాల్లోని ఔత్సాహికులకు గొప్ప కేంద్రంగా ఈ అకాడమీ నిలిచింది. మృణాళిని 300కుపైగా డ్యాన్స్ డ్రామాలకు నృత్యదర్శకత్వం వహించారు. వీటికి రచన కూడా ఆమే చేశారు. శాస్త్రీయ నృత్యానికి దేశవిదేశాల్లో ప్రాచుర్యం తీసుకొచ్చేందుకు ఆమె చేసిన సేవలు మరువలేనివి. సంప్రదాయ కుటుంబంలో పుట్టిన సారాభాయి.. అప్పటి వరకు మతం ప్రాతిపదికగా నృత్య ప్రదర్శనలు ఇచ్చే సంస్కృతిని పక్కన పెట్టి ఆధునిక కాలానికి చెందిన కథలకు పెద్దపీట వేశారు. కృష్ణగోపాల్.. మహాభారత్.. మొదలైన ఆమె నృత్యరూపకాలు ప్రస్తుత సమాజానికి అద్దంపట్టేవి. కళారంగానికి ఆమె చేసిన సేవలకుగానూ అనేక అవార్డులు వరించాయి. 1992లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది. గుజరాత్ రాష్ట్ర హస్తకళలు, చేనేత అభివృద్ధి కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గానూ మృణాళిని పనిచేశారు. తన తల్లి సంప్రదాయ భావాలు కలిగిన ఆధునిక మహిళ అని మృణాళిని కుమార్తె మల్లికా సారాభాయి పేర్కొన్నారు. భరతనాట్యం.. కథాకళి వంటి శాస్త్రీయ నృత్యాలను మార్చకుండా ప్రస్తుత సమాజం ఎదుర్కొంటున్న సమస్యలపై ఆమె అద్భుతమైన డ్యాన్స్ డ్రామాలను సృష్టించారని చెప్పారు.