ఆమె చనిపోతే.. ప్రధానికి పట్టదా?
అహ్మదాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి, సామాజికవేత్త మల్లికా సారాభాయ్ విమర్శలు గుప్పించారు. తన తల్లి, ప్రముఖ నాట్యకళాకారిణి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత మృణాళిని సారాభాయ్(97) మృతిపట్ల ప్రధాని సంతాపం వ్యక్తం చేయకపోవడాన్ని ఆమె తప్పుబట్టారు. దేశ ప్రతిష్టను ఇనుమడింప చేసి, గుజరాత్ కు చెందిన సీనియర్ కళాకారిణి కన్నుమూస్తే నివాళులర్పించలేదని మల్లికా సారాభాయ్ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఈ విషయం ప్రధానికి పట్టలేదని ఆమె తన ఫేస్బుక్ లో వ్యాఖ్యానించారు.
నాట్యకళారంగానికి ఎనలేని సేవలను చేసి ప్రపంచ వ్యాప్తంగా భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు సంపాదించిపెట్టిన కళాకారిణి మరణంపై దేశ ప్రధాని స్పందిచపోవడం శోచనీయమన్నారు. రాజకీయంగా పరస్పరం భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కనీస మర్యాదలను పాటించాలని హితవు చెప్పారు. ఆమె ఘనమైన సేవలను దేశ ప్రధానిగా గుర్తించాల్సిన అవసరం ముందని వ్యాఖ్యానించారు. లెజండ్రీ నాట్య కళాకారిణి మృణాళిని సారాభాయ్ గుజరాత్ హస్తకళల అభివృద్ధి సంస్థకు అనేక సంవత్సరాలపాటు చైర్ పర్సన్‌గా పనిచేశారు. గ్రామీణ హస్తకళలు, తోలుబొమ్మలాట వంటి కళారూపాల పునరుద్ధరణకు విశేష కృషి చేశారు. మృణాళిని సారాభాయ్ గురువారం కన్నుమూసిన విషయం తెలిసిందే.
కాగా 2012 గుజరాత్ అల్లర్ల సందర్భంగా మల్లికా సారాభాయ్ అప్పటి ముఖ్యమంత్రి నరేంద్రమోదీపై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.