జైపూర్/జోథ్‌పూర్: దళితుల కోసం పనిచేస్తున్నామని చెప్పుకుంటున్న ప్రధాని మోదీ, దళిత ఇంజినీరింగ్ అధికారిపై దాడికి పాల్పడిన వ్యక్తికి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశమెలా ఇస్తారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. మలింగకు టిక్కెట్ ఇవ్వడం ద్వారా రాజస్తాన్ రాజకీయ చరిత్రలో బీజేపీ చీకటి అధ్యాయం లిఖించినట్లయిందని సీఎం అశోక్ గెహ్లోత్ విమర్శించారు.
బారి అసెంబ్లీ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌కు చెందిన గిరిరాజ్ సింగ్ మలింగ విద్యుత్ శాఖ ఇంజినీరింగ్ అధికారిపై దాడికి పాల్పడినట్లు ఆరోపణలొచ్చాయి. దీంతో పార్టీ ఆయనకు టిక్కెట్ నిరాకరించింది. ఆ తర్వాత మలింగ బీజేపీలో చేరడం, ఆ పార్టీ తరఫున ఎన్నికల బరిలోకి దిగడం జరిగిపోయాయి. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, సీఎం గెహ్లోత్ శనివారం జైపూర్‌లోని ఎస్‌ఎంఎస్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాధిత అధికారి హర్షాధిపతి వాల్మీకిని పరామర్శించారు.
అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ‘మలింగ చేసిన పనిని చూసి అతడిని మేం దూరంగా పెట్టాం. అతడికి టిక్కెట్టివ్వకుంటే ఏమవుతుంది? ఏ పార్టీ కూడా అలాంటి వారికి చోటివ్వరాదు. మరోవైపు, పేదల కోసం ఎంతో చేశామని బీజేపీ చెప్పుకుంటోంది. తనది పేదల పక్షమని ప్రధాని మోదీ స్వయంగా అంటున్నారు. వాస్తవం మాత్రం వేరుగా ఉంది. ఇతరులపై దాడులకు పాల్పడే వారికి మోదీ, అమిత్ షా అవకాశమిస్తున్నారు. మలింగకు బీజేపీ టిక్కెటివ్వడం సిగ్గుచేటు. దీనిని ఖండిస్తున్నాను’అని పేర్కొన్నారు.
అనంతరం గెహ్లోత్ మాట్లాడుతూ..‘దళిత అధికారిపై దాడిని బీజేపీ ఖండించింది. కానీ, అందుకు కారకుడైన వ్యక్తిని అక్కున చేర్చుకుని, టిక్కెట్టిచ్చింది. అధికారం కోసం బీజేపీ ఎంతకైనా దిగజారుతుందని ఈ ఘటన రుజువు చేసింది. బీజేపీ వైఖరేంటో అర్థమవుతుంది. అది దళిత వ్యతిరేకి. దీనితో రాజస్తాన్ రాజకీయ చరిత్రలో బీజేపీ చీకటి అధ్యాయం లిఖించింది’అని పేర్కొన్నారు.
అంతకు సుమారు రెండు గంటలకు ముందు ప్రధాని మోదీ భరత్‌పూర్‌లో జరిగిన ర్యాలీలో రాజస్తాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహిళలు, దళితులపై దాడులు పెరిగిపోయాయంటూ చేసిన ఆరోపణలపై వారు పైవిధంగా స్పందించారు. గత ఏడాది మార్చిలో ధోల్‌పూర్ విద్యుత్ శాఖ కార్యాలయంలో ఎమ్మెల్యే మలింగ, అతడి మద్దతుదారులు చేసిన దాడిలో వాల్మీకి, మరో అధికారి తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుంచి వాల్మీకి ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఘటన అనంతరం ఎమ్మెల్యే మలింగ పోలీసులకు లొంగిపోయారు. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment