MSME loan expo
-
ఇది చరిత్రాత్మక నిర్ణయం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: రిటైల్, హోల్ సేల్ వ్యాపారాలనూ ఎంఎస్ఎంఈ పరిధిలోకి తీసుకొస్తున్నట్టు నిన్న కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కీలక నిర్ణయంపై ప్రధాని నరేంద్ర మోదీ నేడు స్పందించారు. సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) జాబితాలో రిటైల్, హోల్ సేల్ వ్యాపారాలను చేర్చి తమ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని మోదీ అన్నారు. దీని వల్ల కోట్లాది మంది వర్తకులకు లబ్ధి చేకూరుతుందని మోదీ చెప్పారు. వేగంగా ఆర్థిక సాయం అందడంతో పాటు వారి వ్యాపారాలు వృద్ధి చెందుతాయన్నారు. వ్యాపారుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఈ మేరకు ట్విటర్లో ఆయన ట్వీట్ చేశారు. ఇక నూతన మార్గదర్శకాలను ఆయన విడుదల చేశారు. కొత్త నిబంధనలతో దాదాపు 2.5 కోట్ల మంది రిటైల్, హోల్ సేల్ వర్తకులు లబ్ధి పొందుతారని చెప్పారు. దీంతో ఆర్బీఐ నిబంధనల ప్రకారం ప్రాధాన్య రంగాలకు రుణాల్లో చిరు వర్తకులకు లాభం కలుగుతుంది. అంతేగాకుండా ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్ లో వారు నమోదు చేసుకోవచ్చు. Our government has taken a landmark step of including retail and wholesale trade as MSME. This will help crores of our traders get easier finance, various other benefits and also help boost their business. We are committed to empowering our traders. https://t.co/FTdmFpaOaU — Narendra Modi (@narendramodi) July 3, 2021 అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య సీఏఐటీ.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించింది. ఇకపై ఎంఎస్ఎంఈలకు వర్తించే ప్రభుత్వ స్కీములు, ప్రయోజనాలు తమకు కూడా లభించగలవని సీఏఐటీ జాతీయ ప్రెసిడెంట్ బీసీ భార్తియా, సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. తాజా నిర్ణయంతో ఆయా వర్గాలకు రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారం ప్రాధాన్యతా రంగం కింద రుణాలు పొందేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. చిన్న సంస్థలను పటిష్టం చేసేందుకు, ఆర్థిక వృద్ధికి వాటిని చోదకాలుగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని గడ్కరీ నిన్న ట్వీట్ చేశారు. తాజా మార్గదర్శకాలతో ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద 250 కోట్లపైగా టర్నోవర్ ఉన్న హోల్‌సేల్ వ్యాపారులు, చిన్నస్థాయి రిటైలర్లు త్వరగతిన ఫైనాన్స్ పొందే అవకాశం ఉంటుందని వెల్లడించారు. వారు ఉద్యమ్ పోర్టల్‌లో కూడా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. -
చెల్లించగలిగితే చాలు.. రుణమిస్తాం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చెల్లించగలిగే స్థోమత ఉన్న వారికి రుణమిస్తామని ప్రభుత్వరంగ కెనరా బ్యాంకు తెలిపింది. ఇల్లు కట్టుకోవాలని, కారు కొనుక్కోవాలని, ఉన్నత విద్య అభ్యసించాలని, వ్యాపారం ప్రారంభించాలని.. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో కోరిక ఉంటుంది. ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న సామాన్యుల ఆకాంక్షను నెరవేరుస్తామని బ్యాంకు సీఎండీ ఆర్.కె.దూబే స్పష్టం చేశారు. రెండు రోజులపాటు జరుగనున్న కెనరా బ్యాంకు మెగా రిటైల్, ఎంఎస్ఎంఈ ఎక్స్పోను బుధవారమిక్కడ ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. చిల్లర వర్తకం, వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, కార్పొరేట్ రంగాలకు విరివిగా రుణాలిస్తున్నట్టు చెప్పారు. మరో మూడు సర్కిల్స్..: రాష్ట్రంలో రాజకీయంగా సమస్యలున్నాయని బ్యాంకు సిబ్బంది తనతో అన్నారని దూబే తెలిపారు. రాజకీయ అంశాలతో బ్యాంకు సేవలను ముడిపెట్టవద్దని వారికి సూచించినట్లు తెలిపారు. ఎక్స్పో సందర్భంగా 16,695 మంది లబ్ధిదారులకు రూ.359 కోట్ల మేర రుణాలిస్తున్నట్టు చెప్పారు. తిరుపతి, విజయవాడ, వరంగల్‌లో సర్కిల్ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఎన్పీఏ మరింత తగ్గుతుంది.. కెనరా బ్యాంకు స్థూల నిరర్ధక ఆస్తులు(ఎన్పీఏ) ప్రస్తుతం 2.5 శాతముంది. రానున్న రోజుల్లో ఇది మరింత తగ్గుతుందని బ్యాంకు ఆశిస్తోంది. మార్చికల్లా రూ.2,500 కోట్ల నిధులు సమీకరించే అవకాశం ఉంది. డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ నుంచి రావాల్సిన రూ.350 కోట్ల బకాయికి సంబంధించి కోర్టు నుంచి ఆ కంపెనీ ఆస్తుల అటాచ్మెంట్ లేదా అమ్మకం ఆదేశాలు రావొచ్చని బ్యాంకు ఆశిస్తోంది. ఇ-లాంజ్‌లో ఎన్నో సేవలు.. కెనరా బ్యాంకు ఇ-లాంజ్ పేరుతో వినూత్న కేంద్రాలను అందుబాటులోకి తెస్తోంది. రాష్ట్రంలో తొలిసారిగా హైదరాబాద్‌లోని హైదర్‌గూడలో దీనిని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో నగదు డ్రా చేసుకోవడంతోపాటు చెక్కులను డిపాజిట్ చేయవచ్చు. లావాదేవీల వివరాలను పాస్ బుక్‌లో ముద్రించుకోవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఆన్లైన్ ట్రేడింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. ఏవైనా సమస్యలు తలెత్తితే కాల్ సెంటర్‌కు ఫిర్యాదు చేసేందుకు వీలుగా ఫోన్ అందుబాటులో ఉంటుంది. కస్టమర్లకు సహాయపడేందుకు ఒక ఉద్యోగి ఉంటారు. దేశవ్యాప్తంగా ఇటువంటి లాంజ్‌లు 35 ఉన్నాయి.