Muhammad Aamir
-
పాక్ జట్టులో ఆమిర్‌కు చోటు
కరాచీ: ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ లో పునరాగమనం చేసిన పాకిస్తాన్ పేసర్ మొహ్మద్ ఆమిర్ కు ఇంగ్లండ్‌కు వెళ్లే జట్టులో స్థానం కల్పించారు. గతంలో ఇంగ్లండ్ తో మ్యాచ్ సందర్భంగా ఫిక్సింగ్‌కు పాల్పడి ఐదు సంవత్సరాల నిషేధం ఎదుర్కోవడంతో ఆమిర్ కు యూకే హైకమిషన్ నుంచి వీసా మంజూరుపై స్పష్టత రావాల్సి ఉంది. అతని వీసాపై ఎటువంటి ఇబ్బందులు తలెత్తబోవని భావిస్తున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) అతనికి ప్రాబుబుల్స్ లో చోట కల్పిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇటీవల భారత్ లో జరిగిన టీ 20 వరల్డ్ కప్ లో ఆకట్టుకున్న ఆమిర్.. ఇంగ్లండ్ తో జరిగే నాలుగు టెస్టుల సిరీస్‌లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉండటంతో అతన్ని ఎంపిక అనివార్యమైంది. ఈ మేరకు 17 సభ్యులతో కూడిన పాక్ జట్టును ప్రకటించారు. పాక్ జట్టు: మిస్బావుల్ హక్(కెప్టెన్), మొహ్మద్ హఫీజ్, సమీ అస్లామ్, షాన్ మసూద్, యూనిస్ ఖాన్, అజర్ అలీ, అసాద్ షఫిక్, ఇఫ్తికార్ అహ్మద్, సర్ఫరాజ్ అహ్మద్, మొహ్మద్ రిజ్వాన్, యాసిర్ షా, జుల్ఫికర్ బాబర్, వాహబ్ రియాజ్, మొహ్మద్ ఆమిర్, రహత్ అలీ, ఇమ్రాన్ ఖాన్, సొహైల్ ఖాన్ -
ఆమిర్‌పై కోహ్లి ప్రశంసలు
మిర్పూర్: గతంలో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి ఐదు సంవత్సరాల నిషేధం అనంతరం పునరాగమనం చేసిన పాకిస్తాన్ పేసర్ మొహ్మద్ ఆమిర్‌పై టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ప్రశంసలు కురిపించాడు. ఆమిర్ అంతర్జాతీయ క్రికెట్ పునరాగమనాన్ని ఆహ్వానిస్తూనే.. అతనొక అత్యుత్తమ బౌలర్ అని కొనియాడాడు. ఇప్పటివరకూ ఆమిర్ క్రికెట్ లో స్థిరంగా ఉండి ఉంటే ప్రపంచ టాప్-3 బౌలర్లలో ఉండేవాడన్నాడు. ఆసియా కప్ ట్వంటీ 20 టోర్నమెంట్ లో భాగంగా ఫిబ్రవరి 27 వ తేదీన పాకిస్తాన్‌తో భారత్ తలపడనున్న నేపథ్యంలో కోహ్లి మీడియాతో ముచ్చటిస్తూ.. తమ మధ్య పోరును సాధారణ క్రికెట్ మ్యాచ్ మాదిరిగానే చూడాలన్నాడు. తాము ఏరకంగా అయితే మిగతా జట్లతో పోరుకు సన్నద్ధం కానున్నమో పాకిస్తాన్ తో కూడా అదే తరహాలో సిద్ధమవుతున్నామన్నాడు. దీనిలో భాగంగానే ఆమిర్ రాకను కోహ్లి స్వాగతించాడు. తాను ఎప్పుడూ ఆమిర్ ను వరల్డ్ క్లాస్ బౌలర్ గా నమ్ముతానని స్సష్టం చేశాడు. అతను చేసిన పొరపాటు నుంచి పాఠం నేర్చుకుని బరిలోకి దిగుతున్నాడని కోహ్లి పేర్కొన్నాడు. అతని వేసే పేస్ తో బౌన్సర్, యార్కర్లను అవలీలగా సంధిస్తాడన్నాడు. అతనొక టాలెంట్ ఉన్న క్రికెటర్ అనడంలో ఎటువంటి సందేహం కోహ్లి అభిప్రాయపడ్డాడు. -
ఆమిర్‌కు వెల్కమ్
కరాచీ: స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి ఐదేళ్ల నిషేధం ఎదుర్కొన్న మొహమ్మద్ ఆమిర్ పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టులో పునరాగమనానికి రంగం సిద్ధమయ్యింది. త్వరలో న్యూజిలాండ్ తో సిరీస్ సందర్భంగా ఆమిర్ కు పాకిస్తాన్ జట్టులో చోటు లభించింది. శుక్రవారం పాకిస్తాన్ క్రికెటర్ల ఎంపికలో భాగంగా 16 సభ్యులతో కూడిన జట్టులో ఆమిర్ కు స్థానం దక్కింది. అటు వన్డేల్లోనూ, ట్వంటీ 20ల్లోనూ ఆమిర్ ను సెలక్టర్లు ఎంపిక చేయడం విశేషం. పాకిస్తాన్ జట్టులో మొహ్మద్ ఆమిర్ తో పాటు ఆసాద్ షాఫిక్, షోయబ్ మస్జూద్, ఇమాద్ వసీంలు జట్టులో రాగా, యాసిర్ షా, అమిర్ యామిన్, బిలాల్ ఆసిఫ్, ఇఫ్తికార్ అహ్మద్ లకు చోటు దక్కలేదు. ఆమిర్ రాకను పాకిస్తాన్ చీఫ్ కోచ్ వసీం అక్రమ్ స్వాగతించాడు. పాకిస్తాన్ జట్టు బౌలింగ్ కు ఆమిర్ ఒక అదనపు బలమని పేర్కొన్నాడు. అతనికి తిరిగి జట్టులో చోటు కల్పించడం తనను ఏమాత్రం ఆశ్చర్యానికి గురి చేయలేదని పేర్కొన్నాడు. ప్రతిభావంతుడైన ఆమిర్ జట్టులో స్థానం దక్కడం ముందుగా ఊహించినదేనని పేర్కొన్నాడు. ఇటీవల పాకిస్తాన్ లో జరిగిన దేశవాళీ మ్యాచ్ ల్లో ఆమిర్ అద్భుతంగా రాణించిన సంగతిని వసీం ఈ సందర్భంగా గుర్తు చేశాడు. ఇదిలా ఉండగా, పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రమీజ్ రాజా మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆమిర్ పై చాలా ఒత్తిడి ఉందని, దాన్ని అధిగమించడానికి అతను తీవ్రంగా శ్రమించాల్సిన అవసరం ఉందన్నాడు. -
అమిర్ కు పీసీబీ వార్నింగ్
కరాచీ:పాకిస్థాన్ దేశవాళీ క్రికెట్ లో క్రీడా నియమావళిని ఉల్లంఘించి ప్రత్యర్థి ఆటగాడితో ఘర్షణకు దిగిన మహ్మద్ అమిర్ కు ఆ దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ) గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. మళ్లీ అటువంటి చర్యలకు పాల్పడితే కఠిన శిక్షను ఎదుర్కొవాల్సి వస్తుందంటూ హెచ్చరించింది. ఈ మేరకు అమిర్ ను పీసీబీ చైర్మన్ షహర్ యార్ ఖాన్ తీవ్రంగా మందలించారు. ' ఇది కచ్చితంగా నిబంధలను ఉల్లంఘించినట్లే అవుతుంది. అమిర్ నుంచి మరోసారి ఆ తరహా ఘటనను చూడాలని అనుకోవడం లేదు. అమిర్ పునరాగమన ప్రోగ్రామ్ లో భాగంగా కొన్ని మార్గదర్శకాలున్నాయి. వాటిని అమిర్ పాటించాల్సి ఉంది' అని షహర్ యార్ ఖాన్ తెలిపారు. ఖ్వైదా-ఈ-అజామ్ ట్రోఫీలో భాగంగా గురువారం సుయి సౌత్రన్ గ్యాస్-పీఐఏల మధ్య మ్యాచ్ జరుగుతుండగా అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లైన ఫైజల్ ఇక్బాల్, మహ్మద్ అమిర్ లు ఒకరి నొకరు దూషించుకున్నారు. క్రికెట్ లో స్లెడ్జింగ్ అనేది భాగంగా మారిపోయినప్పటికీ అమిర్ ను దొంగ (చోర్) అంటూ ఇక్బాల్ దూషించాడు. మ్యాచ్ జరుగుతుండగా తొలుత అమిర్ , ఇక్బాల్ ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో అమిర్ ఘాటుగా స్పందించడంతో ఇరువురి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఇక నియంత్రణ కోల్పోయిన ఫైజల్.. నువ్వు దొంగ అంటూ అమిర్ పై వ్యక్తిగత దూషణలకు దిగాడు. తీవ్ర వివాదాన్ని రేపిన ఈ ఘటనలో ఆ క్రికెటర్లకు మ్యాచ్ రిఫరీ జరిమానా విధించారు. అమిర్ కు మ్యాచ్ ఫీజులో 150 శాతం జరిమానా పడింది. 2010లో లార్డ్స్ లో ఇంగ్లండ్ తో మ్యాచ్ సందర్భంగా అమిర్ పై ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో అతనిపై ఐసీసీ ఐదేళ్ల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. కాగా, ఇటీవల అమిర్ పై ఉన్న నిషేధాన్ని ఐసీసీతో పాటు పాకిస్థాన్ క్రికెట్ బోర్డులు ఎత్తివేయడంతో అతను దేశవాళీ పోటీల్లో పాల్గొనడానికి క్లియరెన్స్ వచ్చింది. దీనిలో భాగంగానే అమిర్ సుయి సౌత్రన్ గ్యాస్ జట్టు తరపున బరిలోకి దిగాడు. అంతర్జాతీయ క్రికెట్ పునరాగమనంలో భాగంగా అమిర్ 2016 వరకూ దేశవాళీ మ్యాచ్ ల్లో ఆడాల్సి ఉంది.