ఆమిర్కు వెల్కమ్
కరాచీ: స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి ఐదేళ్ల నిషేధం ఎదుర్కొన్న మొహమ్మద్ ఆమిర్ పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టులో పునరాగమనానికి రంగం సిద్ధమయ్యింది. త్వరలో న్యూజిలాండ్ తో సిరీస్ సందర్భంగా ఆమిర్ కు పాకిస్తాన్ జట్టులో చోటు లభించింది. శుక్రవారం పాకిస్తాన్ క్రికెటర్ల ఎంపికలో భాగంగా 16 సభ్యులతో కూడిన జట్టులో ఆమిర్ కు స్థానం దక్కింది. అటు వన్డేల్లోనూ, ట్వంటీ 20ల్లోనూ ఆమిర్ ను సెలక్టర్లు ఎంపిక చేయడం విశేషం. పాకిస్తాన్ జట్టులో మొహ్మద్ ఆమిర్ తో పాటు ఆసాద్ షాఫిక్, షోయబ్ మస్జూద్, ఇమాద్ వసీంలు జట్టులో రాగా, యాసిర్ షా, అమిర్ యామిన్, బిలాల్ ఆసిఫ్, ఇఫ్తికార్ అహ్మద్ లకు చోటు దక్కలేదు.
ఆమిర్ రాకను పాకిస్తాన్ చీఫ్ కోచ్ వసీం అక్రమ్ స్వాగతించాడు. పాకిస్తాన్ జట్టు బౌలింగ్ కు ఆమిర్ ఒక అదనపు బలమని పేర్కొన్నాడు. అతనికి తిరిగి జట్టులో చోటు కల్పించడం తనను ఏమాత్రం ఆశ్చర్యానికి గురి చేయలేదని పేర్కొన్నాడు. ప్రతిభావంతుడైన ఆమిర్ జట్టులో స్థానం దక్కడం ముందుగా ఊహించినదేనని పేర్కొన్నాడు. ఇటీవల పాకిస్తాన్ లో జరిగిన దేశవాళీ మ్యాచ్ ల్లో ఆమిర్ అద్భుతంగా రాణించిన సంగతిని వసీం ఈ సందర్భంగా గుర్తు చేశాడు. ఇదిలా ఉండగా, పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రమీజ్ రాజా మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆమిర్ పై చాలా ఒత్తిడి ఉందని, దాన్ని అధిగమించడానికి అతను తీవ్రంగా శ్రమించాల్సిన అవసరం ఉందన్నాడు.