ఆమిర్పై కోహ్లి ప్రశంసలు
మిర్పూర్: గతంలో స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడి ఐదు సంవత్సరాల నిషేధం అనంతరం పునరాగమనం చేసిన పాకిస్తాన్ పేసర్ మొహ్మద్ ఆమిర్పై టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ప్రశంసలు కురిపించాడు. ఆమిర్ అంతర్జాతీయ క్రికెట్ పునరాగమనాన్ని ఆహ్వానిస్తూనే.. అతనొక అత్యుత్తమ బౌలర్ అని కొనియాడాడు. ఇప్పటివరకూ ఆమిర్ క్రికెట్ లో స్థిరంగా ఉండి ఉంటే ప్రపంచ టాప్-3 బౌలర్లలో ఉండేవాడన్నాడు.
ఆసియా కప్ ట్వంటీ 20 టోర్నమెంట్ లో భాగంగా ఫిబ్రవరి 27 వ తేదీన పాకిస్తాన్తో భారత్ తలపడనున్న నేపథ్యంలో కోహ్లి మీడియాతో ముచ్చటిస్తూ.. తమ మధ్య పోరును సాధారణ క్రికెట్ మ్యాచ్ మాదిరిగానే చూడాలన్నాడు. తాము ఏరకంగా అయితే మిగతా జట్లతో పోరుకు సన్నద్ధం కానున్నమో పాకిస్తాన్ తో కూడా అదే తరహాలో సిద్ధమవుతున్నామన్నాడు. దీనిలో భాగంగానే ఆమిర్ రాకను కోహ్లి స్వాగతించాడు. తాను ఎప్పుడూ ఆమిర్ ను వరల్డ్ క్లాస్ బౌలర్ గా నమ్ముతానని స్సష్టం చేశాడు. అతను చేసిన పొరపాటు నుంచి పాఠం నేర్చుకుని బరిలోకి దిగుతున్నాడని కోహ్లి పేర్కొన్నాడు. అతని వేసే పేస్ తో బౌన్సర్, యార్కర్లను అవలీలగా సంధిస్తాడన్నాడు. అతనొక టాలెంట్ ఉన్న క్రికెటర్ అనడంలో ఎటువంటి సందేహం కోహ్లి అభిప్రాయపడ్డాడు.