టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిపై పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ కమ్రాన్ ఆక్మల్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రపంచవ్యాప్తంగా కోహ్లి చాలా మందికి రోల్ మోడల్ అని ఆక్మల్ కొనియాడాడు. అదేవిధంగా విరాట్ పాకిస్తాన్‌లో బాగా పాపులర్ అని అతడు చెప్పుకొచ్చాడు.
"విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఇద్దరూ తాము రిటైరయ్యే ముందు కనీసం ఒక్కసారైనా పాకిస్తాన్‌లో పర్యటించాలి. ఈ ఇద్దరూ వరల్డ్ క్రికెట్‌లో తమకంటూ ఒక క్రేజును సంపాదించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఆడేందుకు వెళ్తూ ఉంటారు. వారిద్దరిని ఇష్టపడని అభిమాని అంటూ ఉండరు.
బ్యాటింగ్, మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలతో ఈ లెజండరీ క్రికెటర్లకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. పాకిస్తాన్‌లో కూడా వీరిద్దరూ బాగా పాపులర్. ఏదో ఒక చోట కాదు దేశం మొత్తం రోకోలను ఆరాధిస్తారు. ఇక ప్రపంచంలోని చాలా మంది యువ క్రికెటర్లకు విరాట్ ఒక రోల్ మోడల్.
కోహ్లి లాంటి స్టార్ క్రికెటర్ పాకిస్తాన్‌లో పర్యటించాలని సగటు అభిమాని కోరుకుంటున్నాడు. . విరాట్ తన అండర్-19 రోజులలో పాకిస్తాన్‌కు వెళ్లాడు. కానీ అప్పుడు అతడు అభిమానుల నుంచి పెద్దగా ఆదరణ పొందలేకపోయాడు. అయితే ఇప్పుడు పరిస్థితి వేరు. కోహ్లి ఇప్పుడు పాకిస్తాన్‌కు వెళ్తే అతడికి అడుగడుగున అభిమానులు నీరాజనం పలుకుతారు. పాక్‌లో విరాట్‌కు ఉన్న ఫాలోయింగ్ మరో ఏ క్రికెటర్‌కు లేదు. అతడికి వీరాభిమానులు ఉన్నారు.
విరాట్, రోహిత్‌లతో పాటు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు సైతం మా దేశంలో భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. పాకిస్తానీ ఫ్యాన్స్ విరాట్, రోహిత్, బుమ్రాలను వారి స్వంత క్రికెట్ జట్టు ఆటగాళ్ల కంటే ఎక్కువగా ప్రేమిస్తారని" ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆక్మల్ పేర్కొన్నాడు. కాగా రోహిత్ శర్మ పాకిస్తాన్‌లో పర్యటించినప్పటికి.. కోహ్లి, బుమ్రా మాత్రం సీనియర్ జట్టు తరపున ఇప్పటివరకు పాక్ గడ్డపై అడుగుపెట్టలేదు.
Comments
Please login to add a commentAdd a comment