86 దేవాలయాలకు మాస్టర్ ప్లాన్!
అడ్డగోలు నిర్మాణాలు, పాలకమండళ్ల నిర్ణయాలకు చెక్!
వేములవాడ, న్యూస్‌లైన్: రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో అడ్డగోలు నిర్మాణాలకు అడ్డుకట్ట పడనుంది. వాటిపై నిధులు వృథా చేసేలా ఉండే పాలకమండళ్లు, కార్యనిర్వాహక అధికారుల (ఈవోల) నిర్ణయాలు ఇక చెల్లవు. ఇందుకోసం రాష్ట్ర దేవాదాయ శాఖ మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేస్తోంది. సంస్కృతీ సంప్రదాయాలు, స్థలపురాణం, భక్తుల మనోభావాలు, వారికి సౌకర్యాల కల్పన తదితర అంశాలన్నింటికీ పెద్దపీట వేస్తూ ప్రధాన ఆలయాల్లో దీన్ని అమలు చేయాలని నిర్ణయించింది. డిసెంబర్ 15లోగా ఆయా ఆలయాల స్థితిగతులపై నివేదికలు సమర్పించాలని ఈవోలకు ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్రంలోని ఆలయాలకున్న స్థిరాస్తుల పరిరక్షణతో పాటు మరో 30 సంవత్సరాల వరకు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికాబద్ధమైన నిర్మాణాలను చేపట్టడం మాస్టర్ ప్లాన్ ఉద్దేశం. దేవాదాయ శాఖ కమిషనర్ ముక్తేశ్వర్రావు, చీఫ్ ఇంజనీరు సత్యనారాయణ రెడ్డి, స్థపతి సౌందర్యరాజన్, స్థపతి సలహాదారు వేలుతో కూడిన ప్రత్యేక కమిటీ... హైదరాబాద్‌లో బుధవారం ప్రధాన దేవాలయాల ఈవోలు, ఈఈలతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జాయింట్ కమిషనర్, డిప్యూటీ జాయింట్ కమిషనర్, సహాయ కమిషనర్ స్థాయి అధికారులు ఈవోలుగా ఉన్న మొత్తం 86 ఆలయాలకు ఈ మాస్టర్ ప్లాన్ వర్తిస్తుంది. వాటిలో జాయింట్ కమిషనర్ స్థాయిలో వేములవాడ, యాదగిరిగుట్ట, భద్రాచలం, విజయవాడ, ద్వారకా తిరుమల, అన్నవరం, సింహాచలం, పెనుగంచిప్రోలు, శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీశైలం దేవాలయాలున్నాయి. అసిస్టెంట్ కమిషనర్ హోదా కలిగిన జాబితాలో సికింద్రాబాద్ గణేశ్ ఆలయం, బాసర, కొమురవెల్లి, కొండగట్టు, మహానంది, విశాఖపట్నం కనకమహాలక్ష్మి ఆలయాలను చేర్చారు. సహాయ కమిషనర్‌స్థాయి కలిగిన సుమారు 68 దేవాలయాలను మాస్టర్ ప్లాన్‌లో చేర్చారు.
మాస్టర్ ప్లాన్ రూపకల్పన ఇలా...
ప్రస్తుతం ఆలయ స్థితిగతులు, సౌకర్యాలు, చేపట్టిన పనులు, దేవస్థానానికి చేరుకునే మార్గాలు, వాటిలో దుకాణాలు, వాటి నిర్వహణ, నీరు, విద్యుత్ సరఫరా, డ్రైనేజీ, గత పదేళ్లలో ఏటా ఆలయానికి వచ్చిన భక్తుల సంఖ్య తదితర వివరాల ఆధారంగా నూతన మాస్టర్ ప్లాన్‌ను రూపొందించాలని కమిటీ సూచించింది. మరో 30 ఏళ్ల వరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా, దూరం నుంచికూడా ఆలయం కనిపించేలా ఆవరణను విస్తరించడం, రానున్న రోజుల్లో పెరిగే భక్తుల సంఖ్య అనే అంశాలను దృష్టిలో ఉంచుకొని ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది.