20 మందికి పైగా ప్రాణాలు కాపాడిన పిజ్జా బాయ్!
ముంబై: నగరంలోని చండివాలి ప్రాంతంలో ఓ బహుళ అంతస్తుల భవనంలో శనివారం సాయంత్రం సంభవించిన అగ్ని ప్రమాదంలో భారీ ప్రాణ నష్టం వాటిల్లికుండా అత్యంత ధైర్య సాహాసాలను ప్రదర్శించి శభాష్ అనిపించుకున్నాడో పిజ్జా బాయ్. అంథేరిలోని 21 అంతస్తుల భారీ భవనంలోని 14వ అంతస్తులో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ఘటనలో ఏడుగురు మృత్యువాత పడగా, 28 మంది గాయాలతో బయటపడ్డారు. వీరిని కాపాడటంలో పిజ్జా బాయ్ గా పనిచేసే జితేష్ ది కీలక పాత్ర. ఆ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కు 200 మీటర్ల దూరంలో ఉన్న ఈగల్ బాయ్స్ పిజ్జాలో జితేష్ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. అయితే తాను ఆ కాంప్లెక్స్ కు పిజ్జాను తీసుకువెళ్లిన సమయంలో అగ్నిప్రమాదం జరగడాన్ని గమనించాడు.
అప్పటికే అగ్ని ప్రమాదం జరిగిన అంతస్తులో ఉన్న వారు బాల్కనీలోకి వచ్చి పెద్ద ఎత్తున అరవడం ప్రారంభించారు.ఆ చుట్టుపక్కల వారు నీటితో మంటలను ఆర్పే యత్నం చేసినా.. ఈలోపు మంటలు తీవ్రంగా వ్యాపించి కొంతమంది సృహతప్పి పడపోయారు. దీంతో అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్ లను జితేష్ అప్రమత్తం చేశాడు. వారి సాయంతో 22 వ అంతస్తుకు చేరుకున్నాడు. అక్కడ్నుంచి ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించే యత్నం చేశారు. ఈ క్రమంలోనే 14 వ అంతస్తు నుంచి 22 వ అంతస్తుకు ప్రమాదంలో చిక్కుకున్న బాధితులను తీసుకువెళ్లే ప్రయత్నం చేశాడు. ఇలా ఎనిమిదిసార్లు పైఅంతస్తు నుంచి కింది అంతస్తుకు దిగి దాదాపు 25 మంది ప్రాణాలను కాపాడాడు. ప్రస్తుతం అందరి ప్రశంసలు అందుకుంటున్న ఆ 21ఏళ్ల పిజ్జా బాయ్ స్థానికంగా హీరోగా మారిపోయాడు.