ఐదేళ్లుగా తల్లి శవం పక్కనే నివాసం!
బెర్లిన్: వినడానికి ఆశ్చర్యంగా, వింతగా ఉన్న ఇది నిజమే! జర్మనీకి చెందిన ఓ యువతి మరణించిన తల్లికి అంత్యక్రియలు చేయకుండా ఇంట్లోనే శవాన్ని దాచిపెట్టింది. ఐదేళ్లకు పైగా ఇంట్లో తల్లి శవాన్ని పెట్టుకుని నివసించింది. బెడ్ తల్లి శవం పక్కనే నిద్రించేది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన మూనిచ్ నగరంలో జరిగింది. ఆ యువతి తల్లి మరణించిన విషయాన్ని గత వారం కనుగొన్నారు. ఆ యువతిని (55) మానసిక ఆస్పత్రిలో చేర్చారు.
అధికారులు ఆ యువతి నివాసానికి వెళ్లినా ఆమె లోపలికి అనుమతించలేదు. ఓ సామాజిక కార్యకర్త యువతి తల్లిని పరామర్శించేందుకు గత వారం ప్రయత్నించింది. ఆమెకూ ఇలాంటి అనుభవమే ఎదురవడంతో పోలీసులకు విషయం తెలియజేసింది. తలుపులు బద్దలు కొట్టి చూడగా అసలు విషయం వెలుగు చూసింది. వృద్ధురాలిని కొంతకాలంగా చూడలేదని అపార్ట్మెంట్ వాసులు చెప్పారు. కాగా ఆమె మరణం సహజమేనని పోస్ట్‌మార్టమ్ నివేదికలో తేలింది. 2009లో 77 ఏళ్ల వయసులో మరణించినట్టు వెల్లడైంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఐదేళ్లుగా ఆ యువతి తల్లి శవం పక్కనే నిద్రపోయిందట!