munagapati venkateswarlu
-
తమ్ముళ్ల లొల్లి
చీరాల, న్యూస్‌లైన్ : ఎన్నికలు సమీపిస్తున్న వేళ చీరాల తెలుగుదేశం పార్టీలో విభేదాలు తారస్థాయికి చేరాయి. గ్రూపులుగా విడిపోయి ఒకరికి వ్యతిరేకంగా మరొకరు కరపత్రాలు వేసుకుంటున్నారు. బహిరంగంగానే విమర్శలకు దిగుతుండటతో పార్టీ అధినేతకు ఫిర్యాదుల పరపంపర కొనసాగుతున్నాయి. ఇప్పటికే కొన్నేళ్లగా నియోజకవర్గ ఇన్ చార్జి లేక పార్టీ అస్తవ్యస్తంగా తయారైంది. ప్రస్తుతం సీటు వ్యవహారంలో విభేదాలు మితిమీరడంతో ఉన్న అతికొద్ది మంది కార్యకర్తలు కూడా అయోమయంలో పడ్డారు. చీరాల సీటు కోసం పరిటాల రవి అనుచరుడు పోతుల సురేష్ భార్య సునీత, మునగపాటి వెంకటేశ్వర్లు ఢీ అంటే ఢీ అంటున్నారు. అలానే సీనియర్లు చిమటా సాంబు, గొడుగుల గంగరాజు, జి.చంద్రమౌళి, జూనియర్లు గొర్ల శ్రీనివాసయాదవ్, బీరక సురేంద్ర, ఆలూరి శ్రీనివాస్‌తో పాటు మరికొందరు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా పోతుల సునీత, మునగపాటి వెంకటేశ్వర్లు మధ్యే పోటీ నెలకొని ఉంది. ఒక సామాజిక వర్గంలోని ముఖ్యులంతా పోతుల సునీతకు టికెట్ ఇవ్వాలని కొద్దిరోజులుగా ఆ పార్టీ అధినేతపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే స్థానిక పార్టీ సీనియర్లు, వేటపాలెం మండలంలోని పార్టీ నాయకులు, సర్పంచులు ఒక్కటయ్యారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన పోతుల సునీతకు సీటు ఇస్తే తామంతా పార్టీకి రాజీనామా చేస్తామంటూ తీర్మానం చేసి ఆ ప్రతులను చంద్రబాబుకు పంపారు. నాలుగు రోజుల క్రితం వేటపాలెం మండలం దేశాయిపేట సర్పంచ్ లేళ్ల శ్రీధర్, రామన్నపేట సర్పంచ్ బట్టా అనంతలక్ష్మి, పార్టీ మహిళా రాష్ట్ర కార్యదర్శి బొడ్డు సరోజినితో పాటు పలువురు గ్రామ పార్టీ నాయకులు సమావేశమయ్యారు. మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్లో సునీతకు ప్రస్తుతం ఓటుందని, ఆమె ఇంటి అడ్రస్ ఓటు సంఖ్య నంబర్ కూడా సేకరించి మీడియాకు వివరించారు. రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తికి సీటిస్తే తామంతా వ్యతిరేకంగా పనిచేస్తామని, అవసరమైతే మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. అంతటితో ఆగకుండా సునీత తెలంగాణ ప్రాంతానికి చెందిన మహిళని, ఆమెకు సహకరించొద్దని నియోజకవర్గంలో కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రచురణ మాత్రం జగన్ యూత్.. అని ముద్రించి అక్కడ కూడా వైఎస్సార్ సీపీపై తెలుగు తమ్ముళ్లు విషంగక్కారు. ఇదంతా సీటు కోసం పోటీ పడుతున్న మునగపాటి వెంకటేశ్వర్లే తన మద్దతుదారులతో చేస్తున్న పనని పోతుల సునీత వర్గం ఆరోపిస్తుంది. మొత్తానికి చీరాల టీడీపీలో తెలంగాణ చిచ్చు రోజురోజుకూ రాజుకుంటోంది. ఇంత జరుగుతున్నా టీడీపీ జిల్లా, రాష్ట్రస్థాయి నేతలు పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలు చేయకపోవడం గమనార్హం. జిల్లా ముఖ్య నాయకులైన కరణం బలరాం, దామచర్ల జనార్దన్‌లు కూడా చెరోవైపు మొగ్గు చూపుతున్నారు. బలరాం మునగపాటికి సిఫార్సు చేస్తుండగా.. జనార్దన్ మాత్రం సునీత వైపు నిలబడ్డారు. ఇప్పటికే పలుమార్లు చీరాల నియోజకవర్గ ఇన్చార్జి విషయంపై చంద్రబాబు చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఇన్చార్జిని రేపోమాపో నియమిస్తామంటూ దాటవేసే ధోరణిని ఆయన అవలంబిస్తున్నారు. స్థానికంగా మాత్రం పార్టీ కార్యకర్తలు, నాయకులు వర్గ విభేదాల మధ్య ఎటువైపు నడవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. -
చీరాల టీడీపీలో సీటు రచ్చ
చీరాల, న్యూస్‌లైన్: చీరాల టీడీపీలో సీటు చిచ్చు రగులుతోంది. నాలుగేళ్లుగా పార్టీ వైపు కన్నెత్తి చూడని సరికొత్త నాయకులు, స్థానికేతరులు సీటు కోసం పోటీ పడుతున్నారు. చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీకి నాలుగేళ్లుగా ఇన్చార్జి లేక, పార్టీని నడిపే నాథుడు లేక ఇప్పటికే క్యాడర్ బలహీనమైంది. టీడీపీకి పట్టున్న గ్రామీణ ప్రాంతాల్లో సైతం దెబ్బతింది. నావికుడు లేని నావలా మారింది. అయితే ఎన్నికల సీజన్ కావడంతో రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పలువురు ముందుకొస్తున్నారు. సీటు మాకంటే మాకంటూ తమదైన శైలిలో ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో పార్టీలో ఉన్న కొద్ది క్యాడర్ కూడా నిట్టనిలువుగా చీలింది. సీటు కోసం ప్రయత్నిస్తున్న పరిటాల రవి అనుచరుడు పోతుల సురేష్ భార్య పోతుల సునీత, మునగపాటి వెంకటేశ్వర్లు (బాబు) బలనిరూపణకు సిద్ధమయ్యారు. తమ అనుచరులతో వారు హైదరాబాద్‌లో అధినేత ఎదుట ఇప్పటికే పలుమార్లు తిష్ట వేశారు. దీనికి తోడు పార్టీకి సీనియర్ నేతలుగా ఉన్న మాజీ ఎంపీ చిమటా సాంబు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి గొడుగుల గంగరాజు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు గుద్దంటి చంద్రమౌళి, కొత్తగా వచ్చిన గొర్ల శ్రీనివాసయాదవ్, పులి వెంకటేశ్వర్లు వంటి వారు కూడా సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. నాలుగేళ్లుగా ఇన్చార్జి లేకపోయినా అండదండగా ఉన్నామని, తమకే పార్టీ సీటు ఇవ్వాలని కోరుతున్నారు. శుక్రవారం చిమటా సాంబు తన సామాజికవర్గానికి చెందిన కొందరితో ర్యాలీగా వెళ్లి జిల్లా నాయకుడిని తనకే సీటు ఇవ్వాలని కోరారు. అయితే పోతుల సునీత, మునగపాటి బాబుల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఎవరి బలం వారిదే.. పార్టీలో ఉన్న సీనియర్లు అంతా మునగపాటి బాబు వైపు నిలబడగా, ఒక సామాజిక వర్గంలోని నాయకులు సునీత వైపు నిలబడ్డారు. జిల్లా నాయకత్వం కూడా అదే పంథాలో ఉంది. రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు కరణం బలరాం మునగపాటి బాబును సిఫార్సు చేస్తుండగా, జిల్లా పార్టీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ సునీత వైపు మొగ్గు చూపుతున్నారు. పరస్పర విమర్శలు: సీట్ల వ్యవహారంలో టీడీపీ నాయకుల మధ్య విభేదాలు ఏర్పడి రెండుగా చీలిపోయారు. పోతుల సునీత స్థానికేతరురాలు, తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి.. ఆమె భర్త పోతుల సురేష్‌పై అనేక కేసులున్నాయని బాబు వర్గం ప్రచారం చేస్తోంది. సునీత వర్గం కూడా అదే స్థాయిలో మునగపాటి బాబు స్థానిక ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు చెందిన వ్యక్తని, ఆయన 2009లో టీడీపీకి రాజీనామా చేశారని ఆరోపణలు చేయడంతో పాటు కరపత్రాలు కూడా పంపిణీ చేశారు. పోతుల సునీతది పద్మశాలి సామాజికవర్గం, ఆమె భర్త సురేష్ ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో చీరాల స్థానం అనుకూలంగా ఉంటుందని భావించి చీరాల వైపు అడుగులు వేశారు. వాస్తవంగా ఆమెది తెలంగాణ ప్రాంతమైన మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్ నియోజకవర్గంలోని గ్రామం. 2004 ఎన్నికల్లో ఆలంపూర్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఓటమిపాలైంది. ఆ తర్వాత 2009లో ధర్మవరం, పెనుగొండ నియోజకవర్గాల నుంచి టీడీపీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు చీరాల నియోజకవర్గానికి ఇన్చార్జి లేకపోవడంతో ఆమె దృష్టి చీరాలపై పడింది. అయితే టీడీపీలో ఉన్న సీనియర్ నాయకులను మాత్రం తన వైపునకు తిప్పుకోలేకపోయింది. కేవలం కొందరు ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులతో నెట్టుకొస్తున్నారు. దీంతో సీనియర్ నాయకులుగా ఉన్న కొందరు ఆమె స్థానికేత రురాలని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లారు. అలానే మునగపాటి వెంకటేశ్వర్లు (బాబు) గతం నుంచి టీడీపీలో ఉన్నారు. వేటపాలెం మండల పార్టీ అధ్యక్షుడిగా, వేటపాలెం పంచాయతీ ఉపసర్పంచ్‌గా పనిచేశారు. 2009 ఎన్నికల తర్వాత ఆయన తన రెండు పదవులకు రాజీనామా చేసి పార్టీకి దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన పార్టీ సీటు కోసం రేసులో ఉన్నారు. అయితే స్థానిక ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌తో వ్యాపార లావాదేవీలు ఉన్నాయని ఆయనపై ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలో ఉన్న అతికొద్ది క్యాడర్ ఎవరి వైపు అడుగులు వేయాలో అమోమయంలో ఉన్నారు.