చీరాల, న్యూస్‌లైన్ : ఎన్నికలు సమీపిస్తున్న వేళ చీరాల తెలుగుదేశం పార్టీలో విభేదాలు తారస్థాయికి చేరాయి. గ్రూపులుగా విడిపోయి ఒకరికి వ్యతిరేకంగా మరొకరు కరపత్రాలు వేసుకుంటున్నారు. బహిరంగంగానే విమర్శలకు దిగుతుండటతో పార్టీ అధినేతకు ఫిర్యాదుల పరపంపర కొనసాగుతున్నాయి. ఇప్పటికే కొన్నేళ్లగా నియోజకవర్గ ఇన్ చార్జి లేక పార్టీ అస్తవ్యస్తంగా తయారైంది. ప్రస్తుతం సీటు వ్యవహారంలో విభేదాలు మితిమీరడంతో ఉన్న అతికొద్ది మంది కార్యకర్తలు కూడా అయోమయంలో పడ్డారు.
చీరాల సీటు కోసం పరిటాల రవి అనుచరుడు పోతుల సురేష్ భార్య సునీత, మునగపాటి వెంకటేశ్వర్లు ఢీ అంటే ఢీ అంటున్నారు. అలానే సీనియర్లు చిమటా సాంబు, గొడుగుల గంగరాజు, జి.చంద్రమౌళి, జూనియర్లు గొర్ల శ్రీనివాసయాదవ్, బీరక సురేంద్ర, ఆలూరి శ్రీనివాస్‌తో పాటు మరికొందరు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా పోతుల సునీత, మునగపాటి వెంకటేశ్వర్లు మధ్యే పోటీ నెలకొని ఉంది. ఒక సామాజిక వర్గంలోని ముఖ్యులంతా పోతుల సునీతకు టికెట్ ఇవ్వాలని కొద్దిరోజులుగా ఆ పార్టీ అధినేతపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే స్థానిక పార్టీ సీనియర్లు, వేటపాలెం మండలంలోని పార్టీ నాయకులు, సర్పంచులు ఒక్కటయ్యారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన పోతుల సునీతకు సీటు ఇస్తే తామంతా పార్టీకి రాజీనామా చేస్తామంటూ తీర్మానం చేసి ఆ ప్రతులను చంద్రబాబుకు పంపారు. నాలుగు రోజుల క్రితం వేటపాలెం మండలం దేశాయిపేట సర్పంచ్ లేళ్ల శ్రీధర్, రామన్నపేట సర్పంచ్ బట్టా అనంతలక్ష్మి, పార్టీ మహిళా రాష్ట్ర కార్యదర్శి బొడ్డు సరోజినితో పాటు పలువురు గ్రామ పార్టీ నాయకులు సమావేశమయ్యారు.
మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్‌లో సునీతకు ప్రస్తుతం ఓటుందని, ఆమె ఇంటి అడ్రస్ ఓటు సంఖ్య నంబర్ కూడా సేకరించి మీడియాకు వివరించారు. రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తికి సీటిస్తే తామంతా వ్యతిరేకంగా పనిచేస్తామని, అవసరమైతే మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. అంతటితో ఆగకుండా సునీత తెలంగాణ ప్రాంతానికి చెందిన మహిళని, ఆమెకు సహకరించొద్దని నియోజకవర్గంలో కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రచురణ మాత్రం జగన్ యూత్.. అని ముద్రించి అక్కడ కూడా వైఎస్సార్ సీపీపై తెలుగు తమ్ముళ్లు విషంగక్కారు. ఇదంతా సీటు కోసం పోటీ పడుతున్న మునగపాటి వెంకటేశ్వర్లే తన మద్దతుదారులతో చేస్తున్న పనని పోతుల సునీత వర్గం ఆరోపిస్తుంది.
మొత్తానికి చీరాల టీడీపీలో తెలంగాణ చిచ్చు రోజురోజుకూ రాజుకుంటోంది. ఇంత జరుగుతున్నా టీడీపీ జిల్లా, రాష్ట్రస్థాయి నేతలు పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలు చేయకపోవడం గమనార్హం. జిల్లా ముఖ్య నాయకులైన కరణం బలరాం, దామచర్ల జనార్దన్‌లు కూడా చెరోవైపు మొగ్గు చూపుతున్నారు. బలరాం మునగపాటికి సిఫార్సు చేస్తుండగా.. జనార్దన్ మాత్రం సునీత వైపు నిలబడ్డారు. ఇప్పటికే పలుమార్లు చీరాల నియోజకవర్గ ఇన్‌చార్జి విషయంపై చంద్రబాబు చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఇన్‌చార్జిని రేపోమాపో నియమిస్తామంటూ దాటవేసే ధోరణిని ఆయన అవలంబిస్తున్నారు. స్థానికంగా మాత్రం పార్టీ కార్యకర్తలు, నాయకులు వర్గ విభేదాల మధ్య ఎటువైపు నడవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.
తమ్ముళ్ల లొల్లి
Published Fri, Feb 28 2014 2:31 AM | Last Updated on Sat, Sep 2 2017 4:10 AM
Advertisement