చీరాల టీడీపీలో సీటు రచ్చ | fighting for seat in telugu desam party | Sakshi
Sakshi News home page

చీరాల టీడీపీలో సీటు రచ్చ

Published Sat, Feb 8 2014 3:30 AM | Last Updated on Sat, Sep 2 2017 3:27 AM

fighting for seat in telugu desam party

చీరాల, న్యూస్‌లైన్:  చీరాల టీడీపీలో సీటు చిచ్చు రగులుతోంది. నాలుగేళ్లుగా పార్టీ వైపు కన్నెత్తి చూడని సరికొత్త నాయకులు, స్థానికేతరులు సీటు కోసం పోటీ పడుతున్నారు. చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీకి నాలుగేళ్లుగా ఇన్‌చార్జి లేక, పార్టీని నడిపే నాథుడు లేక ఇప్పటికే  క్యాడర్ బలహీనమైంది. టీడీపీకి పట్టున్న గ్రామీణ ప్రాంతాల్లో సైతం దెబ్బతింది. నావికుడు లేని నావలా మారింది. అయితే ఎన్నికల సీజన్ కావడంతో రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పలువురు ముందుకొస్తున్నారు.

 సీటు మాకంటే మాకంటూ తమదైన శైలిలో ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో పార్టీలో ఉన్న కొద్ది క్యాడర్ కూడా నిట్టనిలువుగా చీలింది. సీటు కోసం ప్రయత్నిస్తున్న పరిటాల రవి అనుచరుడు పోతుల సురేష్ భార్య పోతుల సునీత, మునగపాటి వెంకటేశ్వర్లు (బాబు) బలనిరూపణకు సిద్ధమయ్యారు. తమ అనుచరులతో వారు హైదరాబాద్‌లో అధినేత ఎదుట ఇప్పటికే పలుమార్లు తిష్ట వేశారు.

 దీనికి తోడు పార్టీకి సీనియర్ నేతలుగా ఉన్న మాజీ ఎంపీ చిమటా సాంబు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి గొడుగుల గంగరాజు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు గుద్దంటి చంద్రమౌళి, కొత్తగా వచ్చిన గొర్ల శ్రీనివాసయాదవ్, పులి వెంకటేశ్వర్లు వంటి వారు కూడా సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.   నాలుగేళ్లుగా ఇన్‌చార్జి లేకపోయినా అండదండగా ఉన్నామని, తమకే పార్టీ సీటు ఇవ్వాలని కోరుతున్నారు. శుక్రవారం చిమటా సాంబు తన సామాజికవర్గానికి చెందిన కొందరితో ర్యాలీగా వెళ్లి జిల్లా నాయకుడిని తనకే సీటు ఇవ్వాలని కోరారు. అయితే పోతుల సునీత, మునగపాటి బాబుల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.

 ఎవరి బలం వారిదే..
 పార్టీలో ఉన్న సీనియర్లు అంతా మునగపాటి బాబు వైపు నిలబడగా, ఒక సామాజిక వర్గంలోని నాయకులు సునీత వైపు నిలబడ్డారు. జిల్లా నాయకత్వం కూడా అదే పంథాలో ఉంది. రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు కరణం బలరాం మునగపాటి బాబును సిఫార్సు చేస్తుండగా, జిల్లా పార్టీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ సునీత వైపు మొగ్గు చూపుతున్నారు.

 పరస్పర విమర్శలు: సీట్ల వ్యవహారంలో టీడీపీ నాయకుల మధ్య విభేదాలు ఏర్పడి రెండుగా చీలిపోయారు. పోతుల సునీత స్థానికేతరురాలు, తెలంగాణ  ప్రాంతానికి చెందిన వ్యక్తి.. ఆమె భర్త పోతుల సురేష్‌పై అనేక కేసులున్నాయని బాబు వర్గం ప్రచారం చేస్తోంది. సునీత వర్గం కూడా అదే స్థాయిలో మునగపాటి బాబు స్థానిక ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు చెందిన వ్యక్తని, ఆయన 2009లో టీడీపీకి రాజీనామా చేశారని ఆరోపణలు చేయడంతో పాటు కరపత్రాలు కూడా పంపిణీ చేశారు.

 పోతుల సునీతది పద్మశాలి సామాజికవర్గం, ఆమె భర్త సురేష్ ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో చీరాల స్థానం అనుకూలంగా ఉంటుందని భావించి చీరాల వైపు అడుగులు వేశారు. వాస్తవంగా ఆమెది తెలంగాణ  ప్రాంతమైన మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్ నియోజకవర్గంలోని గ్రామం. 2004 ఎన్నికల్లో ఆలంపూర్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఓటమిపాలైంది. ఆ తర్వాత 2009లో ధర్మవరం, పెనుగొండ నియోజకవర్గాల నుంచి టీడీపీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

 ఇదిలా ఉంటే ఇప్పటి వరకు చీరాల నియోజకవర్గానికి ఇన్‌చార్జి లేకపోవడంతో ఆమె దృష్టి చీరాలపై పడింది. అయితే టీడీపీలో ఉన్న సీనియర్ నాయకులను మాత్రం తన వైపునకు తిప్పుకోలేకపోయింది. కేవలం కొందరు ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులతో నెట్టుకొస్తున్నారు. దీంతో సీనియర్ నాయకులుగా ఉన్న కొందరు ఆమె స్థానికేత రురాలని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లారు. అలానే మునగపాటి వెంకటేశ్వర్లు (బాబు) గతం నుంచి టీడీపీలో ఉన్నారు. వేటపాలెం మండల పార్టీ అధ్యక్షుడిగా, వేటపాలెం పంచాయతీ ఉపసర్పంచ్‌గా పనిచేశారు.

2009 ఎన్నికల తర్వాత ఆయన తన రెండు పదవులకు రాజీనామా చేసి పార్టీకి దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన పార్టీ సీటు కోసం రేసులో ఉన్నారు. అయితే స్థానిక ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌తో వ్యాపార లావాదేవీలు ఉన్నాయని ఆయనపై ఆరోపణలున్నాయి.  ఈ నేపథ్యంలో పార్టీలో ఉన్న అతికొద్ది క్యాడర్ ఎవరి వైపు అడుగులు వేయాలో అమోమయంలో ఉన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement