potula suresh
-
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధి ఖరారు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఖాళీ అయిన స్థానానికి అధికార వైఎస్సార్సీపీ అభ్యర్థిని ఖరారు చేసింది. మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీతను అభ్యర్థిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ఆమె బీఫామ్ అందుకున్నారు. తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినందుకు సోమవారం సీఎంను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. సునీత వెంట బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పోతుల సురేష్ ఉన్నారు. కాగా మండలిలో ఖాళీగా ఉన్న ఓ స్థానానికి ఇదివరకే నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. గతంలో టీడీపీ ఎమ్మెల్సీగా కొనసాగిన సునీత.. ఆ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు తీరును నిరశిస్తూ రాజీనామా చేశారు. అనంతరం వైఎస్సార్సీపీలో చేరారు. తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు అయ్యారు. -
పోతుల సురేష్ పేరుతో బెదిరింపులు
అనంతపురం : అనంతపురం జిల్లా ధర్మవరంలో పోతుల సురేష్ పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ధర్మవరం సీటీఓగా పని చేస్తున్న నాగేందర్ కుమార్‌ను రూ.30 లక్షలు ఇవ్వాలంటూ పోతుల సురేష్ పేరుతో డబ్బులు డిమాండ్ చేశారు. నిన్న సాయంత్రం నాగేందర్ కుమార్‌ను కలిసిన వారు... తాము అడిగిన డబ్బు సమకూర్చకుంటే చంపేస్తామని బెదిరించారు. దాంతో బాధితుడు పోలీసుల్ని ఆశ్రయించాడు. దాంతో బెదిరింపులకు పాల్పడిన టీడీపీ నేత జీవీ చౌదరి, ఆర్ఎంపీ డాక్టర్ రియాజ్‌ను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ శ్రీరామ్ తెలిపారు. వారిని ఈరోజు కోర్టులో హాజరు పరచనున్నారు. -
నాపై ఆరోపణలు నిరూపించండి
చీరాల ఎమ్మెల్యే ఆమంచి దుర్మార్గుడు విలేకరులతో టీడీపీ నేత పోతుల సురేష్ సాక్షి ప్రతినిధి, ఒంగోలు : తనపై వస్తున్న ఆరోపణలపై ఎటువంటి విచారణకైనా సిద్ధమని తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆర్వోసీ వ్యవస్థాపకుల్లో ఒకరైన పోతుల సురేష్ అన్నారు. శుక్రవారం ఆయన ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ గురువారం అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఎంపీపీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని అక్కడి నుంచి ధర్మవరంలో తన స్నేహితులను కలుసుకునేందుకు వెళ్తే ఓ ఎస్సై తనను పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లాడని గురువారం అతని అరెస్టుపై వివరణ ఇచ్చారు. వాస్తవం తెలసుకుకోకుండా మీడియాలోని ఒక వర్గం తనపై బురదజల్లే ప్రయత్నం చేసిందని, తనపై పెద్ద సంఖ్యలో కేసులున్నాయని ప్రచారం చేసిందని మండిపడ్డారు. తనపై ఆరోపణలు ఉంటే పదేళ్ల కాలంలో ఎందుకు విచారణ చేపట్టలేదని ప్రశ్నించారు. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ దుర్మార్గుడని, అవినీతిపరుడని తాము మొదటి నుంచి చేస్తున్న ఆరోపణలకు ఇప్పటికీ కట్టుబడే ఉన్నానని పేర్కొన్నారు. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఏడు హత్యలు జరిగాయని, ఇసుక కుంభకోణంతో పాటు పలు అవినీతి అక్రమాలు జరిగాయని ఆరోపించారు. వీటన్నింటిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆమంచి నిర్దోషని తేలితే తాను గంట కూడా చీరాలలో ఉండనని స్పష్టం చేశారు. తాను ఆర్వోసీలో పనిచేసిన సమయంలో తనపై కావాలని చాలా కేసులు పెట్టారని, వాటన్నింటి నుంచి తాను నిర్దోషిగా బయటపడ్డానని పోతుల చెప్పారు. సమావేశంలో ఆయన భార్య సునీత కూడా ఉన్నారు. -
అనంతపురం జిల్లాలో నిజాయితీపై వేటు
అనంతపురం : అనంతపురం జిల్లాలో నిజాయితీపై వేటు పడింది. టీడీపీ నేత, ఆర్ఓసీ (రీ ఆర్గనైజింగ్ కమిటీ) వ్యవస్థాపకుల్లో ఒకరైన పోతుల సురేష్‌ను అరెస్ట్ చేసిన ఎస్ఐ శ్రీరామ్‌ని బదిలీ చేశారు. ఆయనను వీర్ (వేకెన్సీ రిజర్వ్)లో ఉంచారు. సెటిల్మెంట్ చేస్తున్నారన్న ఆరోపణలతో పరిటాల ముఖ్య అనుచరుడు పోతుల సురేష్‌ను అరెస్ట్ చేసినందుకు ఎస్ఐపై ఈ చర్య తీసుకోవటం గమనార్హం. కాగా గురువారం రాత్రి ధర్మవరం శివనగర్ సమీపంలోనున్న బిన్ని మిల్స్‌లో పోతుల సురేష్ అనుచరులతో కలిసి ఉండగా అటువైపు వెళ్లిన ఎస్ఐ శ్రీరామ్.. ఇక్కడేం చేస్తున్నారని ప్రశ్నించారు. సరైన సమాధానం చెప్పకుండా దురుసుగా ప్రవర్తించడంతో సురేష్‌తో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం సురేష్‌ను విడుదల చేయాలంటూ టీడీపీ నేతలు ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకు రావటంతో .... పోతుల సురేష్‌ను వ్యక్తిగత పూచికత్తుపై విడుదల చేశారు. -
టీడీపీ నేత పోతుల సురేష్ అరెస్ట్
ధర్మవరం: టీడీపీ నేత, ఆర్ఓసీ (రీ ఆర్గనైజింగ్ కమిటీ) వ్యవస్థాపకుల్లో ఒకరైన పోతుల సురేష్‌ను అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణ పోలీసులు గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. పట్టణంలోని శివనగర్ సమీపంలోనున్న బిన్ని మిల్స్‌లో పోతుల సురేష్ అనుచరులతో కలిసి ఉండగా అటువైపు వెళ్లిన ఎస్ఐ శ్రీరామ్.. ఇక్కడేం చేస్తున్నారని ప్రశ్నించారు. సరైన సమాధానం చెప్పకుండా దురుసుగా ప్రవర్తించడంతో సురేష్‌తో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. -
చీరాల ‘దేశం’లో చిటపటలు
చీరాల, న్యూస్‌లైన్ : చీరాల తెలుగుదేశం పార్టీ పరిస్థితి ముందు నుయ్యి..వెనుక గొయ్యి.. అన్న చందంగా తయారైంది. పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ.. నియోజకవర్గంలో క్యాడర్‌ను పూర్తిగా కోల్పోయి బలహీనపడింది. సీటు వ్యవహారంలో నేతల మధ్య విభేదాలు వచ్చి కొందరు పార్టీకి ఇప్పటికే దూర మయ్యారు. ఇదిలావుండగా చీరాల నియోజకవర్గ టీడీపీ సీటు పరిటాల రవి అనుచరుడు కర్నూలు జిల్లాకు చెందిన పోతుల సురేష్ భార్య సునీతకు కేటాయించినట్లు పార్టీ శుక్రవారం అర్ధరాత్రి ప్రకటించింది. కొద్ది రోజులుగా చీరాల సీటు సునీతకే కేటాయిస్తారని ప్రచారం జరిగినా చివరకు స్థానికులకే టిక్కెట్ ఇస్తారని పార్టీలో ఉన్న సీనియర్ నాయుకులు ఆశించారు. చివరకు సునీతకు సీటు దక్కడంతో సీనియర్లు అధినేత చంద్ర బాబు నిర్ణయంపై మండిపడుతున్నారు. 2009 ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలైన తర్వాత ఏడాది పాటు జంజనం శ్రీనివాసరావు నియోజకవర్గ ఇన్చార్జ్గా వ్యవహరించారు. వ్యాపారాల పేరుతో జంజనం ఇన్చార్జ్ పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి పార్టీ వ్యవహారాలు ఉన్న కొద్ది మంది నేతలే చూశారు. పంచాయతీ ఎన్నికల అనంతరం నియోజకవర్గంలోకి సునీత అడుగు పెట్టారు. అప్పటి నుంచి అమె పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ నియోజకవర్గం మొత్తం చుట్టేశారు. చివరకు సీటు కూడా అమెనే వరించింది. కనీసం తమను సంప్రదించకుండా స్థానికేతురలకు టిక్కెట్ ఎలా ఇస్తారని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. మాజీ ఎంపీగా, పార్టీలో సీనియర్‌నేతగా గుర్తింపున్న చిమటా సాంబు చీరాల అసెంబ్లీ సీటును ఆశించారు. యాదవ సామాజికవర్గానికి చెందిన ఆయన.. తనకు సీటు వస్తుందని చివరి వరకూ ఆశించి భంగపడ్డారు. స్థానికేతరులకు టిక్కెట్ దక్కుతుందని తెలియడంతో ఆయన కొద్ది రోజులుగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. అలానే చేనేత వర్గానికి చెందిన గోడుగుల గంగరాజు పార్టీ రాష్ట్ర కార్యదర్మి హోదాలో ఉన్నారు. గత ఎన్నికల్లోనూ సీటు ఆశించి భంగపడ్డాడు. ఈ సారైనా టిక్కెట్ ద క్కుతుందని చివర వరకూ తీవ్రంగా ప్రయత్నించారు. పార్టీ కోసం ముందునుంచి కష్టపడి పనిచేసిన వారిలో గంగరాజు కూడా ఒకరు. అధినేత తీరుతో పార్టీలో ఉండలా లేక ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలా.. అన్న అలోచనలో ఆయన ఉన్నట్లు సమాచారం. అలాగే వేటపాలెం నాయుకుడు మునగపాటి వెంకటేశ్వర్లు (బాబు) చీరాల టిక్కెట్ కొసం తీవ్రంగా ప్రయత్నించారు. పంచాయతీ ఎన్నికల కొసం భారీ గానే డబ్బు ఖర్చు పెట్టారు. చివరకు సీటు దక్కకపోవడంతో అయన రాజకీయ భవిష్యత్తు కుడా సందిగ్ధంలో పడింది. అయన పార్టీకి దూరమవుతారని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. ఈపురుపాలేనికి చెందిన జెడ్పీటీసీ మాజీ సభ్యుడు జి.చంద్రమౌళి కుడా టిక్కెట్ ఆశించారు. పలు ప్రయత్నాలు కూడా చేశారు. పార్టీ కోసం చివరి వరకు కష్టించి పనిచేశారు. టిక్కెట్ దక్కకపోవడంతో ఆయన పార్టీలో ఉంటారా.. లేదా.. అనేది చూడాల్సి ఉంది. ఇప్పటికే సీనియర్లుగా గుర్తింపున్న షేక్ సుభానీ, గుంటూరు మాధవరావు, కూరపాటి స్టాలిన్, బోయిన రాఘవరావు, కంకణాల అచ్చియ్య, పండుబాబు వంటి నాయకులు పార్టీని విడిచి వెళ్లారు. స్థానికేతురులకు సీటు కేటాయించడంపై మరి కొందరు నాయకులు గుర్రుగా ఉన్నారు. మొత్తానికి టీడీపీలో మళ్లీ సీటు చిచ్చు రగులుతోంది. -
చీరాల టీడీపీలో సీటు రచ్చ
చీరాల, న్యూస్‌లైన్: చీరాల టీడీపీలో సీటు చిచ్చు రగులుతోంది. నాలుగేళ్లుగా పార్టీ వైపు కన్నెత్తి చూడని సరికొత్త నాయకులు, స్థానికేతరులు సీటు కోసం పోటీ పడుతున్నారు. చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీకి నాలుగేళ్లుగా ఇన్చార్జి లేక, పార్టీని నడిపే నాథుడు లేక ఇప్పటికే క్యాడర్ బలహీనమైంది. టీడీపీకి పట్టున్న గ్రామీణ ప్రాంతాల్లో సైతం దెబ్బతింది. నావికుడు లేని నావలా మారింది. అయితే ఎన్నికల సీజన్ కావడంతో రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పలువురు ముందుకొస్తున్నారు. సీటు మాకంటే మాకంటూ తమదైన శైలిలో ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో పార్టీలో ఉన్న కొద్ది క్యాడర్ కూడా నిట్టనిలువుగా చీలింది. సీటు కోసం ప్రయత్నిస్తున్న పరిటాల రవి అనుచరుడు పోతుల సురేష్ భార్య పోతుల సునీత, మునగపాటి వెంకటేశ్వర్లు (బాబు) బలనిరూపణకు సిద్ధమయ్యారు. తమ అనుచరులతో వారు హైదరాబాద్‌లో అధినేత ఎదుట ఇప్పటికే పలుమార్లు తిష్ట వేశారు. దీనికి తోడు పార్టీకి సీనియర్ నేతలుగా ఉన్న మాజీ ఎంపీ చిమటా సాంబు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి గొడుగుల గంగరాజు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు గుద్దంటి చంద్రమౌళి, కొత్తగా వచ్చిన గొర్ల శ్రీనివాసయాదవ్, పులి వెంకటేశ్వర్లు వంటి వారు కూడా సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. నాలుగేళ్లుగా ఇన్చార్జి లేకపోయినా అండదండగా ఉన్నామని, తమకే పార్టీ సీటు ఇవ్వాలని కోరుతున్నారు. శుక్రవారం చిమటా సాంబు తన సామాజికవర్గానికి చెందిన కొందరితో ర్యాలీగా వెళ్లి జిల్లా నాయకుడిని తనకే సీటు ఇవ్వాలని కోరారు. అయితే పోతుల సునీత, మునగపాటి బాబుల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఎవరి బలం వారిదే.. పార్టీలో ఉన్న సీనియర్లు అంతా మునగపాటి బాబు వైపు నిలబడగా, ఒక సామాజిక వర్గంలోని నాయకులు సునీత వైపు నిలబడ్డారు. జిల్లా నాయకత్వం కూడా అదే పంథాలో ఉంది. రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు కరణం బలరాం మునగపాటి బాబును సిఫార్సు చేస్తుండగా, జిల్లా పార్టీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ సునీత వైపు మొగ్గు చూపుతున్నారు. పరస్పర విమర్శలు: సీట్ల వ్యవహారంలో టీడీపీ నాయకుల మధ్య విభేదాలు ఏర్పడి రెండుగా చీలిపోయారు. పోతుల సునీత స్థానికేతరురాలు, తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి.. ఆమె భర్త పోతుల సురేష్‌పై అనేక కేసులున్నాయని బాబు వర్గం ప్రచారం చేస్తోంది. సునీత వర్గం కూడా అదే స్థాయిలో మునగపాటి బాబు స్థానిక ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు చెందిన వ్యక్తని, ఆయన 2009లో టీడీపీకి రాజీనామా చేశారని ఆరోపణలు చేయడంతో పాటు కరపత్రాలు కూడా పంపిణీ చేశారు. పోతుల సునీతది పద్మశాలి సామాజికవర్గం, ఆమె భర్త సురేష్ ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో చీరాల స్థానం అనుకూలంగా ఉంటుందని భావించి చీరాల వైపు అడుగులు వేశారు. వాస్తవంగా ఆమెది తెలంగాణ ప్రాంతమైన మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్ నియోజకవర్గంలోని గ్రామం. 2004 ఎన్నికల్లో ఆలంపూర్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఓటమిపాలైంది. ఆ తర్వాత 2009లో ధర్మవరం, పెనుగొండ నియోజకవర్గాల నుంచి టీడీపీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు చీరాల నియోజకవర్గానికి ఇన్చార్జి లేకపోవడంతో ఆమె దృష్టి చీరాలపై పడింది. అయితే టీడీపీలో ఉన్న సీనియర్ నాయకులను మాత్రం తన వైపునకు తిప్పుకోలేకపోయింది. కేవలం కొందరు ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులతో నెట్టుకొస్తున్నారు. దీంతో సీనియర్ నాయకులుగా ఉన్న కొందరు ఆమె స్థానికేత రురాలని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లారు. అలానే మునగపాటి వెంకటేశ్వర్లు (బాబు) గతం నుంచి టీడీపీలో ఉన్నారు. వేటపాలెం మండల పార్టీ అధ్యక్షుడిగా, వేటపాలెం పంచాయతీ ఉపసర్పంచ్‌గా పనిచేశారు. 2009 ఎన్నికల తర్వాత ఆయన తన రెండు పదవులకు రాజీనామా చేసి పార్టీకి దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన పార్టీ సీటు కోసం రేసులో ఉన్నారు. అయితే స్థానిక ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌తో వ్యాపార లావాదేవీలు ఉన్నాయని ఆయనపై ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలో ఉన్న అతికొద్ది క్యాడర్ ఎవరి వైపు అడుగులు వేయాలో అమోమయంలో ఉన్నారు.