చీరాల ‘దేశం’లో చిటపటలు
చీరాల, న్యూస్‌లైన్ : చీరాల తెలుగుదేశం పార్టీ పరిస్థితి ముందు నుయ్యి..వెనుక గొయ్యి.. అన్న చందంగా తయారైంది. పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ.. నియోజకవర్గంలో క్యాడర్‌ను పూర్తిగా కోల్పోయి బలహీనపడింది.
సీటు వ్యవహారంలో నేతల మధ్య విభేదాలు వచ్చి కొందరు పార్టీకి ఇప్పటికే దూర మయ్యారు. ఇదిలావుండగా చీరాల నియోజకవర్గ టీడీపీ సీటు పరిటాల రవి అనుచరుడు కర్నూలు జిల్లాకు చెందిన పోతుల సురేష్ భార్య సునీతకు కేటాయించినట్లు పార్టీ శుక్రవారం అర్ధరాత్రి ప్రకటించింది.
కొద్ది రోజులుగా చీరాల సీటు సునీతకే కేటాయిస్తారని ప్రచారం జరిగినా చివరకు స్థానికులకే టిక్కెట్ ఇస్తారని పార్టీలో ఉన్న సీనియర్ నాయుకులు ఆశించారు. చివరకు సునీతకు సీటు దక్కడంతో సీనియర్లు అధినేత చంద్ర బాబు నిర్ణయంపై మండిపడుతున్నారు. 2009 ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలైన తర్వాత ఏడాది పాటు జంజనం శ్రీనివాసరావు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా వ్యవహరించారు.
వ్యాపారాల పేరుతో జంజనం ఇన్‌చార్జ్ పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి పార్టీ వ్యవహారాలు ఉన్న కొద్ది మంది నేతలే చూశారు. పంచాయతీ ఎన్నికల అనంతరం నియోజకవర్గంలోకి సునీత అడుగు పెట్టారు. అప్పటి నుంచి అమె పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ నియోజకవర్గం మొత్తం చుట్టేశారు. చివరకు సీటు కూడా అమెనే వరించింది. కనీసం తమను సంప్రదించకుండా స్థానికేతురలకు టిక్కెట్ ఎలా ఇస్తారని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు.
మాజీ ఎంపీగా, పార్టీలో సీనియర్‌నేతగా గుర్తింపున్న చిమటా సాంబు చీరాల అసెంబ్లీ సీటును ఆశించారు. యాదవ సామాజికవర్గానికి చెందిన ఆయన.. తనకు సీటు వస్తుందని చివరి వరకూ ఆశించి భంగపడ్డారు. స్థానికేతరులకు టిక్కెట్ దక్కుతుందని తెలియడంతో ఆయన కొద్ది రోజులుగా పార్టీకి దూరంగా ఉంటున్నారు.
అలానే చేనేత వర్గానికి చెందిన గోడుగుల గంగరాజు పార్టీ రాష్ట్ర కార్యదర్మి హోదాలో ఉన్నారు. గత ఎన్నికల్లోనూ సీటు ఆశించి భంగపడ్డాడు. ఈ సారైనా టిక్కెట్ ద క్కుతుందని చివర వరకూ తీవ్రంగా ప్రయత్నించారు. పార్టీ కోసం ముందునుంచి కష్టపడి పనిచేసిన వారిలో గంగరాజు కూడా ఒకరు. అధినేత తీరుతో పార్టీలో ఉండలా లేక ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలా.. అన్న అలోచనలో ఆయన ఉన్నట్లు సమాచారం.
అలాగే వేటపాలెం నాయుకుడు మునగపాటి వెంకటేశ్వర్లు (బాబు) చీరాల టిక్కెట్ కొసం తీవ్రంగా ప్రయత్నించారు. పంచాయతీ ఎన్నికల కొసం భారీ గానే డబ్బు ఖర్చు పెట్టారు. చివరకు సీటు దక్కకపోవడంతో అయన రాజకీయ భవిష్యత్తు కుడా సందిగ్ధంలో పడింది. అయన పార్టీకి దూరమవుతారని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. ఈపురుపాలేనికి చెందిన జెడ్పీటీసీ మాజీ సభ్యుడు జి.చంద్రమౌళి కుడా టిక్కెట్ ఆశించారు. పలు ప్రయత్నాలు కూడా చేశారు. పార్టీ కోసం చివరి వరకు కష్టించి పనిచేశారు.
టిక్కెట్ దక్కకపోవడంతో ఆయన పార్టీలో ఉంటారా.. లేదా.. అనేది చూడాల్సి ఉంది. ఇప్పటికే సీనియర్లుగా గుర్తింపున్న షేక్ సుభానీ, గుంటూరు మాధవరావు, కూరపాటి స్టాలిన్, బోయిన రాఘవరావు, కంకణాల అచ్చియ్య, పండుబాబు వంటి నాయకులు పార్టీని విడిచి వెళ్లారు. స్థానికేతురులకు సీటు కేటాయించడంపై మరి కొందరు నాయకులు గుర్రుగా ఉన్నారు. మొత్తానికి టీడీపీలో మళ్లీ సీటు చిచ్చు రగులుతోంది.