- సీఎం చంద్రబాబుకు వైఎస్సార్‌సీపీ జిల్లా నేతల డిమాండ్
- రవి హత్య కేసును నీరుగార్చింది ఆయనేన ని ఆరోపణ
- వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై నీలాపనిందలు మానాలని హితవు
అనంతపురం అర్బన్ : టీడీపీ నేత పరిటాల రవి హత్య కేసులో అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి నిందితుడా? కాదా..? అన్నది తొలుత సీఎం చంద్రబాబునాయుడు తేల్చి చెప్పాలని వైఎస్సార్‌సీపీ జిల్లా నేతలు డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక రెండో రోడ్డులోని ఆ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, నాయకులు వీఆర్ వెంకటేశ్వరరెడ్డి, పెద్దవడుగూరు మండల కన్వీనర్ గురివిరెడ్డి, ప్రకాష్‌రెడ్డి, శ్రీరాములు, శ్రీధర్‌లు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో తన తొమ్మిదేళ్ల పాలనలో హత్యా రాజకీయాలు ప్రోత్సహించింది చంద్రబాబు కాదా? అంటూ ధ్వజమెత్తారు.
2005లో పరిటాల రవి హత్య జరిగిందని, టీడీపీ నాయకుల డిమాండ్ మేరకు అప్పటి ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆ కేసును సీబీఐకి అప్పగించారని గుర్తు చేశారు. అయితే అప్పట్లో ప్రతి పక్షనేతగా ఉన్న చంద్రబాబు, ఈ కేసులో వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఎంపీ దివాకర్‌రెడ్డి పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేయాలని సీబీఐని కోరారన్నారు. అయితే కేసును పూర్తి స్థాయిలో పరిశీలించిన సీబీఐ వారిద్దరినీ నిందితుల జాబితా నుంచి తొలగించిందన్నారు.
ఆ తర్వాత చంద్రబాబునాయుడే కేసును నీరుగార్చారని ఆరోపించారు. కేసు పూర్తయి, నిందితులకు కూడా శిక్ష పడిందన్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందేనన్నారు. అనంతరం రాష్ట్ర ప్రజలకు మోసపూరితమైన హామీలిచ్చి ముఖ్యమంత్రిగా అందలమెక్కిన చంద్రబాబు, ఆయన మంత్రి వర్గం పదేళ్ల తర్వాత పరిటా రవి హత్య కేసుపై రాజకీయం చేస్తూ, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై బురద చల్లడం వారి నీచ సంస్కృతికి నిదర్శనమని ధ్వజమెత్తారు.
జేసీ దివాకర్‌రెడ్డి పరిటాల కేసులో నిందితుడని టీడీపీ నేతలు పలు సందర్భాల్లో ఆరోపించినప్పటికీ, ఆయనకు, ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్‌రెడ్డికి టీడీపీలో ఎందుకు చోటు కల్పించి పదవులు కట్టబెట్టారని చంద్రబాబును వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రశ్నించారు. మొదట జేసీ దివాకర్‌రెడ్డి హస్తం ఉందా? లేదా..? అనే విషయాన్ని చంద్రబాబు స్పష్టం చేయాలని, ఆ తర్వాతే ఇతర విషయాలు మాట్లాడాలని వారు డిమాండ్ చేశారు. అంతే కాని వైఎస్ జగన్‌పై నిలాపనిందలు వేయడం చంద్రబాబుకు, మంత్రులకు మంచిది కాదని వారు హితవు పలికారు.