
సాక్షి ప్రతినిధి, అనంతపురం: తెలుగుదేశం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి రాజీనామా అస్త్రంతో సీఎం చంద్రబాబును బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. బుధవారం పార్లమెంటు సమావేశాలకు హాజరుకాక పోవడంతో జేసీ అసంతృప్తి అంశం తెరపైకి వచ్చింది. దీనిపై అనంతపురంలో విలేకరులతో మాట్లాడిన జేసీ అలాంటిదేమీ లేదని పైకి చెప్పినా అనంతపురం పార్లమెంట్‌కు సంబంధించిన కొన్ని అంశాల్లో తన మాట చెల్లుబాటు కాకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని సీఎంను జేసీ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని.. పనిలో పనిగా ప్రజల్లో సానుభూతి పొందేందుకు ‘ప్రత్యేక హోదా’ కోసమే రాజీనామా చేశానని ప్రచారం చేసుకోనున్నారని తెలుస్తోంది.
ఆ మూడు అంశాలతో మనస్తాపం: అనంతపురంలోని పాతూరులో రోడ్ల విస్తరణకు సంబంధించిన వివాదంలో జేసీ ఒత్తిడి చేసినా అధికారులు పట్టించుకోలేదు. ఎమ్మెల్యే వెనుక సీఎం ఉన్నారని జేసీ భావిస్తున్నారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డిని జేసీనే టీడీపీలో చేర్పించారు. ఆయన పార్టీలో చేరి 7 నెలలు గడచినా ఎలాంటి పదవి ఇవ్వలేదు.
అలాగే మాజీ ఎమ్మెల్యే మధుసూదన్‌గుప్తా మహానాడు వేదికగా టీడీపీలో చేరేందుకు అనుచరులతో కలసి విజయవాడ వెళ్లారు. అయితే చంద్రబాబు గుప్తా చేరికను వాయిదా వేశారు. రోడ్ల విస్తరణ, గురునాథరెడ్డికి పదవి, గుప్తా చేరిక వాయిదా అంశాల్లో తన మాట చెల్లుబాటు కాకపోవడంతో జేసీ ఈ నెల 12న సీఎంను కలిసినా వీటిపై స్పష్టత రాకపోవడంతో బ్లాక్‌మెయిల్ చేసేందుకు రాజీనామా నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment