జేసీ లాంటి నేతలతో పార్టీకి ఇబ్బందులు | Bhoomama Brahmananda Reddy as TDP candidate for Nandyal | Sakshi
Sakshi News home page

జేసీ లాంటి నేతలతో పార్టీకి ఇబ్బందులు

Published Sun, Jun 18 2017 2:38 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

Bhoomama Brahmananda Reddy as TDP candidate for Nandyal

- నంద్యాల టీడీపీ అభ్యర్థిగా భూమా బ్రహ్మానందరెడ్డి
- అనంతపురం, కర్నూలు నేతలతో సమీక్షలో సీఎం
 
సాక్షి, అమరావతి: విశాఖపట్నం ఎయిర్‌ పోర్టులో సిబ్బంది పట్ల జేసీ దివాకర్‌రెడ్డి  వ్యవహరించిన తీరుతో పార్టీకి ఇబ్బందులు ఎదురౌతున్నాయని సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. సీఎం శనివారం అనంతపురం, కర్నూలు జిల్లా నేతలతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. అయితే పార్టీ నేతలెవ్వరూ జేసీ  తీరుపై ఎలాంటి కామెంట్లు చేయొద్దని చెప్పినట్లు సమాచారం. ఎన్నికలు దగ్గరపడుతున్నందున ప్రజల్లో పార్టీకి చెడ్డపేరు రాకుండా ప్రజా ప్రతినిధులు సంయమనంతో వ్యవహరించాలని సూచించారు. అదేవిధంగా అనంతపురం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవి చమన్, పూల నాగరాజులు ఒక్కొక్కరు రెండున్నరేళ్లు కొనసాగేలా అప్పట్లో ఒప్పందం కుదిరింది.

ప్రస్తుతం జడ్పీ చైర్మన్‌గా ఉన్న చమన్‌ రాజీనామా చేసేందుకు ససేమిరా అంటుండటంతో జిల్లా నాయకులు ఆ విషయాన్ని సీఎం దృష్టికి తెచ్చారు. ఒప్పందం ప్రకారం చమన్‌ రాజీనామా చేయాల్సిందేనని తర్వాత ఆ పదవిని రాయదుర్గం నియోజకవర్గానికి చెందిన పూల నాగరాజుకు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. అదేవిధంగా పుట్టపర్తి పురపాలక చైర్మన్‌ గంగన్న చేత వెంటనే రాజీనామా చేయించి, ఆ స్థానంలో కొత్త అభ్యర్థిని ఎన్నుకునే బాధ్యతలను మంత్రి దేవినేని ఉమకు అప్పగించారు. కర్నూలు జిల్లా నంద్యాలలో మంత్రి అఖిలప్రియ, మరో నేత ఏవీ సుబ్బారెడ్డిల మధ్య నెలకొన్న విభేదాలు ఇటీవల రచ్చకెక్కాయి. అఖిలప్రియ పార్టీ నేతలను పట్టించుకోవడం లేదంటూ సుబ్బారెడ్డి ఇటీవల ఆరోపణలు చేశారు. దీంతో మంత్రి, సుబ్బారెడ్డిలతో విడివిడిగా మాట్లాడి రాజీ చేశారు.

నంద్యాల ఉప ఎన్నిక టీడీపీ అభ్యర్థిగా భూమా నాగిరెడ్డి అన్న కుమారుడు భూమా బ్రహ్మానందరెడ్డి అయితే బాగుంటుందని సూచించడంతో సీఎం ఆయన పేరును ఖరారు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప ఎన్నికల్లో గెలవాల్సిందేనని ఆ విధంగా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని పార్టీ నేతలను ఆదేశించారు. అదేవిధంగా ప్రస్తుతం కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఉన్న శిల్పా చక్రపాణిరెడ్డిని పదవి నుంచి తప్పించి ఆ స్థానాన్ని సోమిశెట్టి వెంకటేశ్వర్లు పేరును ఖరారు చేశారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement