చీరాల ఎమ్మెల్యే ఆమంచి దుర్మార్గుడు
విలేకరులతో టీడీపీ నేత పోతుల సురేష్
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : తనపై వస్తున్న ఆరోపణలపై ఎటువంటి విచారణకైనా సిద్ధమని తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆర్వోసీ వ్యవస్థాపకుల్లో ఒకరైన పోతుల సురేష్ అన్నారు. శుక్రవారం ఆయన ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ గురువారం అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఎంపీపీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని అక్కడి నుంచి ధర్మవరంలో తన స్నేహితులను కలుసుకునేందుకు వెళ్తే ఓ ఎస్సై తనను పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లాడని గురువారం అతని అరెస్టుపై వివరణ ఇచ్చారు.
వాస్తవం తెలసుకుకోకుండా మీడియాలోని ఒక వర్గం తనపై బురదజల్లే ప్రయత్నం చేసిందని, తనపై పెద్ద సంఖ్యలో కేసులున్నాయని ప్రచారం చేసిందని మండిపడ్డారు. తనపై ఆరోపణలు ఉంటే పదేళ్ల కాలంలో ఎందుకు విచారణ చేపట్టలేదని ప్రశ్నించారు. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ దుర్మార్గుడని, అవినీతిపరుడని తాము మొదటి నుంచి చేస్తున్న ఆరోపణలకు ఇప్పటికీ కట్టుబడే ఉన్నానని పేర్కొన్నారు.
ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఏడు హత్యలు జరిగాయని, ఇసుక కుంభకోణంతో పాటు పలు అవినీతి అక్రమాలు జరిగాయని ఆరోపించారు. వీటన్నింటిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆమంచి నిర్దోషని తేలితే తాను గంట కూడా చీరాలలో ఉండనని స్పష్టం చేశారు. తాను ఆర్వోసీలో పనిచేసిన సమయంలో తనపై కావాలని చాలా కేసులు పెట్టారని, వాటన్నింటి నుంచి తాను నిర్దోషిగా బయటపడ్డానని పోతుల చెప్పారు. సమావేశంలో ఆయన భార్య సునీత కూడా ఉన్నారు.
నాపై ఆరోపణలు నిరూపించండి
Published Sat, Aug 2 2014 3:47 AM | Last Updated on Sat, Sep 2 2017 11:14 AM
Advertisement