చీరాలలో టెన్షన్‌.. టెన్షన్‌ | TDP MLA's Brother Thrashes Senior Journalist | Sakshi
Sakshi News home page

చీరాలలో టెన్షన్‌.. టెన్షన్‌

Published Tue, Feb 7 2017 4:57 AM | Last Updated on Tue, Sep 5 2017 3:03 AM

చీరాలలో టెన్షన్‌.. టెన్షన్‌

చీరాలలో టెన్షన్‌.. టెన్షన్‌

ఆమంచి అనుచరుల హల్‌చల్‌
‘సాక్షి’ వద్దకు వచ్చి గోడువెళ్లబోసుకున్న ప్రజాసంఘాల నాయకులు
తన డబ్బులు, సెల్‌ఫోన్‌ తీసుకెళ్లాడని ఆమంచి స్వాములుపై ఫిర్యాదు
నిందితులను అరెస్టు చేయాలని వైఎస్సార్‌ సీపీ నేతల డిమాండ్‌
నాగార్జునరెడ్డిని అరెస్టు చేయాలని ఎమ్మెల్యే అనుచరుల ర్యాలీ


చీరాల : చీరాలలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. వందలాది మంది జనం రోడ్డుపైకి వచ్చారు. ఆమంచి కృష్ణమోహన్‌ అనుచరులు సోమవారం భారీగా మొహరించి హల్‌చల్‌ చేశారు. ఎమ్మెల్యే సోదరుడు ఆమంచి స్వాములు, అతని అనుచరుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌ నాగార్జునరెడ్డి వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తనపై జరిగిన దాడిని మీడియాకు వివరించడంతో పాటు తన డబ్బులు, సెల్‌ఫోన్‌ను ఆమంచి స్వాములు తీసుకెళ్లాడని, అతనిపై చోరీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. జర్నలిస్టుపై దాడిచేసిన ఆమంచి స్వాములు, అతని అనుచరులను అరెస్టు చేయాలని వైఎస్సార్‌ సీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే సోదరుడు ఆమంచి స్వాములు అరాచకాలను ప్రజాసంఘాల నాయకులు ఖండించారు.  

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ సోదరుడు ఆమంచి స్వాములు తమ అవినీతి అక్రమాలపై బాస అనే మాస పత్రికలో కథనం రాసిన ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌ నాయుడు నాగార్జునరెడ్డిపై చీరాల గడియార స్తంభం సెంటర్‌లో దాడిచేసిన విషయం విధితమే. ఈ ఘటనతో నాగార్జునరెడ్డికి వైఎస్సార్‌ సీపీ, ప్రజాసంఘాలు, టీడీపీకి చెందిన పాలేటి రామారావు, పోతుల సునీతలు అండగా నిలిచారు. దాడిచేసిన ఆమంచి స్వాములు, అతని అనుచరులను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇదిలా ఉంటే ఆమంచి అనుచరులు కూడా ఉదయం నుంచి డ్రైనేజీ అతిథి గృహంలో పెద్దసంఖ్యలో చేరారు. సాక్షి ఓబీ వ్యాన్‌ వద్ద ప్రజాసంఘ నాయకులు, వైఎస్సార్‌ సీపీ నాయకులు ఈ దాడిని ఖండిస్తూ మాట్లాడుతుండగా ఆమంచి అనుచరులు కూడా ముందుకు వచ్చి తాము కూడా మాట్లాడతామని గొడవకు దిగారు. ఇరువర్గాలు ఘర్షణకు దిగే పరిస్థితి ఉందని భావించిన పోలీసులు.. వారిని పక్కకు పంపించారు. అనంతరం ఆమంచి అనుచరులు చీరాల వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఎమ్మెల్యే ఆమంచి, ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు దళి తులను కించపరిచేలా కథనాలు రాసిన నాయుడు నాగార్జునరెడ్డిని అరెస్ట్‌ చేయాలని కోరారు. పట్టణంలో ర్యాలీ చేసి సీఐని కలిసి వినతిపత్రం అందించారు. అయి తే ఉదయం కొద్దిసేపు సాక్షి ప్రసారాలు నిలిచిపోయా యి. అనంతరం తిరిగి ప్రసారమయ్యాయి.

స్వాములను అరెస్టు చేయండి : వైఎస్సార్‌ సీపీ వినతి
ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌ నాయుడు నాగార్జునరెడ్డిపై దాడిచేసిన ఎమ్మెల్యే ఆమంచి సోదరుడు స్వాములు, అతని అనుచరులను అరెస్టు చేయాలని సోమవారం రాత్రి వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి యడం బాలాజీ, బాపట్ల పార్లమెంటరీ ఇన్‌చార్జి డాక్టర్‌ వి.అమృతపాణి, పార్టీ ట్రేడ్‌ యూనియన్‌ జిల్లా కన్వీనర్‌ కర్నేటి వెంకటప్రసాద్, పార్టీ నాయకులు వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సీఐ వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందించారు. నాగార్జునరెడ్డిపై దాడి జరిగి 24 గంటలైనా ఎందుకు అరెస్ట్‌ చేయలేదని ప్రశ్నించారు. దోషులSను వెంటనే అరెస్ట్‌ చేయాలని వారు డిమాండ్‌ చేశారు. అయి తే 24గంటల్లో దోషులను అరెస్ట్‌ చేయని పక్షంలో చీరాల బంద్‌కు పిలుపునిచ్చామన్నారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్, ధర్నాకు అవకాశం కల్పించాలని సీఐని కోరారు.  

నన్ను చంపడానికి నాలుగుసార్లు ప్రయత్నించారు : బాధిత జర్నలిస్ట్‌ నాయుడు నాగార్జునరెడ్డి చీరాల ఎమ్మెల్యే, ఆయన బంధువులు గత పదేళ్లుగా చేసిన అవినీతి అక్రమాలు, దౌర్జనాలపై కథనాలు రాయడంతో పాటు మీడియాకు సమాచారం ఇస్తున్నానని నాపై కోపం పెంచుకున్నాను. నన్ను చంపేందుకు నాలుగుసార్లు ప్రయత్నించారు. ఆమంచి అక్రమాలపై 14 పేజీల వ్యాసం రాసినందుకు నన్ను చంపేందుకు కుట్ర చేశారు. చీరాలలో పట్టపగలే నాపై దాడి జరిగితే పోలీసులు చూస్తూ ఉన్నారేగానీ, చర్యలు తీసుకోలేదు. నా మరణం వరకు ఆమంచి అక్రమాలపై పోరాడతా. అరాచకాలను ప్రశ్నించినందుకు నాపై అక్రమ కేసులు పెట్టించారు. ఆమంచి సోదరుడు స్వాములు దాడిచేసిన సమయంలో నా వద్ద రూ.25 వేల నగదు, శ్యాంసంగ్‌ ట్యాబ్, పవర్‌ బ్యాంక్, కొన్ని ఏటీఎం కార్డులు ఉన్న బ్యాగ్‌ను తీసుకెళ్లారు. అతనిపై చోరీ కేసు నమోదు చేయాలని వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశా.

 ఆమంచి స్వాములును అరెస్టు చేయాలి   ప్రజాసంఘాల నేతలు డిమాండ్‌
చీరాల రూరల్‌ : నాగార్జునరెడ్డిపై దాడికి పాల్పడిన ఎమ్మెల్యే ఆమంచి సోదరుడు శ్రీనివాసరావు (స్వాములు), అతని అనుచరులను వెంటనే అరెస్టు చేయాలని ఎరుకుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నల్లబోతుల మోహన్‌కుమార్‌ధర్మా, సమాజ్‌వాదీ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్‌డీ బాబు డిమాండ్‌ చేశారు. నాగార్జున రెడ్డిపై దాడిజరిగి 24 గంటలు గడిచినా పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదో అర్థం కావడంలేదన్నారు. ఎమ్మెల్యే అవినీతిపై వార్తలు రాస్తే జర్నలిస్టులపై దాడులకు తెగపడటం ఎంతవరకు సమంజసమన్నారు. రాజ్యాంగంలో ప్రతిఒక్కరికీ వాక్‌స్వాతంత్య్రం ఉందన్నారు. నియోజకవర్గానికి బాధ్యత వహించే ఎమ్మెల్యే.. రాజ్యాంగానికి లోబడి పాలన చేయాలేగానీ ఇష్టానుసారం వ్యవహరించరాదన్నారు. నిజాలను నిర్భయంగా ప్రచురించే జర్నలిస్టులకే రక్షణ లేకపోతే..సామాన్య ప్రజలకు రక్షణ ఎక్కడుంటుందన్నారు. దాడిని అపలేకపోయిన పోలీసులపై జిల్లా ఎస్పీ చర్యలు తీసుకోవాలన్నారు. ఆమంచి శ్రీనివాసరావు, అతని అనుచరులను అరెస్టు చేయని పక్షంలో ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement