రిలేషణం: తేమగల రాయి... రామ్‌గోపాల్‌వర్మ
రామ్‌గోపాల్‌వర్మ... ఇండస్ట్రీలో న్యూ టాలెంట్‌కి ఆయన గాడ్‌ఫాదర్. ఈ గాడ్‌ఫాదర్‌కి రోల్‌మోడల్... ఆయన మేనమామ మురళీరాజు. నాకు సినిమాలు తప్ప సెంటిమెంట్లు లేవు అన్నట్టుగా ఉండే వర్మ రాతి మనిషా లేక ఆ రాతి కింద ఏమైనా తడిజాడలున్నాయా... మేనమామ మురళీరాజు మాటల్లో తెలుసుకుందాం!
వర్మకు సినిమాల పట్ల ఆసక్తి కలిగించేలా చేసింది నేనే అన్నది కేవలం తను కల్పించిన ఒక భ్రమ మాత్రమే. కాలేజీలో ఉన్నప్పుడు తను గాడ్‌ఫాదర్ నవలలో పేరాలు, సినిమాలో సీన్స్ అనర్గళంగా చెప్పేవాడు. తరువాత చూస్తే, అందులో చాలావరకు తన ఇమాజినేషన్, ఆర్టిక్యులేషన్ ఉండేది. ప్రపంచ సినిమాలో వెయ్యి అత్యుత్తమ చిత్రాలుంటే, నేను తొమ్మిది వందల సినిమాలు చూశాను. తను మాత్రం వంద చూసుంటాడు. కానీ తను వంద సినిమాలు తీస్తే, నేను ఒక్కటి కూడా తీయలేకపోయాను.
ఇక, మా బంధం గురించి చెప్పాలంటే, నేను ప్రేక్షకుణ్ని, వర్మ దర్శకుడు. అదే మా బంధం. మా మార్గాలు ఎక్కడ వేరవుతాయి అంటే, వర్మ థింకింగ్ వేరు. నా థింకింగ్ వేరు. నాది జ్ఞాన మార్గం. తనది క్రియా మార్గం. నాకు ఫ్లైట్‌లో ప్యాసింజర్‌గా వెళ్లడం ఇష్టం. తనకు పైలట్‌గా విమానం నడపడం ఇష్టం. రాము సూర్యుడు, నేను చంద్రుడు. తనకు స్వయం ప్రకాశకత్వం ఉంది, నాకు లేదు.
రాముకి ఉన్నతమైన లక్షణాలున్నాయి. డబ్బు సంపాదించగానే తండ్రికి కారు కొనిచ్చాడు. తనకెలాంటి బంధాలూ లేవని రాము చెప్పేది అబద్ధం. నాలుగు ఫ్యామిలీస్ అతని మీద ఆధారపడి ఉన్నాయి. కనీసం వంద మందికి జీవితాధారాన్నిచ్చాడు. తనకు ఎమోషన్ లేదంటాడు కానీ తన తండ్రి చనిపోయిన కొన్నేళ్ల వరకూ వెక్కి వెక్కి ఏడ్చాడు. లోపల ఎమోషన్ లేకుంటే బయటకు దుఃఖం ఎలా వస్తుంది!
రాము ఓ గ్రేట్మ్యాన్ అని ఊహ వచ్చాక, తను నా మేనల్లుడు అనుకోవడం మానేశాను. నిజం చెప్పాలంటే ఆయన నాకు మామ. నేను మేనల్లుణ్ని. తను ఎప్పటికప్పుడు నా క్షేమ సమాచారాల గురించి తెలుసుకుంటుంటాడు. నేను పెద్దగా ఎవరినీ కలవడానికి ఇష్టపడను. ఒక్క రామూని మాత్రం మళ్లీ మళ్లీ కలవడానికి ఇష్టపడతాను. బాంబేకి వెళ్లి ఫోన్ చేస్తే ఉదయం నుంచి రాత్రి రెండు గంటల వరకు సినిమాకు సంబంధించి అన్ని ప్రాసెస్లు దగ్గరుండి చూపిస్తాడు. నన్ను తను ఎంటర్టైన్ చేసినట్టు మరెవరూ చేయలేరు.
వినోదం రూపంలో ఆతిథ్యం ఇవ్వగలిగే సంస్కారం ఉన్న పెద్దమనిషి ఆయన. తన దగ్గర ఎప్పటికప్పుడు ఏదో కొత్త విషయం నాకు కనిపిస్తూ ఉంటుంది. తనను చిన్నప్పటినుంచీ అబ్జర్వ్ చేస్తున్నాను. చిన్నప్పుడు తనకు కత్తి కాంతారావు అంటే ఇష్టం. వయసులో బ్రూస్లీ, తరువాత అమితాబ్ అంటే ఇష్టం. రాము దేవుడు ఉన్నాడు లేడు అని నమ్మడు. ఒకవేళ దేవుడు ఉన్నా అతనికి మన గురించి అక్కరలేదు. అలాంటప్పుడు అతని గురించి మనం ఎందుకు వర్రీ అవ్వాలి అంటాడు. అది ఒక విధంగా కరెక్టే. సూర్యుడిలా దేవుడు సాక్షి అంతే. నాది అద్వైతం. దేవుడిలో నేనున్నాను, నాలో దేవుడున్నాడు.
తన సినిమాలకు సంబంధించి నా అబ్జర్వేషన్స్ చెబుతానే తప్ప అభిప్రాయాలు చెప్పను. అతను నన్నెప్పుడూ అడగలేదు. నేనెప్పుడూ చెప్పను. పోస్ట్ ప్రొడక్షన్లో సీన్స్ చూపించి అడుగుతాడు. నేను నా అభిప్రాయం చెబుతాను. అంతవరకే. దగ్గరివాళ్లు విమర్శిస్తే రాము తట్టుకోలేడు. ఈ మధ్య తన సినిమాలు సరిగ్గా ఎంటర్టైన్ చేయడం లేదు. ఫెలిని(ఇటలీ చిత్ర దర్శకుడు) ఒక దశలో ఆర్ట్ ఇజ్ మై ఎక్స్ప్రెషన్ అన్నట్టు వర్మ కూడా నా సినిమా నా ఇష్టం అంటాడు. రాము తనకై తన గురించి, తన ప్లెజర్ గురించి జీవిస్తాడు. అందుకే ఆగ్ తీశాడు. రామూని యాక్సెప్ట్ చేయవచ్చు. రిజెక్ట్ చేయవచ్చు. కానీ ఎవరికీ ద్వేషించడం అస్సలు కుదరదు. జీవితమనే ల్యాబొరేటరీలో చిన్న చిన్న చమత్కారాలు జరుగుతుంటాయి. అవి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. రాము అలాంటి చమత్కారమే. ఆయన ఒక మనిషి కాదు, ప్రాసెస్.
జీవితం సంతోషంగా ఉండాలంటే ఐదు సూత్రాలు చెబుతారు. ఐహిక సుఖాలు 20 శాతం ఆనందాన్నిస్తాయి; మనకు నచ్చిన పనిచేస్తే, ఇరవై శాతం ఆనందం; సత్సంబంధాలు మెయింటెయిన్ చేస్తే ఇరవై శాతం; త్యాగబుద్ధి వలన ఇరవై శాతం; లక్ష్య సిద్ధి ఇరవై శాతం సంతోషం కలుగుతుంది. ఇవేవీ రామూకి తెలియకపోయినా తను ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు.
జీవితానికి పరమార్థం ఇతరులను ఇన్స్పైర్ చేయడం అని చెప్తారు. అలా చూస్తే, హిచ్కాక్లాగా రామూ కూడా చాలామందిని ఇన్స్పైర్ చేశాడు. రాము తన లక్ష్య సిద్ధికి గారడీ చేస్తాడు కానీ కుతంత్రాలు కాదు, ఇతరులకు హాని చేసే చర్చలు, ఈర్ష్య ద్వేషాలు లేని వ్యక్తి రాము.
- కె.క్రాంతికుమార్‌రెడ్డి