'మిమ్మల్ని చంపడానికి ప్లాన్ సిద్ధం చేశాం'
విజయవాడ: 10 రోజుల్లో ఊరు విడిచి వెళ్లాలి... లేకుంటే చంపేస్తాం అంటూ ఆగంతకుల నుంచి కృష్ణాజిల్లా ముసునూరు ఎమ్మార్వో డి వనజాక్షికి సోమవారం బెదిరింపు లేఖ అందింది. మిమ్మల్ని చంపేందుకు ఇప్పటికే రెండుసార్లు మీ ఇంటి వద్ద రెక్కీ కూడా నిర్వహించామని ఆగంతకులు ఆ లేఖలో పేర్కొన్నారు.
మీ భర్త, పిల్లల్ని వదిలి మిమ్మల్ని చంపడానికి ప్లాన్ సిద్ధం చేశామని ఆగంతకులు పేర్కొన్నారు. అందుకోసం ఇసుక రీచ్‌లో గొడవ జరిగిన 8వ రోజే మిమ్మల్ని చంపమని మాకు సుఫారీ ఇచ్చారని లేఖలో ఆగంతకులు పేర్కొన్నారు. దాంతో వనజాక్షి ముసునూరు పోలీసులకు ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే, అధికార టీడీపీ నాయకుడు చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో ఆయన అనుచరులు కృష్ణాజిల్లా నూజివీడు తాలుక మునుసూరు మండలంలోని ఇసుక రీచ్‌లో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు.ఆ విషయంపై సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మార్వో వనజాక్షితో పాటు సిబ్బంది అక్కడికి చేరుకుని.... ఇసుక తవ్వకాలు అక్రమం అని వారిని నిలదీశారు.దాంతో ఎమ్మెల్యే అనుచరులు ఆమెపైనా రెవెన్యూ సిబ్బందిపైనా దాడి చేశారు. జూలై మొదటి వారంలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
దాంతో రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సిబ్బంది ఆందోళనకు దిగి... తమ సేవలను స్తంభింప చేశారు. ఆ తర్వాత ఈ పంచాయితీ ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు చేరింది. బాధితురాలు వనజాక్షితోపాటు రెవెన్యూ శాఖకు చెందిన నాయకులు... చంద్రబాబు స్వయంగా కలసి మాట్లాడారు. అయితే ఇసుక అక్రమ తవ్వకాలపై సమాచారం అందినప్పుడు మీరు కాకుండా పోలీసులను పంపితే సరిపోయేదిగా అంటూ చంద్రబాబు... వనజాక్షితో పేర్కొన్నట్లు తెలిసింది. ఈ ఘటనపై ఐఏఎస్ అధికారి జేసీ శర్మ విచారణ జరుపుతుందని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.