'ఆ సినిమాతో ఆ ముగ్గురు అరంగేట్రం చేశారు'
ఎంవీ రఘు...అనగానే ఎవరీయన అనేస్తాం...‘కళ్లు’ రఘు అంటే గుర్తుపట్టేస్తాం. దక్షిణ భారతదేశంలో ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా నిరూపించుకొని, దర్శకుడిగా ‘కళ్లు’ సినిమాతో ‘నంది’ సహా పలు అవార్డులను అందుకొన్న సృజనకారుడు. సినిమాకు మూలమైన 24 ఫ్రేమ్స్‌పై శిక్షణనిస్తున్నారు. క్రేజీగా మారిన లఘుచిత్రాలపైనా ప్రత్యేకంగా వర్క్‌షాపులు నిర్వహిస్తున్నారు. సృజనకు సాంకేతికతను జోడించడంపై అవగాహన కల్పిస్తున్నారు. వర్క్‌షాపు ఏర్పాటు నిమిత్తం సోమవారం తెనాలి వచ్చిన రఘు, ‘సాక్షి’తో కొద్దిసేపు ముచ్చటించారు. వివరాలు ఆయన మాటల్లోనే...
తెనాలి : మాది విజయవాడ. సినీఫొటోగ్రాఫర్ కావాలనేది చిన్ననాటి కోరిక. బీఎస్సీ కాగానే ఫొటోగ్రఫీలో డిప్లొమా చేశా. వీఎస్ఆర్ స్వామి నన్ను చెన్నైలోని విజయ-వాహినిలో కెమెరా విభాగంలో చేర్చారు. ఏడాదిలో 270 వివిధ భాషా సినిమాలకు ఉద్దండులతో పనిచేశాను. ‘భక్తకన్నప్ప’తో వీఎస్ఆర్ స్వామి నన్ను సహాయకుడిగా చేర్చుకున్నారు. ‘సిరిసిరిమువ్వ’, ‘అమరదీపం’కు పనిచేశాను. తర్వాత ఎస్.గోపాలరెడ్డి దగ్గర తొలి అసిస్టెంటుగా చేరా. చిరంజీవి, సుహాసిని జంటగా వచ్చిన ‘మగమహారాజు’తో సినిమాటోగ్రాఫర్‌గా నాకు తొలి అవకాశం. వంశీతో ‘సితార’, ‘అన్వేషణ’, ‘ఆలాపన’ చేశా. పూర్ణోదయాలో కె.విశ్వనాథ్ దర్శకత్వంలో తీసిన ‘స్వాతిముత్యం’, ‘సిరివెన్నెల’ మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. సిరివెన్నెలతో నంది అవార్డు వచ్చింది. ఆస్కార్‌కు ఎంట్రీగా వెళ్లిన ఏకైక తెలుగు సినిమా స్వాతిముత్యం క్రెడిట్‌నిచ్చింది.
సొంతంగా సినిమా తీద్దామని స్నేహితులు ప్రోత్సహించారు. 1970లో విజయవాడలో ఆంధ్రనాటక కళాపరిషత్ ప్రదర్శించిన గొల్లపూడి మారుతీరావు నాటిక ‘కళ్లు’ గుర్తొచ్చింది. రైట్స్ తీసుకొని 50 నిముషాల నాటికను 2.13 గంటల సినిమాగా మలచాను. ఊరూరూ తిరిగి నటీనటులను ఎంపిక చేసుకొన్నా. శివాజీరాజా, గుండు హనుమంతరావు ఆ సినిమాతో పాపులర్ అయితే, కళ్లు చిదంబరం, కొండవలస, రఘునాధరెడ్డి అరంగేట్రం చేశారు.
సినిమాకు 30పైగా అవార్డులు వస్తే, దర్శకుడిగా నాకు 11 వచ్చాయి. కళ్లు రఘుగా ఇండస్ట్రీ పిలవటం ఆరంభించింది. తర్వాత మళ్లీ కెమెరా, దర్శకత్వం కొనసాగించా. మొత్తం 70 పైగా హిందీ, తమిళ్, కన్నడ, తెలుగు సినిమాలు చేశా. 1998లో చెన్నై నుంచి హైదరాబాద్ షిప్టయ్యాను.
సినిమాకు సంబంధించిన అన్ని ఫ్రేమ్స్‌ను దగ్గరుండి చూసుకోవటమే కాకుండా ఆ పరిజ్ఞానాన్ని అధ్యయనం చేసిన నాకు, హైదరాబాద్ రాగానే కొత్త లైను దొరికింది. లైటింగ్, ఇతర ఎక్విప్మెంటు ఎదుట నటులు ఎలా మెలగాలి? అనే అంశంపై తరగతులు చెప్పించారు. సెంట్రల్ యూనివర్శిటీ, తెలుగు యూనివర్శిటీల్లో ఎంఏలో పెర్ఫార్మెన్స్ ఆర్ట్స్ విద్యార్థులకు క్లాసులు చెప్పాను. బటన్ నొక్కేవాడు కెమెరామెన్ కాడు.. స్టార్ట్ అని చెప్పినవాడు దర్శకుడు కాడు.. షాట్, లెన్స్, లైటింగ్, కెమెరా మూమెంట్... అనేవి తెలుసుకొని, చెప్పాలనుకున్నది పద్ధతిగా చెబితేనే క్రియేటివిటీ అవుతుంది.
సినిమా అనేది సైన్స్ ఇన్ ఆర్ట్ ఫారం. ఫిల్మ్ మేకింగ్‌కు అవసరమైన వివిధ ఫ్రేమ్స్‌పై అవగాహన కోసం వర్క్‌షాపులు నిర్వహిస్తున్నా. ఈరోజుల్లో లఘుచిత్రాలు తీయటం పెద్ద క్రేజ్‌గా యువత ప్రేమిస్తోంది. యూ ట్యూబ్ వేదికయింది. 2-10 నిముషాల్లో తీసే సినిమాకు చాలా విజ్ఞత కావాలి. ఏ కొన్నో మినహా అధికశాతం చెత్తే.