
గొల్లపూడి మారుతి రావు రాసిన కళ్లు నాటకం ఆధారంగా ఎం.వి.రఘు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘కళ్లు’. 1988లో తెరకెక్కిన ఈ సినిమాలో శివాజీ రాజా ప్రధాన పాత్రలో నటించగా ప్రముఖ దర్శకులు ఈవీవీ సత్యనారాయణ ఈ సినిమాకు కో డైరెక్టర్‌గా పనిచేశారు. అంతేకాదు ఈ సినిమాలో మరెన్నో విశేషాలు ఉన్నాయి. ఈ సినిమాలోని రంగుడు పాత్రకు మెగాస్టార్ చిరంజీవి గాత్రదానం చేశారు. ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రీ ఈ సినిమాలో ‘తెల్లరిందే’ పాట కోసం గాయకుడిగా మారారు. ఇలా ఎన్నో విశేషాలు ఉన్న కళ్లు సినిమా రిలీజ్ అయి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చిత్రయూనిట్ మీడియాలో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఉత్తేజ్ మాట్లాడుతూ.. ‘కళ్లు’ సినిమా 30 వసంతాలు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. సినిమాలు కొంత మందికి అవార్డ్ లని ఇస్తాయి, కొంత మందికి గుర్తింపు ని ఇస్తాయి, మరికొంత మందికి పేరును తీసుకొస్తాయి కొన్ని చిత్రాలు మాత్రమే గుర్తిండి పోతాయి. ఇప్పుడున్న టెక్నాలజీ అప్పుడు లేదు అయినా చాలా అద్భుతంగా తీశారు ఎం.వి.రఘు గారు. భిక్షు గారు ద్వారా ఈ సినిమా కి డైరెక్టర్ గారికి అసిస్టెంట్ కావాలంటే నన్ను వైజాగ్ తీసుకెళ్లారు. అలా నేను కళ్లు సినిమా ద్వారా ఫస్ట్ టైం సినిమా షూటింగ్ చూశాను.
నటుడు శివాజీ రాజా మాట్లాడుతూ.. ‘ఎప్పుడూ ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ లు గురించి మాట్లాడటమే, కానీ ఎప్పుడో 30 ఏళ్ల క్రితం నేను నటించిన ‘కళ్లు’ సినిమా గురించి మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. వంశీ దర్శకత్వంలో కనకమహాలక్ష్మీ రికార్డింగ్ ట్రూప్ సినిమా అవకాశం చేజారిన బాధలో ఉన్న నాకు కళ్లు అవకాశం వరంలా దక్కింది. రఘు గారు ఈ సినిమాను చాలా నేచురల్ గా తెరకెక్కించారు. ఈ సినిమా నాకు రావడానికి కారణమైన ఇవివి గారికి రుణపడి ఉంటాను’అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, ఏడిద శ్రీరామ్, అనితా చౌదరి, బెనర్జీ, భిక్షపతి, కళ్లు కిష్టారావు, సురేష్ కొండేటి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment