m.veera brhamaiah
-
పుష్కరాలకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు
ముకరంపుర : వచ్చే సంవత్సరం జరిగే గోదావరి పుష్కరాలకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై కలెక్టరేట్లోని సమావేశమందిరంలో జిల్లా అధికారులతో సోమవారం సమీక్షించారు. 2003లో జరిగిన గోదావరి పుష్కరాల్లో భక్తులకు కల్పించిన సౌకర్యాలపై ఆరా తీశారు. 2015 పుష్కరాలకు ప్రత్యేకంగా ధర్మపురి, కాళేశ్వరంలో భారీ ఏర్పాట్లు చేయాలన్నారు. పుష్కర స్నానానికి 60 లక్షల మంది వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ప్రతిశాఖ అధికారులు తమ పరిధిలో పుష్కరాలకు చేయూల్సిన ఏర్పాట్లు, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై పూర్తి నివేదికను 15 రోజుల్లో సిద్ధం చేయూలని ఆదేశించారు. 2015లో కాళేశ్వరం, ధర్మపురి, మంథని, కోటిలింగాల ప్రాంతాల్లో భక్తులకు సౌకర్యాలు కల్పించడానికి అంచనాలు రూపొందించాలని సూచించారు. భక్తుల రద్దీ దృష్ట్యా అదనపు స్నాన ఘట్టాల నిర్మాణానికి ప్రతిపాదనలు చేయాలని ఎస్ఈ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. శానిటేషన్, తాగునీటి సరఫరా, తాత్కాలిక మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు తయారుచేయాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఆలయాల వద్ద క్యూలైన్ల నిర్మాణానికి, విద్యుత్ దీప అలంకరణ, ఆలయాల సుందరీకరణకు, క్లాక్రూములు తదితర ఏర్పాట్లకు రూ.3.5కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. ఆలయాల వద్ద 50 లక్షల మంది భక్తులకు సరిపడా మందులు, క్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆర్టీసీ అధికారులు యాత్రికుల కోసం పుష్కరాల సమయంలో 5 వేల బస్సులను తిప్పడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. పటిష్ట బందోబస్తు పుష్కరాల సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ శివకుమార్ తెలిపారు. పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. అదనపు జేసీ నంబయ్య, డీఆర్వో వీరబ్రహ్మయ్య, మంథని, పెద్దపెల్లి, జగిత్యాల ఆర్డీవోలు, ఏడీ ఎండోమెంట్స్ రాజేశ్వర్, ధర్మపురి ఈవో తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : మున్సిపల్ కార్మికుల హక్కుల సాధన కోసం తెలంగాణ జిల్లాల కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. డిమాండ్లు పరిష్కరించాలని నినాదాలు చేశారు. అనంతరం కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్యకు వినతిపత్రం సమర్పించారు. ధర్నాకు మాజీ ఎమ్మెల్సీ నారదాసు మద్దతు పలికారు. టీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రూప్సింగ్, టీఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి బొల్లంపల్లి అయిలయ్య మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అక్టోబర్‌లో 4 రోజులపాటు సమ్మె చేస్తే ప్రభుత్వం స్పందించి ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదన్నారు. హామీలు అమలయ్యేవరకూ పోరాటం చేస్తామన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే ఫిబ్రవరి 3నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. కార్మికులకు కనీస వేతనం రూ.12,500కు తగ్గకుండా ఇవ్వాలని, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఎన్ఎంఆర్ ఉద్యోగ, కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికులకు మధ్యంతర భృతి ఇవ్వాలన్నారు. వారాంతపు సెలవులు ఇవ్వాలని కోరారు. కాంట్రాక్టు కార్మికులకు ఇందిరమ్మ ఇళ్లు పథకం కింద గృహాలు నిర్మించాలన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు పెండ్యాల మహేశ్, కార్మిక నాయకులు తిరుపతి నాయక్, మధునయ్య, శంకర్, పద్మ, అంజయ్య, బాపన్న తదితరులున్నారు. -
కళోత్సవాలకు మోక్షం
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సుదీర్ఘకాలంగా వాయిదాపడుతూ వస్తున్న శాతవాహన కళోత్సవాల నిర్వహణకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఈ నెల 20, 21, 22 తేదీల్లో కళోత్సవాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య వెల్లడించారు. శాతవాహన కళోత్సవాల నిర్వహణపై జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యాన్ని ప్రశ్నించేలా ‘సాక్షి’ వరుస కథనాలను ప్రచురించింది. జిల్లా సంస్కృతీ సంప్రదాయాలు, చారిత్రక వైభవాన్ని ప్రతిబింబించే ఈ ఉత్సవాలను జనవరిలో నిర్వహించడానికి ప్రణాళిక రూపొందించారు. అప్పటి కలెక్టర్ స్మితా సబర్వాల్ హయాంలోనే వివిధ కారణాలతో ఫిబ్రవరికి వాయిదా వేశారు. మళ్లీ వాయిదాలు వేసుకుంటూ రావడంతో పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇలా ఎప్పటికప్పుడు ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యాన్ని ‘సాక్షి’ కథనాల్లో ప్రస్తావించింది. చారిత్రక వైభవం, పర్యాటక రంగం పట్ల నిర్లక్ష్యం చూపడమేమిటని ప్రశ్నించింది. ‘సాక్షి’ కథనాలకు కదలిన యంత్రాంగం కళోత్సవాల నిర్వహణ ఏర్పాట్లను వేగవంతం చేసే చర్యలు తీసుకుంది. శనివారం కలెక్టరేట్ సమావేశమందిరంలో శాతవాహన కళోత్సవాల నిర్వహణపై కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య వివిధ శాఖల అధికారులతో చ ర్చించారు. కళోత్సవాల నిర్వహణకు గతంలో ఏర్పాటు చేసిన కమిటీలు తమకు కేటాయించిన ఏర్పాట్లు వేగవంతం చేయాలని ఆదేశించారు. జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అక్టోబర్ 20న కళోత్సవాలను ప్రారంభిస్తారని తెలిపారు. సమయం తక్కువగా ఉన్నందున సంబంధిత కమిటీల అధ్యక్షులు అంతర్గత సమావేశాలు నిర్వహించి ఏర్పాట్లను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి కె.కృష్ణారెడ్డి, డ్వామా పీడీ మనోహర్, జెడ్పీ సీఈవో చక్రధర్‌రావు, డీపీఆర్వో శ్రీనివాస్, డీఈవో లింగయ్య, ట్రాన్స్‌కో ఎస్ఈ నారాయణ, నగరపాలక సంస్థ కమిషనర్ రమేశ్, గ్రంథాలయ సంస్థ సెక్రటరీ ఏవీఎన్.రాజు, ఆర్డీవో రాంచంద్రం తదితరులు పాల్గొన్నారు.