కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సుదీర్ఘకాలంగా వాయిదాపడుతూ వస్తున్న శాతవాహన కళోత్సవాల నిర్వహణకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఈ నెల 20, 21, 22 తేదీల్లో కళోత్సవాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య వెల్లడించారు. శాతవాహన కళోత్సవాల నిర్వహణపై జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యాన్ని ప్రశ్నించేలా ‘సాక్షి’ వరుస కథనాలను ప్రచురించింది. జిల్లా సంస్కృతీ సంప్రదాయాలు, చారిత్రక వైభవాన్ని ప్రతిబింబించే ఈ ఉత్సవాలను జనవరిలో నిర్వహించడానికి ప్రణాళిక రూపొందించారు. అప్పటి కలెక్టర్ స్మితా సబర్వాల్ హయాంలోనే వివిధ కారణాలతో ఫిబ్రవరికి వాయిదా వేశారు. మళ్లీ వాయిదాలు వేసుకుంటూ రావడంతో పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇలా ఎప్పటికప్పుడు ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యాన్ని ‘సాక్షి’ కథనాల్లో ప్రస్తావించింది. చారిత్రక వైభవం, పర్యాటక రంగం పట్ల నిర్లక్ష్యం చూపడమేమిటని ప్రశ్నించింది. ‘సాక్షి’ కథనాలకు కదలిన యంత్రాంగం కళోత్సవాల నిర్వహణ ఏర్పాట్లను వేగవంతం చేసే చర్యలు తీసుకుంది. శనివారం కలెక్టరేట్ సమావేశమందిరంలో శాతవాహన కళోత్సవాల నిర్వహణపై కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య వివిధ శాఖల అధికారులతో చ ర్చించారు.
కళోత్సవాల నిర్వహణకు గతంలో ఏర్పాటు చేసిన కమిటీలు తమకు కేటాయించిన ఏర్పాట్లు వేగవంతం చేయాలని ఆదేశించారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అక్టోబర్ 20న కళోత్సవాలను ప్రారంభిస్తారని తెలిపారు.
సమయం తక్కువగా ఉన్నందున సంబంధిత కమిటీల అధ్యక్షులు అంతర్గత సమావేశాలు నిర్వహించి ఏర్పాట్లను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి కె.కృష్ణారెడ్డి, డ్వామా పీడీ మనోహర్, జెడ్పీ సీఈవో చక్రధర్‌రావు, డీపీఆర్వో శ్రీనివాస్, డీఈవో లింగయ్య, ట్రాన్స్‌కో ఎస్‌ఈ నారాయణ, నగరపాలక సంస్థ కమిషనర్ రమేశ్, గ్రంథాలయ సంస్థ సెక్రటరీ ఏవీఎన్.రాజు, ఆర్డీవో రాంచంద్రం తదితరులు పాల్గొన్నారు.
కళోత్సవాలకు మోక్షం
Published Sun, Oct 6 2013 5:02 AM | Last Updated on Fri, Sep 1 2017 11:22 PM
Advertisement
Advertisement