కలెక్టరేట్, న్యూస్‌లైన్ : మున్సిపల్ కార్మికుల హక్కుల సాధన కోసం తెలంగాణ జిల్లాల కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. డిమాండ్లు పరిష్కరించాలని నినాదాలు చేశారు. అనంతరం కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్యకు వినతిపత్రం సమర్పించారు. ధర్నాకు మాజీ ఎమ్మెల్సీ నారదాసు మద్దతు పలికారు. టీఆర్‌ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రూప్‌సింగ్, టీఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి బొల్లంపల్లి అయిలయ్య మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అక్టోబర్‌లో 4 రోజులపాటు సమ్మె చేస్తే ప్రభుత్వం స్పందించి ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదన్నారు. హామీలు అమలయ్యేవరకూ పోరాటం చేస్తామన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే ఫిబ్రవరి 3నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.
కార్మికులకు కనీస వేతనం రూ.12,500కు తగ్గకుండా ఇవ్వాలని, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఎన్‌ఎంఆర్ ఉద్యోగ, కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికులకు మధ్యంతర భృతి ఇవ్వాలన్నారు. వారాంతపు సెలవులు ఇవ్వాలని కోరారు. కాంట్రాక్టు కార్మికులకు ఇందిరమ్మ ఇళ్లు పథకం కింద గృహాలు నిర్మించాలన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకుడు పెండ్యాల మహేశ్, కార్మిక నాయకులు తిరుపతి నాయక్, మధునయ్య, శంకర్, పద్మ, అంజయ్య, బాపన్న తదితరులున్నారు.
సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె
Published Thu, Jan 23 2014 3:23 AM | Last Updated on Sat, Sep 2 2017 2:53 AM
Advertisement