My Home rameswara rao
-
'ప్రాజెక్టుల పేరుతో మైహోంకు దోచిపెడుతున్నారు'
సాక్షి, రంగారెడ్డి : ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పేద ప్రజలపై ప్రేమ లేదని, ప్రాజెక్టుల పేరుతో మైహోం రామేశ్వర్‌రావుకు దోచిపెడుతున్నారంటూ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా శుక్రవారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీలో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి కోమటిరెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్, ఆయన కుటుంబం కలిసి అభివృద్ధి పేరుతో రూ. 2 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని తెలిపారు. మిగులు బడ్జెట్‌గా ఉన్న తెలంగాణను లోటు బడ్జెట్ కింద మార్చారని విమర్శించారు. కేసీఆర్ అనాలోచిత నిర్ణయం వల్లే ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ. 2లక్షల కోట్లు ఖర్చు చేసిన కేసీఆర్ మూసీ ప్రక్షాళలను గాలికి వదిలేసారని దుయ్యబట్టారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తానని చెప్పి కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఎప్పుడు ముందుండే కాంగ్రెస్‌ను మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేంద్రం నుంచి మున్సిపాలిటీల అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకువస్తామని, మూసీ ప్రక్షాళనకు ప్రధాని మోదీని కలిసి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తానని వెల్లడించారు. కాగా మున్సిపాలిటీ అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే ఆరుసార్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి నిధులు తీసుకువచ్చానని స్పష్టం చేశారు. తాను కేంద్రం వెంటపడి ఎల్బీ నగర్ నుంచి హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేట నుంచి అందోల్ మైసమ్మ గుడి వరకు ఎనిమిది లైన్ల రోడ్డును తెచ్చామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్రెడ్డి రంగారెడ్డి, ఇతరులు పాల్గొన్నారు. (కేటీఆర్‌కు కాంగ్రెస్ గురించి బాగా తెలుసు : కోమటిరెడ్డి) -
పూర్తిగా జూపల్లి చేతికి ‘మై హోమ్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇప్పటిదాకా ఐర్లాండ్ ప్రధాన కేంద్రంగా ఉన్న బిల్డింగ్ మెటీరియల్ కంపెనీ సీఆర్‌హెచ్ ఇండియాతో కలిసి 50:50 భాగస్వామ్య కంపెనీగా ఉన్న ‘మై హోమ్ ఇండస్ట్రీస్’ను జూపల్లి రామేశ్వరరావుకు చెందిన సంస్థలు పూర్తిగా సొంతం చేసుకోనున్నాయి. సీఆర్‌హెచ్ ఇండియాకు చెందిన 50 శాతం వాటాను మైహోమ్‌కు చెందిన నిర్మాణ సంస్థ మైహోమ్ కన్స్ట్రక్షన్స్, జూపల్లి రియల్ ఎస్టేట్ డెవలపర్స్, గ్రూప్ ప్రమోటరు జూపల్లి రామేశ్వరరావు కలిసి కొనుగోలు చేశారు. ఇందుకోసం వీరు దాదాపు రూ.1000 కోట్ల వరకూ వెచ్చించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీనికి గురువారం కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదం కూడా లభించింది. 4 ప్లాంట్స్, 10 లక్షల టన్ను..: మై హోమ్ ఇండస్ట్రీస్ ప్రస్తుతం ‘మహా సిమెంట్’ బ్రాండ్ పేరిట గ్రే సిమెంట్ తయారీ, సరఫరాలో ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బిహార్, మహారాష్ట్ర, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ పాండిచ్చేరి వంటి 11 రాష్ట్రాల్లో సిమెంట్ సరఫరా చేస్తోంది. సుమారు 5 వేల మందికి పైగా డీలర్లు ఉన్నారు. 10 లక్షల టన్నుల వార్షిక సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది. సంస్థకు తెలంగాణలోని సూర్యాపేటతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్, విశాఖ జిల్లాల్లోనూ, అదేవిధంగా తమిళనాడులో కలిపి మొత్తం నాలుగు తయారీ ప్లాంట్లు ఉన్నాయి. ఇక మై హోమ్ గ్రూప్... సిమెం ట్, కన్స్ట్రక్షన్స్, రియల్ ఎస్టేట్, పవర్, కన్సల్టెన్సీ, మీడియా, ఫార్మాసూటికల్స్, ఎడ్యుకేషన్, ట్రాన్స్‌పోర్టేషన్, లాజిస్టిక్స్ వంటి పలు రంగాల్లో విస్తరించి ఉంది. -
మైహోం రామేశ్వరరావు ఇంటిపై ఐటీ దాడులు
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త, మైహోం గ్రూప్స్ అధినేత జూపల్లి రామేశ్వరరావు ఇల్లు, కార్యాలయాల్లో ఆదాయపన్ను (ఐటీ) శాఖ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. బంజారాహిల్స్‌లోని రామేశ్వరరావు ఇల్లు, హైటెక్ సిటీలోని ఆయన కార్యాలయంలో ఈ తనిఖీలు జరిగాయి. బెంగళూరులో ఓ సంస్థకు, మైహోం గ్రూప్స్‌నకు మధ్య జరిగిన వ్యాపార లావాదేవీల విషయంలో స్పష్టత కోసం ఈ దాడులు జరిగినట్లు తెలిసింది. -
జూపల్లి వారి ఇంట పెళ్లి సందడి
సాక్షి, హైదరాబాద్: మై హోమ్స్ అధినేత, ప్రముఖ వ్యాపారవేత్త జూపల్లి రామేశ్వరరావు సోదరుడు జగపతిరావు కుమార్తె శ్రీలక్ష్మి వివాహం జస్టిస్ నవీన్‌రావు కుమారుడు నృపుల్‌తో ఘనంగా జరిగింది. శుక్రవారం హైదరాబాద్‌లోని మాదాపూర్ హెచ్ఐసీసీ నోవాటెల్‌లో ఈ వివాహ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ, మహారాష్ట్ర గవర్నర్లు ఈఎస్ఎల్ నరసింహన్, విద్యాసాగర్‌రావు, సీఎం కె.చంద్రశేఖర్‌రావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిలు నూతన వధూవరులను ఆశీర్వదించారు. వివాహ వేడుకలో రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పి.రవీంద్రనాథ్‌రెడ్డి, కాటసాని రామిరెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, వ్యాపార, వాణిజ్యసంస్థల అధినేతలు, న్యాయమూర్తులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. -
రేవంత్ రెడ్డికి రూ. 90 కోట్లకు లీగల్ నోటీసులు
హైదరాబాద్ : టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి మై హోం కన్స్ట్రక్షన్స్ రామేశ్వరరావు లీగల్ నోటీసులు ఇచ్చారు. రేవంత్ రెడ్డి తనపై చేసిన ఆరోపణల వల్ల పరువు నష్టం కలిగిందంటూ రూ.90 కోట్లుకు లీగల్ నోటీసులు ఇచ్చారు. మరోవైపు రేవంత్ రెడ్డి లీగల్ నోటీసులపై స్పందిస్తూ తన ఆరోపణలకు ఇంకా కట్టుబడి ఉన్నానన్నారు. లీగల్ నోటీసులపై న్యాయపోరాటం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాగా మెట్రో రైలు ప్రాజెక్టు భూమిని ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేస్తున్నారంటూ రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. మెట్రో భూమిని రామేశ్వరరావు భాగస్వామిగా ఉన్న ఆక్వా స్పేస్ డెవలపర్స్‌కు ఇచ్చారని టీడీపీ ఆరోపించగా... అదేమీ లేదని, తమ భూమి తమ వద్దనే ఉందని ఎల్అండ్టీ వివరణ ఇచ్చింది. అయినా తగ్గని టీడీపీ.. రామేశ్వర్‌రావుకు కేసీఆర్ ప్రభుత్వం లబ్ధి చేకూర్చిందని, బహిరంగ చర్చకు రావాలని సవాళ్లకు దిగింది. దీనికి ప్రతిగా టీడీపీపై టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేసుకున్న విషయం తెలిసిందే.