మరో కాలాపానీ: అల్కట్రాజ్.. ఒకనాటి కారాగారం
బ్రిటిష్ హయాంలో అండమాన్‌లోని కాలాపానీ జైలు గురించి అందరికీ తెలుసు. ఇది అమెరికన్ ద్వీప కారాగారం. కాలిఫోర్నియాలోని శాన్ఫ్రాన్సిస్కో తీరానికి ఆవల ఉన్న చిన్న దీవి అల్కట్రాజ్. ఒకప్పుడు అమెరికన్ ప్రభుత్వం కరడుగట్టిన నేరగాళ్లను బంధించేందుకు ఇక్కడ కారాగారాన్ని నిర్మించింది. కేవలం 2.01 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల ఈ ఏకాంత దీవిలో కట్టుదిట్టమైన జైలును 1775లో నిర్మించారు.
ఇది 1963 వరకు పనిచేసింది. పెలికాన్ పక్షులకు విడిది కేంద్రంగా ఉన్న ఈ దీవిలోని జైలు నుంచి తప్పించుకుపోవడం అసాధ్యం. జైలు గోడలు దాటి బయటపడినా, చుట్టూ భీకరమైన సముద్రం. సముద్రంలో ఈతకొట్టాలని తెగించినా, ఇక్కడి సముద్ర జలాలు గడ్డకట్టించేంత చల్లగా ఉంటాయి.
అవతలి తీరం చేరేంత వరకు ఈతకొడుతూ బతికి బట్టకట్టడం మానవమాత్రులకు సాధ్యమయ్యే పని కాదు. ఇక్కడి జైలు మూతబడిన తర్వాత ఇది కేవలం చారిత్రక కట్టడంగా మాత్రమే మిగిలింది. అప్పుడప్పుడు పర్యాటకులు ఇక్కడికి వచ్చి, ఈ జైలును చూసి పోతుంటారు.