mystery illness
-
ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్...భయంకర పోరాటం: చివరికి ఇలా..!
బ్రెజిలియన్ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ అడ్రియానా థైసెన్ (49) అకస్మాత్తుగా కన్నుమూయడం విషాదాన్ని రేపింది. కేవలం ఒక్క ఏడాదిలోనే 100 పౌండ్లు (45 కిలోలు) తగ్గి పాపులర్ అయిన థైసెన్ అనూహ్యంగా కన్నుమూసింది. ఆమె అకాల మరణ వార్తను ఆమె బంధువు ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో ఆమె ఫాలోయర్లు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. థైసెన్ సెప్టెంబరు 17న బ్రెసిలియాకు దక్షిణంగా ఉన్న ఉబెర్లాండియాలోని తన నివాసంలో అంతుచిక్కని వ్యాధితో మరణించినట్టు తెలుస్తోంది. అయితే ఆమె మృతికి గల ఖచ్చితమైన కారణాన్ని కుటుంబ సభ్యులు వెల్లడించ లేదు. ఆమె మృతిపై సంతాపాన్నిప్రకటించి, ఆత్మశాంతికి ప్రార్దనలు చేయాలని మాత్రమే అభ్యర్థించారు. థైసెన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోయర్ల సంఖ్య 6 లక్షలకు పై మాటే. ముఖ్యంగా తన వెయిట్ లాస్ జర్నీతో కేవలం 100 మందితో మొదలు పెట్టి క్రమంగా బాగా పాపులర్ అయింది. అదే ఆమెకు ఇంటర్నెట్ స్టార్డమ్ తెచ్చి పెట్టింది. చిన్ననాటి నుండి అధికత బరుతో బాధపడేది. చివరికి మాదకద్రవ్యాల బానిసై, డిప్రెషన్లోకి వెళ్లి పోయింది. కానీ దీన్నుంచి బయటపడటానికి భయంకరమైన పోరాటమే చేసింది. 39 ఏళ్ల నాటికి 220 పౌండ్ల (సుమారు 100 కిలోలు) బరువుతో ఆమె తన ఫిట్నెస్ ప్రయాణాన్ని ప్రారంభించింది. తన కష్టాలను వివిధ టాక్ షోలలో మాట్లాడుతూ థైసెన్ సోషల్ మీడియాలో దారుణంగా విలపించేది. కానీ ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని ప్రోత్సహించేది. ఆరోగ్యకరమైన ఆహారం , వ్యాయామంతో కమిటెడ్‌గా పనిచేసి బరువు తగ్గానంటూ చాలామందికి ఇన్స్పిరేషన్గా నిలిచింది. ఫిట్నెస్ ప్రయాణాన్ని కొనసాగిస్తూనే 'ద్రికాస్ స్టోర్' అనే ప్లస్-సైజ్ యాక్టివ్‌వేర్ , దుస్తుల బ్రాండ్‌ను కూడా నడిపింది. పోషకాహార నిపుణుడి వద్దకు వెళ్లే స్థోమత లేక ఆన్లైన్లో లభించిన చిట్కాలను ఉపయోగించి పండ్లు సలాడ్స్, జ్యూస్‌లతో తనదైన ఆహార నియమాలు,కఠిన వ్యాయాయంతో తనను తాను తీర్చిదిద్దు కుంది. అలా ఫిబ్రవరి 2013లో 107 కిలోల బరువునుంచి 62.7 కేజీలకు చేరుకోవడం అంటే మాటలు కాదు. కానీ చివరికి అర్థాంతరంగా ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది. థైసెన్ ఇక లేదన్న వార్తను ఆమె లక్షలాది ఫాలోయర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. అధికారిక దృవీకరణేదీలేనప్పటికీఘామె ఆత్మహత్య చేసుకుందని కమెంట్ చేస్తున్నారు. అద్భుతమైన, అందమైన మహిళ, ఆత్మహత్య చేసుకోవడంబాధాకరం, సోషల్‌మీడియా కామెంట్లే ఆమెను చంపేశాయని కొందరంటే, అర్ధంలేని కామెంట్లు మానేసి డిప్రెషన్‌తో బాధపడుతున్న వారిని మాటల్ని విందాం అంటూ మరొకరు వ్యాఖ్యానించడం గమనార్హం. ఆత్మహత్య అవగాహన నెల, యెల్లో రిబ్బన్‌తో ప్రాతినిధ్యం వహించే 'ఎల్లో సెప్టెంబర్' థైసెన్ మృతిపై పలువురు వినియోగదారులు విచారం వ్యక్తం చేశారు. ఎవరితోనూ పోల్చుకోకండి, ఏదైనా మన చేతిలో మిమ్మల్ని మీరు ఎవరితోనూ పోల్చుకోకండి, ప్రతి ఒక్కరికి భిన్నమైన శారీరక స్వభావం, చర్మం, ఆర్థిక, వ్యక్తిగత పరిస్థితులు ఉంటాయి. దాని ప్లాన్ చేసుకోండి.మనం కోరుకున్నది పొందడం మనపై తప్ప మరెవరిపైనా ఆధారపడదు దీనికి నేనే రుజువు. కాబట్టి మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుందాం ఇదీ తరచుగా ఆమె ఫ్యాన్స్‌కు చెప్పేమాట. -
ఏలూరు ఘటన: తుది నివేదికలో ఏముంది?
సాక్షి, పశ్చిమ గోదావరి : ఏలూరు ఘటన జరిగిన వెంటనే స్థానిక ల్యాబ్‌లలో నీటి నమూనాలు పరిశీలించగా అందులో ఏం బయట పడలేదని ఏపీ వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఢిల్లీ, మంగళగిరిలోని ఏయిమ్స్, సీసీఎంబీ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, విరాలజీ ల్యాబ్ పూణే, డబ్ల్యూహెచ్ఓ లాంటి సంస్థల సహకారాన్ని తీసుకుని నమూనాలు పరీక్ష చేశామని వెల్లడించారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మంగళవారం జిల్లాలో మాట్లాడుతూ.. ఏలూరు ఘటనపై తుది నివేదికలు అన్ని చూస్తే సీసీఎంబీ ఇచ్చిన నివేదికలో ఈ వ్యాధికి ఎలాంటి బ్యాక్టీరియా లేదా వైరస్ కారణం కాదని తేల్చి చెప్పిందని పేర్కొన్నారు. నివేదికలో ఆర్గానో పాస్పోరస్ కాంపౌండ్ ఉన్నట్లు తేలిందని, ఒక హెర్బిసైడ్ కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని తేలిందన్నారు. లెడ్, నికేల్ లాంటి బార లోహాలు ఉన్నట్టు కూడా రక్తం, యూరిన్ నమునాల్లో తేలిందని తెలిపారు. అయితే వీటివల్ల ఇలాంటి వ్యాధి రాదని తేల్చారని పేర్కొన్నారు. చదవండి: మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కార్పోరేషన్ బోర్డుకు ఉత్తర్వులు ఆర్గానో క్లోరినో లాంటి రసాయనాలు వల్ల ఈ తరహా వ్యాధి వచ్చే అవకాశం ఉందని, కానీ తీసిన నమునాల్లో ఆ రసాయనం ఆనవాళ్లు కనిపించలేదన్నారు. అతి తక్కువ స్థాయిలో ఈ రసాయనం నమునాల్లో తీసే సమయానికే దాని జీవిత కాలం ముగిసిపోతే అది బయటపడే అవకాశం లేదని ల్యాబ్‌లన్నీ అభిప్రాయం వ్యక్తం చేశాయన్నారు. భార లోహాల వల్ల దీర్ఘ కాలిక దుష్పరిణామాలు ఉండే అవకాశం ఉందని జాతీయ పరిశోధనా సంస్థలు చెప్పాయన్నారు. దీనిపై దీర్ఘకాలికంగా దృష్టి పెట్టాల్సి ఉందని పేర్కొన్నారు. ఏలూరు, పరిసర ప్రాంతాల నీటి వ్యవస్థలు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాలోని ఆహార పదార్థాలు, గాలి నాణ్యత, వినియోగిస్తున్న ఎరువులు, రసాయనాలపై, పారిశ్రామిక వ్యర్ధాలపై అధ్యయనం చేయాల్సి ఉందని అనిల్ కుమార్ పేర్కొన్నారు. దీనికోసం కొన్ని కేంద్ర ప్రభుత్వ రంగ పరిశోధన సంస్థలతో ఒప్పందం చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని ఇండో సల్ఫేన్ లాంటి నిషేధిత రసాయనాల వినియోగం ఏమైనా జరుగుతుందా అనే అంశంపై కూడా పరిశోధన చేయాల్సి ఉందన్నారు. ఈ ప్రాంతాల్లో కూరగాయలు, బియ్యం, పాలు లాంటి వినియోగ వస్తువులపై దీర్ఘకాల దృష్టి పెడతామని తెలిపారు. సాగుకు వినియోగిస్తున్న నీటిని కూడా పరిశోధించాల్సి ఉందని, ఈ ఘటనలు జరిగినప్పుడు మన వద్ద ల్యాబ్‌లు కూడా లేవని అన్నారు. విశాఖ, గుంటూరు, తిరుపతిలలో అన్ని రకాల పరీక్షలు చేసేందుకు ల్యాబ్‌లు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. వచ్చే ఆరు నెలల పాటు పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాల్సి ఉందన్న ఆయన జలవనరుల శాఖకు నుంచి కూడా నివేదిక కోరినట్లు పేర్కొన్నారు. ఏలూరు కాలువలో కలిసే నీటి వ్యర్ధాలు కార్ వాష్, బ్యాటరీల వ్యర్ధాల వల్ల వచ్చే అవకాశం పై పరిశీలన చేయాలని కోరినట్లు తెలిపారు. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలో ఆర్గానిక్ ఫార్మింగ్ పై కూడా దృష్టి పెడతామని పేర్కొన్నారు. -
అంతుచిక్కని రోగం: ముఖం భయంకరంగా..
మనీలా(ఫిలిప్పిన్స్) : అంతుచిక్కని రోగం అతని ముఖాన్ని భయంకరంగా మార్చేసింది. తల భాగం మామూలు కంటే మూడు రెట్లు పెద్దదై కళ్లని సైతం పూర్తిగా కప్పివేసింది. సైనసైటిస్ అనుకున్న రోగం అనుకోని మలుపు తిరిగి అంతుచిక్కని రోగంగా మారిన వైనం అతడి జీవితాన్ని అస్తవ్యస్తం చేసింది. వివరాల్లోకి వెళితే.. ఫిలిప్పిన్స్‌కు చెందిన రొములో పిలాపి (56) వడ్రంగి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొద్ది సంవత్సరాల క్రితం అనారోగ్యం కారణంగా కళ్లు మంటలు పెట్టడం, ముక్కు అదేపనిగా కారటం ప్రారంభమైంది. డాక్టర్లను సంప్రదించగా సైనసైటిస్ అని ప్రాథమికంగా తేల్చారు. కానీ, కొన్ని వారాల తర్వాత పరిస్థితి మారి ముఖం మెల్లమెల్లగా ఉబ్బటం మొదలైంది. దీంతో అక్కడి వైద్యులు అతడ్ని వేరే చోట చికిత్స చేయించుకోవల్సిందిగా సూచించారు. అయితే పేదరికంలో మగ్గిపోతున్న అతని కుటుంబం ఇందుకు సిద్ధపడలేకపోయింది. రోజురోజుకూ అతడి ముఖం వాచిపోయి కళ్లు రెండూ మూసుకుపోయాయి. అతడి తల మామూలు కంటే మూడు రెట్లు పెద్దదైపోయింది. దీంతో కుటుంబ భారం చదువుకుంటున్న అతడి పిల్లలపైపడింది. వారు చదువులు మానేసి, కుటుంబాన్ని పోషించటానికి పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పిలాపి బంధువు మాట్లాడుతూ..‘‘ మొదట అతడికి అలర్జీ ఉండేది. అతడి కళ్లు విపరీతంగా నలతలు ప్రారంభమయ్యాయి. ముక్కు ఎర్రగా మారింది. అప్పుడు అతడికి జలుబు కూడా ఉంది. దీంతో అతడు దాన్ని సైనసైటిస్ భావించాడు. ఆ తర్వాత ముఖం ఉబ్బిపోవటం మొదలైంది. వైద్యులు అతన్ని పరీక్షించినా రోగం ఏంటో కనుక్కోలేకపోయారు. చేతులెత్తేసి మరో పెద్ద ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. డబ్బులు లేకపోవటం వల్ల అతడికి చికిత్స చేయించటం కుదరలేదు. చివరిసారిగా అతడు 2018లో ఆసుపత్రికి వెళ్లాడు. వాళ్లు చాలా మంచి వాళ్లు. వారికి సహాయం కచ్చితంగా అందుతుంద’’ని ఆశాభావం వ్యక్తం చేశాడు. -
కలాచీ ఎందుకు నిద్రపోతోంది..?
సాక్షి, స్కూల్ ఎడిషన్: మన పురాణాల్లో కుంభ కర్ణుడు, ఊర్మిళా దేవి లాంటి పాత్రల గురించి ప్రస్తావన ఉంది. రోజుల తరబడి నిద్రపోవడమే వీరి ప్రత్యేకత. అయితే నిజజీవితంలో ఇలా సాధ్యమవుతుందా? ఎటువంటి అనారోగ్యమూ లేకుండా ఉన్నపలంగా నిద్రపోయి, హాయిగా ఓ వారం తర్వాత నిద్రలేవడం కుదురుతుందా.? దీనికి సమాధానం 'కలాచీ' కజాఖ్స్థాన్లోని ఓ మారుమూల గ్రామం ఇది. ఇక్కడి ప్రజలు కుంభ కర్ణుడి నిద్రలో ఉంటున్నారు. దీనికి కారణం ఏంటి? కలాచీ ఎందుకు నిద్రపోతోంది..? కజాఖ్స్థాన్ రాజధాని అస్తానాకు సుమారు 480 కి.మీ. దూరాన ఉండే కలాచీ ప్రస్తుతం అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది. నిద్రాపీడిత గ్రామంగా పేరుపడిన ఈ గ్రామం ఒకప్పుడు 6,500 మంది జనాభాతో సుభిక్షంగా ఉండేది. అయితే 2012 నుంచి కలాచీకి కష్టాలు మొదలయ్యాయి. ఈ గ్రామస్థులు అకస్మాత్తుగా నిద్రలోకి జారుకునేవారు. కారు నడుపుతూ, ఆవుకు మేత వేస్తూ, పాఠశాలకు వెళ్తూ, ల్యాప్‌టాప్‌లో ప్రొగ్రామింగ్ చేస్తూ.. ఇలా ఎక్కడివారు అక్కడే నిద్రపోవడం మొదలుపెట్టారు. కుంభకర్ణ నిద్ర.. ఈ నిద్ర సాధారణమైందే అయితే ఎలాంటి సమస్యా ఉండేది కాదు. వీరంతా అసాధారణ రీతిలో రెండు నుంచి ఆరు రోజుల వరకూ నిద్రలోనే ఉండేవారు. ఎంత తట్టినా మెలకువ వచ్చేది కాదు. ఓ రకంగా చెప్పాలంటే ఎవరైనా మత్తుమందు సూదులు ప్రయోగించారేమో అనేంత మత్తుగా నిద్రపోయేవారు. సమీప ఆసుపత్రిలోని డాక్టర్లు, నర్సుల సేవల నడుమ కళ్లు తెరచేవారు. పరిణామాలు.. నిద్ర లేచిన తర్వాత బాధితులు వింతగా ప్రవర్తించేవారు. కొందరు తమ గతాన్ని మర్చిపోయారు. ఇంకొంత మంది ఆలస్యంగా పాత విషయాలను గుర్తు తెచ్చుకునేవారు. చిన్నారులైతే మరీ కంగారు పెట్టేవారు. తన తలపై గుర్రాలు, బల్బులు తిరుగుతున్నాయని ఓ చిన్నారి చెప్పాడు. 'మా అమ్మ ముఖం మీద ఏనుగు తొండం ఉంది' అని మరో బాలిక చెప్పేది. మగవారికైతే అసాధారణ లైంగిక వాంఛ కలిగేది. మద్యం సేవించినట్టు తూలుతూ నడిచేవారు. ఎందుకు..? 2012లో తొలిసారి ఈ సమస్య తలెత్తినపుడు చాలా మంది ఇదేదో మాయరోగం అనుకున్నారు. ఏవో దుష్ట శక్తులు గ్రామాన్ని పట్టిపీడిస్తున్నాయని ప్రచారం చేసేవారు. తర్వాత వరుసగా 2013 మే, 2014 జనవరి, మే నెలల్లో కూడా ఇలాంటి సంఘటనలే జరగడంతో పరిశోధకులు రంగంలోకి దిగారు. నిద్ర బాధితులంతా ఆరోగ్యంగానే ఉన్నారని తొలుత నిర్ధరించుకున్నారు. అక్కడి నేల, నీరు, గాలిపై 7వేల పరిశోధనలు చేశారు. అయితే ఏమీ తేల్చలేకపోయారు. 'స్లీపింగ్ సిండ్రోమ్'గా పిలిచే ఈ పరిణామానికి కారణమేంటో కనిపెట్టలేకపోయారు. అనుమానాలు.. దీంతో ప్రజల్లో రకరకాల అనుమానాలు పుట్టుకొచ్చాయి. కొందరు దీన్ని గ్రహాంతర వాసుల పనే అన్నారు. మరికొందరు కలుషిత వాయువుల ప్రభావం అన్నారు. నదీ జలాల్లో ఏవో వ్యర్థాలు కలుస్తున్నాయన్నది ఒక వాదన. భూస్వాములు, వ్యాపారవేత్తల కుతంత్రం చేస్తున్నారని.. కలాచీ గ్రామం కింద బంగారు గనులు ఉన్నాయని వాటిని తవ్వుకునేందుకే ఇలా గ్రామాన్ని ఖాళీ చేయించే పని చేస్తున్నారని ఇంకొందరు మండిపడ్డారు. ఇవన్నీ కేవలం అపోహలేనని, గ్రామ సమీపంలో ఉన్న పాడుబడిన యురేనియం గనులే ఈ అనర్థాలకు కారణమని విద్యావంతులు గొంతెత్తారు. ఇదీ కారణం.. గత కొన్నేళ్ల పరిశోధనల అనంతరం కజఖ్ ప్రభుత్వం తాజాగా దీనికి కారణాలు వెల్లడించింది. మూతబడిన యురేనియం గనులనే దోషిగా తేల్చింది. ఇందులో కార్బన్ మొనాక్సైడ్, హైడ్రోకార్బన్లు అధిక మొత్తంలో ఉత్పత్తి అవ్వడమే ఈ విపత్కర పరిస్థితికి కారణమని ఆ దేశ ఉపాధ్యక్షుడు బెర్డీబెక్ సపర్బయేవ్ తెలిపారు. యురేనియం గనుల్లో కార్బన్ మొనాక్సైడ్ స్థాయి పెరుగుతున్న కొద్దీ కలాచీలో ఆక్సిజన్ స్థాయి తగ్గుతోందని, దీంతో ప్రజలు నిద్రలోకి జారుకుంటున్నారని వివరించారు. గనుల్లోని విషవాయువులు భూమి పగుళ్ల ద్వారా ఉపరితలంపైకి వస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం 223 కుటుంబాలు ఇక్కడ నివాసముంటున్నాయి. వీరికి పునరావాసం కల్పిస్తామని, దీని కోసం 2,50,000 టెంజ్లను (రూ.85 వేలు) కేటాయించామని సపర్బయేవ్ చెప్పారు. యురేనియం గనులు.. సోవియెట్ యూనియన్ కాలం నాటి యురేనియం గనులు కలాచీ గ్రామ సమీపంలో ఉన్నాయి. అప్పట్లో రహస్యంగా యురేనియం తవ్వకాలు సాగించిన రష్యా తర్వాతి కాలంలో ఈ గనులను మూసివేసింది. ఈ గనుల్లో ఉత్పత్తి అవుతున్న విషవాయువులే ప్రస్తుత నిద్రకు కారణమని స్థానికుల ఆరోపణ. ఈ దిశగా పరిశోధనలు ప్రారంభించిన శాస్త్రవేత్తలు, వైద్యులు తొలుత ఏ ఆధారాలనూ సంపాదించలేకపోయారు.