మనీలా(ఫిలిప్పిన్స్) : అంతుచిక్కని రోగం అతని ముఖాన్ని భయంకరంగా మార్చేసింది. తల భాగం మామూలు కంటే మూడు రెట్లు పెద్దదై కళ్లని సైతం పూర్తిగా కప్పివేసింది. సైనసైటిస్ అనుకున్న రోగం అనుకోని మలుపు తిరిగి అంతుచిక్కని రోగంగా మారిన వైనం అతడి జీవితాన్ని అస్తవ్యస్తం చేసింది. వివరాల్లోకి వెళితే.. ఫిలిప్పిన్స్‌కు చెందిన రొములో పిలాపి (56) వడ్రంగి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొద్ది సంవత్సరాల క్రితం అనారోగ్యం కారణంగా కళ్లు మంటలు పెట్టడం, ముక్కు అదేపనిగా కారటం ప్రారంభమైంది. డాక్టర్లను సంప్రదించగా సైనసైటిస్ అని ప్రాథమికంగా తేల్చారు. కానీ, కొన్ని వారాల తర్వాత పరిస్థితి మారి ముఖం మెల్లమెల్లగా ఉబ్బటం మొదలైంది. దీంతో అక్కడి వైద్యులు అతడ్ని వేరే చోట చికిత్స చేయించుకోవల్సిందిగా సూచించారు. అయితే పేదరికంలో మగ్గిపోతున్న అతని కుటుంబం ఇందుకు సిద్ధపడలేకపోయింది. రోజురోజుకూ అతడి ముఖం వాచిపోయి కళ్లు రెండూ మూసుకుపోయాయి. అతడి తల మామూలు కంటే మూడు రెట్లు పెద్దదైపోయింది.
దీంతో కుటుంబ భారం చదువుకుంటున్న అతడి పిల్లలపైపడింది. వారు చదువులు మానేసి, కుటుంబాన్ని పోషించటానికి పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పిలాపి బంధువు మాట్లాడుతూ..‘‘ మొదట అతడికి అలర్జీ ఉండేది. అతడి కళ్లు విపరీతంగా నలతలు ప్రారంభమయ్యాయి. ముక్కు ఎర్రగా మారింది. అప్పుడు అతడికి జలుబు కూడా ఉంది. దీంతో అతడు దాన్ని సైనసైటిస్ భావించాడు. ఆ తర్వాత ముఖం ఉబ్బిపోవటం మొదలైంది. వైద్యులు అతన్ని పరీక్షించినా రోగం ఏంటో కనుక్కోలేకపోయారు. చేతులెత్తేసి మరో పెద్ద ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. డబ్బులు లేకపోవటం వల్ల అతడికి చికిత్స చేయించటం కుదరలేదు. చివరిసారిగా అతడు 2018లో ఆసుపత్రికి వెళ్లాడు. వాళ్లు చాలా మంచి వాళ్లు. వారికి సహాయం కచ్చితంగా అందుతుంద’’ని ఆశాభావం వ్యక్తం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment