కలాచీ ఎందుకు నిద్రపోతోంది..?
సాక్షి, స్కూల్ ఎడిషన్:
మన పురాణాల్లో కుంభ కర్ణుడు, ఊర్మిళా దేవి లాంటి పాత్రల గురించి ప్రస్తావన ఉంది. రోజుల తరబడి నిద్రపోవడమే వీరి ప్రత్యేకత. అయితే నిజజీవితంలో ఇలా సాధ్యమవుతుందా? ఎటువంటి అనారోగ్యమూ లేకుండా ఉన్నపలంగా నిద్రపోయి, హాయిగా ఓ వారం తర్వాత నిద్రలేవడం కుదురుతుందా.? దీనికి సమాధానం 'కలాచీ' కజాఖ్‌స్థాన్‌లోని ఓ మారుమూల గ్రామం ఇది. ఇక్కడి ప్రజలు కుంభ కర్ణుడి నిద్రలో ఉంటున్నారు. దీనికి కారణం ఏంటి? కలాచీ ఎందుకు నిద్రపోతోంది..?
కజాఖ్‌స్థాన్ రాజధాని అస్తానాకు సుమారు 480 కి.మీ. దూరాన ఉండే కలాచీ ప్రస్తుతం అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది. నిద్రాపీడిత గ్రామంగా పేరుపడిన ఈ గ్రామం ఒకప్పుడు 6,500 మంది జనాభాతో సుభిక్షంగా ఉండేది. అయితే 2012 నుంచి కలాచీకి కష్టాలు మొదలయ్యాయి. ఈ గ్రామస్థులు అకస్మాత్తుగా నిద్రలోకి జారుకునేవారు. కారు నడుపుతూ, ఆవుకు మేత వేస్తూ, పాఠశాలకు వెళ్తూ, ల్యాప్‌టాప్‌లో ప్రొగ్రామింగ్ చేస్తూ.. ఇలా ఎక్కడివారు అక్కడే నిద్రపోవడం మొదలుపెట్టారు.
కుంభకర్ణ నిద్ర..
ఈ నిద్ర సాధారణమైందే అయితే ఎలాంటి సమస్యా ఉండేది కాదు. వీరంతా అసాధారణ రీతిలో రెండు నుంచి ఆరు రోజుల వరకూ నిద్రలోనే ఉండేవారు. ఎంత తట్టినా మెలకువ వచ్చేది కాదు. ఓ రకంగా చెప్పాలంటే ఎవరైనా మత్తుమందు సూదులు ప్రయోగించారేమో అనేంత మత్తుగా నిద్రపోయేవారు. సమీప ఆసుపత్రిలోని డాక్టర్లు, నర్సుల సేవల నడుమ కళ్లు తెరచేవారు.
పరిణామాలు..
నిద్ర లేచిన తర్వాత బాధితులు వింతగా ప్రవర్తించేవారు. కొందరు తమ గతాన్ని మర్చిపోయారు. ఇంకొంత మంది ఆలస్యంగా పాత విషయాలను గుర్తు తెచ్చుకునేవారు. చిన్నారులైతే మరీ కంగారు పెట్టేవారు. తన తలపై గుర్రాలు, బల్బులు తిరుగుతున్నాయని ఓ చిన్నారి చెప్పాడు. 'మా అమ్మ ముఖం మీద ఏనుగు తొండం ఉంది' అని మరో బాలిక చెప్పేది. మగవారికైతే అసాధారణ లైంగిక వాంఛ కలిగేది. మద్యం సేవించినట్టు తూలుతూ నడిచేవారు.
ఎందుకు..?
2012లో తొలిసారి ఈ సమస్య తలెత్తినపుడు చాలా మంది ఇదేదో మాయరోగం అనుకున్నారు. ఏవో దుష్ట శక్తులు గ్రామాన్ని పట్టిపీడిస్తున్నాయని ప్రచారం చేసేవారు. తర్వాత వరుసగా 2013 మే, 2014 జనవరి, మే నెలల్లో కూడా ఇలాంటి సంఘటనలే జరగడంతో పరిశోధకులు రంగంలోకి దిగారు. నిద్ర బాధితులంతా ఆరోగ్యంగానే ఉన్నారని తొలుత నిర్ధరించుకున్నారు. అక్కడి నేల, నీరు, గాలిపై 7వేల పరిశోధనలు చేశారు. అయితే ఏమీ తేల్చలేకపోయారు. 'స్లీపింగ్ సిండ్రోమ్'గా పిలిచే ఈ పరిణామానికి కారణమేంటో కనిపెట్టలేకపోయారు.
అనుమానాలు..
దీంతో ప్రజల్లో రకరకాల అనుమానాలు పుట్టుకొచ్చాయి. కొందరు దీన్ని గ్రహాంతర వాసుల పనే అన్నారు. మరికొందరు కలుషిత వాయువుల ప్రభావం అన్నారు. నదీ జలాల్లో ఏవో వ్యర్థాలు కలుస్తున్నాయన్నది ఒక వాదన. భూస్వాములు, వ్యాపారవేత్తల కుతంత్రం చేస్తున్నారని.. కలాచీ గ్రామం కింద బంగారు గనులు ఉన్నాయని వాటిని తవ్వుకునేందుకే ఇలా గ్రామాన్ని ఖాళీ చేయించే పని చేస్తున్నారని ఇంకొందరు మండిపడ్డారు. ఇవన్నీ కేవలం అపోహలేనని, గ్రామ సమీపంలో ఉన్న పాడుబడిన యురేనియం గనులే ఈ అనర్థాలకు కారణమని విద్యావంతులు గొంతెత్తారు.
ఇదీ కారణం..
గత కొన్నేళ్ల పరిశోధనల అనంతరం కజఖ్ ప్రభుత్వం తాజాగా దీనికి కారణాలు వెల్లడించింది. మూతబడిన యురేనియం గనులనే దోషిగా తేల్చింది. ఇందులో కార్బన్ మొనాక్సైడ్, హైడ్రోకార్బన్లు అధిక మొత్తంలో ఉత్పత్తి అవ్వడమే ఈ విపత్కర పరిస్థితికి కారణమని ఆ దేశ ఉపాధ్యక్షుడు బెర్డీబెక్ సపర్బయేవ్ తెలిపారు. యురేనియం గనుల్లో కార్బన్ మొనాక్సైడ్ స్థాయి పెరుగుతున్న కొద్దీ కలాచీలో ఆక్సిజన్ స్థాయి తగ్గుతోందని, దీంతో ప్రజలు నిద్రలోకి జారుకుంటున్నారని వివరించారు. గనుల్లోని విషవాయువులు భూమి పగుళ్ల ద్వారా ఉపరితలంపైకి వస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం 223 కుటుంబాలు ఇక్కడ నివాసముంటున్నాయి. వీరికి పునరావాసం కల్పిస్తామని, దీని కోసం 2,50,000 టెంజ్‌లను (రూ.85 వేలు) కేటాయించామని సపర్బయేవ్ చెప్పారు.
యురేనియం గనులు..
సోవియెట్ యూనియన్ కాలం నాటి యురేనియం గనులు కలాచీ గ్రామ సమీపంలో ఉన్నాయి. అప్పట్లో రహస్యంగా యురేనియం తవ్వకాలు సాగించిన రష్యా తర్వాతి కాలంలో ఈ గనులను మూసివేసింది. ఈ గనుల్లో ఉత్పత్తి అవుతున్న విషవాయువులే ప్రస్తుత నిద్రకు కారణమని స్థానికుల ఆరోపణ. ఈ దిశగా పరిశోధనలు ప్రారంభించిన శాస్త్రవేత్తలు, వైద్యులు తొలుత ఏ ఆధారాలనూ సంపాదించలేకపోయారు.