naags Chaturthi
-
ఉపవాస భుక్తి
ఆదిశేషుడిని విష్ణువు తల్పంగా చేసుకున్నాడు.శివుడు ఆభరణంగా మలుచుకున్నాడు.నాగభక్తి తెలుగువారి అనాది ఆచారం.నాగుల చవితికి ఉపవాసం మన ఆరాధన విధానం.ఉపవాసం అనంతరం తేలిగ్గా సింపుల్‌గా ఆహారం తీసుకుంటే భక్తి భుక్తి సమతులం అవుతాయి. పర్వదినం ఫలవంతం అవుతుంది. చిమ్మిలి కావలసినవి: వేయించిన నువ్వులు – ఒకటిన్నర కప్పులు; బెల్లం పొడి – ఒకటిన్నర కప్పులు; వేయించిన ఓట్స్ – అర కప్పు; వేయించిన బాదం పప్పులు – 10; వేయించిన జీడి పప్పులు – 10; వేయించిన పల్లీలు – ఒక టేబుల్ స్పూను; ఏలకుల పొడి – పావు టీ స్పూను; పాలు – ఒక టేబుల్ స్పూను తయారీ: ∙నువ్వులను మిక్సీలో వేసి మెత్తగా చేసి పక్కన ఉంచాలి ∙జీడిపప్పు, బాదం పప్పు, పల్లీలను మిక్సీలో వేసి కొద్దిగా పలుకులుగా ఉండేలా మిక్సీ పట్టాలి ∙ఒక పెద్ద పాత్రలో నువ్వుల పొడి, బాదంపప్పుల మిశ్రమం పొడి, ఏలకుల పొడి, నెయ్యి, బెల్లం పొడి వేసి బాగా కలిపి ఉండలు చేయాలి. సాబుదానా ఇడ్లీ కావలసినవి: సగ్గు బియ్యం – అర కప్పు; ఇడ్లీ రవ్వ – ఒక కప్పు; పెరుగు – 2 కప్పులు; నీళ్లు – తగినన్ని; ఉప్పు – రుచికి తగినంత; బేకింగ్ సోడా – చిటికెడు ; జీడి పప్పులు – 20; నూనె – ఇడ్లీ రేకులకు పూయడానికి తగినంత తయారీ: ∙ఒక పెద్ద పాత్రలో సగ్గు బియ్యం, ఒక కప్పు ఇడ్లీ రవ్వ వేసి బాగా కలపాలి ∙రెండు కప్పుల పెరుగు, కొద్దిగా నీళ్లు జత చేసి బాగా కలిపి, మూత పెట్టి, సుమారు 8 గంటలసేపు పక్కన ఉంచాక, గరిటెతో బాగా కలపాలి. (సగ్గుబియ్యం మెత్తగా అయ్యేలా మెదపకూడదు). అవసరాన్ని బట్టి నీరు జతచేసుకోవాలి ∙ఉప్పు జత చేయాలి ∙ఇడ్లీలు వేసే ముందు పిండిలో కొద్దిగా తినే సోడా జత చేయాలి ∙ఇడ్లీ రేకులకు కొద్దికొద్దిగా నూనె పూయాలి ∙ ఒక్కో గుంటలోనూ జీడిపప్పు ఉంచి, ఆ పైన గరిటెడు ఇడ్లీ పిండి వేయాలి ∙ అన్నీ వేసిన తరవాత ఇడ్లీ రేకులను కుకర్‌లో ఉంచి స్టౌ మీద పది నిమిషాలు ఉంచి దింపేయాలి (విజిల్ పెట్టకూడదు). చలిమిడి కావలసినవి: బియ్యం – ఒక కప్పు; బెల్లం పొడి – ఒక కప్పు; సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు – ఒక టేబుల్ స్పూను; ఏలకుల పొడి – అర టీ స్పూను; పాలు – ఒక టీ స్పూను; నెయ్యి – ఒక టేబుల్ స్పూను తయారీ: ∙బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీళ్లన్నీ ఒంపేసి, పొడి వస్త్రం మీద ఆరబోయాలి ∙బియ్యంలోని తడి ఆరిపోగానే, బియ్యాన్ని మిక్సీలో వేసి మెత్తగా పిండి పట్టాలి. (జల్లెడ పట్టి మెత్తటి పిండితో మాత్రమే చలిమిడి చేయాలి) ∙ఒక పెద్ద పాత్రలో బియ్యప్పిండి, బెల్లం పొడి, ఏలకుల పొడి, నెయ్యి, కొబ్బరి ముక్కలు వేసి బాగా కలిపితే చలిమిడి సిద్ధమైనట్లే. ముర్మురా చాట్ కావలసినవి: నూనె – 2 టేబుల్ స్పూన్లు; వేయించిన పల్లీలు – పావు కప్పు; వేయించిన సెనగ పప్పు – 2 టేబుల్ స్పూన్లు; ఆవాలు – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 1 (ముక్కలు చేయాలి); ఇంగువ – చిటికెడు; కరివేపాకు – రెండు రెమ్మలు; పసుపు – పావు టీ స్పూను; కాశ్మీరీ మిరప కారం – అర టీ స్పూను; మరమరాలు – 3 కప్పులు; పంచదార పొడి ఒక టీ స్పూను; ఉప్పు – పావు టీ స్పూను. తయారీ: ∙స్టౌ మీద పెద్ద బాణలి ఉంచి వేడయ్యాక çనూనె వేసి బాగా కాగాక, పల్లీలు వేసి సన్న మంట మీద క్రిస్పీగా అయ్యేవరకు వేయించాలి ∙పుట్నాల పప్పు జత చేసి మరోమారు వేయించాలి ∙ఆవాలు, ఎండు మిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి మరోమారు వేయించాలి ∙పసుపు, మిరప కారం వేసి బాగా కలియబెట్టాలి ∙మరమరాలు జత చేసి జాగ్రత్తగా పెద్ద గరిటెతో రెండు మూడు నిమిషాలు కలిపి దింపేయాలి ∙పంచదార పొడి, ఉప్పు జత చేసి కలిపి, ప్లేట్లలో వేసి వేడివేడిగా అందించాలి. కొసాంబరి సలాడ్ కావలసినవి: పెసర పప్పు – అర కప్పు (నీళ్లలో రెండు గంటలపాటు నానబెట్టాలి); పచ్చి కొబ్బరి తురుము – 3 టేబుల్ స్పూన్లు; పచ్చి మిర్చి తరుగు – ఒక టీ స్పూను; అల్లం తురుము – అర టీ స్పూను; కొత్తిమీర తరుగు – ఒక టేబుల్ స్పూను; నిమ్మ రసం – ఒక టీ స్పూను; ఆవాలు – అర టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; ఇంగువ – కొద్దిగా; నూనె – ఒక టీ స్పూను, ఉప్పు – తగినంత తయారీ: ∙పెసర పప్పులోని నీళ్లు ఒంపేసి, నీళ్లు పూర్తిగా పోయేవరకు వడకట్టాలి ∙ పెద్ద పాత్రలో పెసర పప్పు, కొబ్బరి తురుము, పచ్చి మిర్చి తరుగు, సగం కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి ∙చిన్న బాణలి స్టౌ మీద ఉంచి వేడయ్యాక నూనె వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడే వరకు వేయించాలి ∙ ఇంగువ, కరివేపాకు జత చేసి మరోమారు కలిపి దింపేసి, పెసర పప్పు మిశ్రమంలో వేసి బాగా కలపాలి ∙చివరగా ఉప్పు, నిమ్మరసం వేసి కలపాలి. అటుకుల పులావ్ కావలసినవి: అటుకులు – ఒక కప్పు; ఉల్లి తరుగు – పావు కప్పు; పచ్చి మిర్చి తరుగు – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత కాయగూరలు... క్యారట్ తురుము – పావు కప్పు; బంగాళ దుంప తురుము – ఒక టేబుల్ స్పూను; బీన్స్ – 4 (చిన్న చిన్న ముక్కలు చేయాలి); క్యాబేజీ తరుగు – ఒక టేబుల్ స్పూను; పచ్చి బఠాణీ – ఒక టేబుల్ స్పూను; క్యాలీఫ్లవర్ తరుగు – ఒక టేబుల్ స్పూను వేయించడానికి: నూనె – 3 టేబుల్ స్పూన్లు; దాల్చిన చెక్క – చిన్న ముక్క; లవంగాలు – 2 తయారీ: ∙అటుకులను ముందుగా శుభ్రంగా కడిగి నీళ్లన్నీ పోయేలా వడకట్టాలి ∙బాణలిలో నూనె వేసి కాగాక దాల్చిన చెక్క ముక్క, లవంగాలు వేసి వేయించాలి ∙ఉల్లి తరుగు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ∙పచ్చిమిర్చి జత చేసి మరోమారు కలపాలి ∙తరిగి ఉంచుకున్న కూరగాయల తురుము, ముక్కలు వేసి మెత్తబడేవరకు మధ్యమధ్యలో కలుపుతుండాలి ∙అటుకులు, ఉప్పు వేసి, కొద్దిగా నీళ్లు చిలకరించి బాగా కలిపి రెండు నిమిషాలు ఉంచి దింపేయాలి. సాబుదానా ఉప్మా కావలసినవి: సగ్గు బియ్యం – 2 కప్పులు; పల్లీలు – పావు కప్పు; పచ్చి మిర్చి – 4 (మధ్యకు నిలువుగా తరగాలి); ఎండు మిర్చి – 2 (చిన్న చిన్న ముక్కలు చేయాలి); పచ్చి సెనగ పప్పు – ఒక టేబుల్ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె / నెయ్యి – ఒక టేబుల్ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు. తయారీ: ∙ముందుగా సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి సుమారు నాలుగు గంటల పాటు నానబెట్టాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె లేకుండా పల్లీలను బాగా వేయించి తీసేయాలి ∙అదే బాణలిలో నూనె లేదా నెయ్యి వేసి కాగాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వరుసగా వేసి వేయించాలి ∙పచ్చి మిర్చి, కరివేపాకు వేసి మరోమారు సుమారు మూడు నిమిషాల పాటు వేయించుతుండాలి ∙సగ్గుబియ్యంలో నీళ్లు పూర్తిగా ఒంపేయాలి ∙పల్లీలు చల్లారిన తరవాత మిక్సీలో వేసి రవ్వలా వచ్చేలా మిక్సీ పట్టాలి ∙వేగుతున్న పోపులో సగ్గు బియ్యం, ఉప్పు వేసి బాగా కలపాలి ∙చివరగా పల్లీల పొడి వేసి బాగా కలిపి, కొద్ది సేపు ఉంచి దింపేయాలి. -
కొత్త బంగారు లోకానికి శ్రీకారం
అమ్మ వారికి సంబంధించిన పవిత్రమైన ఆశ్వయుజ మాసానికీ, పండుగలకీ అవినాభావ సంబంధం. ఆశ్వయుజ మాసం మొదలవగానే సమస్త కార్యాలకూ, సకల శుభాలకూ శ్రీకారం చుట్టే మంచి రోజులు మొదలైనట్లు లెక్క. ఈ మాసంతోనే శరదృతువు మొదలు. ఆశ్వయుజం మొదలవగానే వచ్చే మొదటి తొమ్మిది రోజులూ వివిధ రూపాల్లో మహిషాసురుడిపై అమ్మ వారు యుద్ధం చేసి, విజయం సాధించిన శరన్నవరాత్రులు. పదో రోజు విజయదశమి. విశేషం ఏమిటంటే, ఆశ్వయుజ మాసం చివర వచ్చే రోజులు కూడా మహత్తర పర్వదినాలే. మాసం మొదట దుర్గాదేవిని ఆరాధిస్తే, ఈ మాసం చివరలో లక్ష్మీదేవిని పూజించడం ఆశ్వయుజంలోని ప్రత్యేకత. మొదట అంతా దసరా ఉత్సవాలైతే, చివరంతా దీపావళి వేడుకలు. అయిదు రోజుల ‘దీపావళి’ వేడుక దీపావళి అనగానే సాధారణంగా నరక చతుర్దశి, దీపావళి - రెండు రోజుల పండుగ అనుకుంటూ ఉంటాం. స్కూళ్ళకు సెలవులొచ్చే ఆ రెండు రోజుల గురించే ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాం. కానీ, చతుర్దశికి ముందు వచ్చే ఆశ్వయుజ బహుళ త్రయోదశి నుంచి కార్తిక శుక్ల విదియ దాకా అయిదు రోజులూ పండుగ దినాలే. ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ‘ధన త్రయోదశి’ అంటారు. మరునాడైన చతుర్దశి ‘నరక చతుర్దశి’ అనీ, ఆ మరునాడైన ఆశ్వయుజ బహుళ అమావాస్య ‘దీపావళి’ అనీ తెలిసిందే. ఇక, ఆ వెంటనే కార్తిక మాసం మొదలవుతుంది. కార్తికంలో మొదటి రోజైన కార్తిక శుక్ల పాడ్యమిని ‘బలి పాడ్యమి’ అంటారు. రెండో రోజైన కార్తిక శుక్ల విదియ నాడు తోడబుట్టిన అక్కచెల్లెళ్ళ చేతి భోజనం తినాలని పెద్దల మాట. దాన్నే ‘భగినీ హస్త భోజనం’ అంటారు (భగినీ అంటే సోదరి). ఇదీ అయిదు రోజుల దీపావళి వేడుకల వరుస. ఇవి కాక, మధ్యలో తదియ ఒక్క రోజు మినహా, కార్తిక శుక్ల చవితి నాడు ‘నాగుల చవితి’ కూడా పండుగే! అజ్ఞానాంధకారాన్ని పారదోలే దీపం - లక్ష్మీదేవికి ప్రతిరూపం అంటారు. దీపావళి పండుగ రోజులు అనగానే లక్ష్మీపూజ గుర్తుకొస్తుంది. గుజరాతీయులకు దీపావళి నుంచి కొత్త సంవత్సరం. ఆ రోజు లక్ష్మీదేవిని పూజించడం అలవాటు. అంతకన్నా రెండురోజుల ముందు ‘ధన త్రయోదశి’ నాడూ అమ్మవారిని పూజించే సంప్రదాయం ఉంది. ‘ధన త్రయోదశి’నే గుజరాతీయుల పద్ధతిలో ‘ధన్ తేరస్’ అంటారు. ‘ధన త్రయోదశి’ అంటే... ‘ధన్’ అంటే సంపద. ‘త్రయోదశి’ అంటే 13వ రోజు. పదమూడు మంచి అంకె కాదని పాశ్చాత్యుల నమ్మకం. కానీ, మనకు మాత్రం పదమూడో తిథి (త్రయోదశి) మంచి రోజు. ‘ధన త్రయోదశి’కి వెండి, బంగారం కానీ, ఒకటి రెండు కొత్త పాత్రలు కానీ కొంటే అదృష్టం కలిసొస్తుందని నమ్మకం. అందుకే, ఇంట్లో ఆడవాళ్ళు ఆ రోజున వెండి, బంగారు ఆభరణాలు, పాత్రలు కొనడం ఆనవాయితీ. దుష్టశక్తుల్ని పారదోలేలా ఆ రోజు సాయంత్రం వేళ మట్టి ప్రమిదల్ని వెలిగించి, లక్ష్మీపూజ చేస్తారు. భజన చేస్తారు. తీపివంటల్ని నైవేద్యంగా సమర్పిస్తారు. మహారాష్ట్రీయులు ఈ ‘ధన్ తేరస్’ పర్వాన్ని చాలా గొప్పగా చేసుకుంటారు. ధనియాలు తీసుకొని మెత్తగా పొడి చేసి, దానికి బెల్లం కలిపి, లక్ష్మీదేవికి ప్రత్యేక నైవేద్యం పెడతారు. గ్రామాల్లో అయితే, రైతులు తమ ప్రధాన ఆదాయ వనరులైన పశువులను అలంకరించి, పూజిస్తారు. ‘ధన్ తేరస్’ రోజున వ్యాపారస్థులు తమ ప్రాంగణాల్ని శుభ్రం చేసుకొని, బాగా అలంకరిస్తారు. శుచిగా, శుభ్రంగా ఉన్న ఇంటికే లక్ష్మీదేవి వస్తుందని నమ్మకం. సకల సౌభాగ్యప్రదాయని అయిన లక్ష్మీదేవిని సాదరంగా ఆహ్వానిస్తూ, గుమ్మంలో అందమైన ముగ్గులు వేస్తారు. దీపాలు పెడతారు. లక్ష్మీదేవి ఇంట్లో కాలుమోపడానికి ప్రతీకగా ఇంట్లో బియ్యప్పిండి, పసుపుతో బుడి బుడి అడుగుల గుర్తులు వేస్తారు. లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ, రాత్రి మొత్తం దీపాలు వెలుగుతూనే ఉండేలా చూస్తారు. యముడి నుంచి కాపాడిన రాకుమారి ‘ధన త్రయోదశి’కి సంబంధించి ఆసక్తికరమైన ఒక ప్రాచీన కథ ప్రచారంలో ఉంది. అనగనగా హిమరాజుకు ఒక కుమారుడున్నాడు. సద్గుణవంతుడైన ఆ రాకుమారుడికి పెళ్ళయిన నాలుగోరోజున పాముకాటుతో మరణగండం ఉందని జోస్యులు చెబుతారు. పదహారేళ్ళ ప్రాయంలో రాకుమారుడికి వివాహం జరుగుతుంది. అతని భార్య తెలివైనది, దైవభక్తురాలు. మరణగండం విషయం తెలిసిన ఆమె ఆ రోజున భర్తను నిద్రపోనివ్వలేదు. ఒంటిమీది ఆభరణాలు, బంగారు, వెండి నాణాలు తీసి, గుమ్మం దగ్గర కుప్పగా పోసింది. ఆ ప్రాంతమంతా కళ్ళు జిగేల్మనేలా దీపాలు వెలిగించింది. భర్త నిద్రపోకుండా రాత్రి అంతా దైవగాథలు చెబుతూ, భజనలు పాడుతూ కూర్చొబెట్టింది. రాకుమారుడి ప్రాణాలు హరించడానికి యముడు పాము రూపంలో రానే వచ్చాడు. కానీ, గుమ్మం దగ్గర ఆ దీపాలు, ఆభరణాల వెలుగుతో కళ్ళ ముందు మరేమీ కనిపించలేదు. గది లోపలకు వెళ్ళ లేక ఆ నాణాల రాశి మీదే కూర్చొని, ఆ కథలు, పాటలు వింటూ ఉండిపోయాడు. రాత్రి గడిచిపోయింది. తెల్లారాక పాము వెళ్ళిపోయింది. అలా పెళ్ళికూతురి తెలివితేటల వల్ల రాకుమారుడి గండం గట్టెక్కింది. అప్పటి నుంచి ఆ రోజును ‘ధన్ తేరస్’గా జరుపుకొంటున్నారు. దారి చూపే యమ దీపం! ఇలాంటి పురాణ కథలు, గాథల వల్ల ఆ రోజున ‘యమ దీపం’ అనే మరో ఆచారమూ పాటిస్తారు. కుటుంబ సభ్యులెవరూ అకాల మృత్యువు బారిన పడకూడదని యమధర్మరాజును ప్రార్థిస్తూ, ఇంటి బయట ఒక దీపం వెలిగించి ఉంచడం కొన్నిచోట్ల సంప్రదాయం. ఇక, మాళవ దేశంగా ప్రసిద్ధమైన పశ్చిమ, మధ్య భారతావని ప్రాంతంలో మరో నమ్మకం ఉంది. ఈ ‘ధన త్రయోదశి’ పండుగకు యమలోకంలోని పితరులు కూడా తమ పూర్వ గృహాలకు తిరిగి వస్తారని మాళవ దేశస్థుల విశ్వాసం. అందుకని, ఆ రోజు సాయంకాలం తమ ఇంటి ముందు వీధిలో దక్షిణ దిక్కుగా దీపం పెడతారు. ఇంటికి వచ్చే పితరులకు అది దారి చూపిస్తుందని నమ్మకం. ఆ రోజున ఇంటిలో ప్రతి గదిలో దీపం పెట్టే ఆచారం అక్కడా ఉంది. ఇంట్లో దీపాలు ఆడవాళ్ళు పెడతారు కానీ, పితరుల కోసం వీధిలో దక్షిణదిక్కుగా పెట్టే దీపం మాత్రం తల్లితండ్రులు లేని ఇంటి యజమాని మాత్రమే పెడతాడు. తల్లితండ్రులున్న ఇంటి యజమాని మాత్రం ఆ దీపం అసలు పెట్టనే పెట్టడు లక్ష్మీదేవి, ధన్వంతరి పుట్టిందీ ఆ రోజే! మరో కథ ఏమిటంటే, సేవించినంత మాత్రాన మరణం లేకుండా చేసే అమృతం కోసం దేవదానవులు పాలసముద్రాన్ని చిలుకుతున్నారు. అప్పుడు సరిగ్గా ‘ధన్ తేరస్’ రోజునే ఆ పాలకడలి నుంచి చేతిలో అమృత కలశంతో విష్ణుమూర్తి అవతారమూ, దేవవైద్యుడూ అయిన ధన్వంతరి పైకి వచ్చాడట! అలా క్షీరసాగర మథనంలో అమృతకలశంతో ఆయుర్వేద విజ్ఞానదాత ధన్వంతరి పైకి వచ్చిన రోజే ‘ధన త్రయోదశి’ అని ఐతిహ్యం. అందుకే, ఈ ధన్వంతరి జయంతి నాడు ఆయురారోగ్యాలు కోరడం సహజం. అయతే ఆయురారోగ్యాలకు యమ ధర్మరాజు సహకారం కావాలి కాబట్టి, ఆయన ప్రీతి కోసం సాయంత్రం వేళ ఇంటి ప్రధాన గుమ్మం దగ్గర దీపం పెడతారన్న మాట! అలాగే, ఆ రోజునే పాల సముద్రం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించిందనీ అంటారు. అందుకే, ‘ధన్ తేరస్’ రోజున లక్ష్మీదేవి, ధనానికి అధిపతి కుబేరుణ్ణి పూజించే ఆచారం. ఆ తరువాత రెండు రోజులకు దీపావళి జరుపుకొనే అమావాస్య నాడు లక్ష్మీపూజ విశేష ఫలం. ఆ రోజు ఏం చేయాలంటే... ‘ధన్ తేరస్’ రోజున ఇల్లంతా శుభ్రంగా ఉంచుకోవడమే కాక, పాత్రలన్నిటినీ తోమి, తళతళలాడేలా చేస్తారు. అదేరోజున ఇంట్లోని ప్రతి ఒక్కరూ ఏదో ఒక కొత్త పాత్ర కొని, పూజలో పెడతారు. దాన్నే ఆ తరువాత దీపావళి పండుగ రోజుల్లో వాడతారు. ఇలా ఎన్నో విశేషాలున్న ‘ధన త్రయోదశి’తో దీపావళి వేడుకలు భక్తిపూర్వకంగా మొదలవుతాయి. ఏ సమయంలో పూజించాలి? ‘ధన త్రయోదశి’ నాడు ప్రదోషకాలంలో అంటే సూర్యాస్తమయం నుంచి దాదాపు రెండున్నర గంటల సేపు కాలంలో లక్ష్మీదేవి పూజ శ్రేష్ఠం! ప్రదోషకాలంలో, అందులోనూ స్థిరలగ్నంలో లక్ష్మీ పూజ వల్ల అమ్మ మన ఇంటికి వచ్చి, స్థిరంగా నివాసం ఉంటుందని నమ్మిక. అక్టోబర్ 27వ తేదీ సాయంత్రం నుంచే త్రయోదశి తిథి మొదలవుతుంది. సాయంత్రం సుమారు ఏడు తరువాత నుంచి స్థిర లగ్నమైన వృషభ లగ్నం. కాబట్టి, ఆ రోజు ఏడుంబావు నుంచి 8.30 గంటల మధ్య సమయంలో ‘ధన్ తేరస్’ పూజ చేయడం విశేష ఫలప్రదమని జోస్యుల సూచన. - రెంటాల జయదేవ -
సర్పదోషాలకు... నాగశిల ల ప్రతిష్ఠ
మనిషి జీవితంలో జరిగే కొన్ని మార్పులకు సర్పయోగం/దోషం కారణభూతమవుతుంది. ఎందుకంటే సర్పయోగం/దోషం మనిషి పుట్టుకకు ముందు, తర్వాత కలిగే జన్మల రహస్యాలను ఇముడ్చుకొని ఉంటుందని మహర్షుల ఉవాచ. రాహు-కేతువుల మధ్య... మిగిలిన గ్రహాలుండటాన్ని కాలసర్పదోషం అంటారు. ఈ దోషం ఉన్న వారికి, శుక్రవంక నష్టరేఖ ఉన్నవారికి జీవితంలో కొన్ని అనుకోని, ఊహించలేని ఆకస్మిక మార్పులు జరుగుతుంటాయి. దీని నివారణకు మనకున్న తరుణోపాయాలు రెండే. అందులో ఒకటి ‘నవగ్రహ హోర పూజ’, రెండోది ప్రాచీనకాలం నుంచి వచ్చే ‘నాగులచవితినాడు నాగశిలల ప్రతిష్ఠ’. కార్తీకశుద్ధ చవితిని నాగుల చవితిగా జరుపుకుంటారు. నాగుల చవితి పర్వదినం రోజున దేశవ్యాప్తంగా నాగశిలల ప్రతిష్ఠ జరుగుతుంది. అనంత, కులిక, వాసుకి, శంఖ, పద్మ, మహాపద్మ, తక్షక, కర్కోటక, మహాశంఖ, పతాక, విషధర, శేషనాగ అని 12 రకాల కాలసర్పయోగాల గురించి పూర్వీకులు వివరించారు. మూడు నెలల ముందే: నవంబర్ 6,7 తేదీల్లో నాగులచవితి రోజున ప్రతిష్ఠించే నాగశిలల తయారీ మూడు నెలల ముందే ప్రారంభం అవుతుంది. శిలల తయారీని శాస్త్రోక్తంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈ ప్రక్రియను నిష్ణాతులైన వేదపండితులు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభిస్తున్నారు. తయారి: నదిలో అంతర్గతంగా ఉన్న శ్రేష్ఠమైన రాతిని విగ్రహాల తయారీకి ఎంచుకుంటారు. రాతిపై జంటనాగుల సర్పాలను చెక్కాలి. శాస్త్రంలో చెప్పిన విధంగా శిల్పుల ప్రావీణ్యతను ఉపయోగించి, శాస్త్రప్రకారం ప్రతి భాగానికి ఉలితో ఎన్ని దెబ్బలు కొట్టాలో, అన్ని దెబ్బలు కొట్టి, ఈ విగ్రహాలను తయారుచేస్తారు. ప్రతిష్ఠ సమయం వరకు తయారుచేసిన విగ్రహాల కంటి మీద మైనంపూతను ఉంచి, విగ్రహాలను ధాన్యంలో కానీ ధాన్యం ఊకలోగానీ ఉంచి ప్రతిష్టించ వలసిన ప్రదేశానికి తీసుకెళ్తారు. రామేశ్వరంలోనే ఎందుకు: కల్పంలో చెప్పినట్లు నాగశిలలను గ్రామ సమీపంలోని చెరువు, నది, కాలువల గట్టున ఉండే రావి, మారేడు చెట్టు కింద లేదా సేతు సముద్రంగా పేరు గాంచిన రామేశ్వరంలో ప్రతిష్ఠించాలి. అలనాడు శ్రీరామచంద్రుడు తనకు ఉన్న శుక్రవంక నష్టరేఖ, కాలసర్పదోషాల నివారణకోసం కల్పంలో చెప్పినట్లు రామేశ్వరంలో నాగశిలలను ప్రతిష్ఠించాడు. అందుకే శాస్త్రం తెలిపినట్లుగా మన రాష్ట్రానికి చెందినవేదపండితులు రామేశ్వరంలో నదీతీరాన ఉన్న మారేడు, రావి చెట్ల కింద కొంత స్థలాన్ని కొనుగోలు చేసి, ఆ స్థలంలో ఒకటిన్నర రోజుల పాటు శాస్త్రం ప్రకారం పూజలు నిర్వహించి, ఎలాంటి సర్పదోషమో గుర్తించి, నవంబర్ 6,7 తేదీల్లో ఆయా దోషాలు ఉన్న వ్యక్తుల చేతుల మీదుగా శిలలను ప్రతిష్ఠింప చేస్తారు. ఈ విగ్రహాలకు మూడు సంవత్సరాల పాటు నిత్యం అభిషేకం, పూజ చేస్తారు. అదే సమయంలో మంత్ర సంపుటీకరణ కోసం హోమం చేస్తారు. మారేడు చెట్టు కిందే ఎందుకు: శిలలపై మారేడు దళాల నీడ, ఆకులు, వర్షపునీరు, ఎండిన ఆకులు పడినా... అభిషేక ఫలం దక్కుతుందని రామేశ్వరంలో నాగశిలలు ప్రతిష్ఠించిన రాజమండ్రికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ చిర్రావూరి శ్రీరామశర్మ చెబుతున్నారు. - సేకరణ: కోన సుధాకర్‌రెడ్డి