సర్పదోషాలకు... నాగశిల ల ప్రతిష్ఠ
మనిషి జీవితంలో జరిగే కొన్ని మార్పులకు సర్పయోగం/దోషం కారణభూతమవుతుంది. ఎందుకంటే సర్పయోగం/దోషం మనిషి పుట్టుకకు ముందు, తర్వాత కలిగే జన్మల రహస్యాలను ఇముడ్చుకొని ఉంటుందని మహర్షుల ఉవాచ. రాహు-కేతువుల మధ్య... మిగిలిన గ్రహాలుండటాన్ని కాలసర్పదోషం అంటారు.
ఈ దోషం ఉన్న వారికి, శుక్రవంక నష్టరేఖ ఉన్నవారికి జీవితంలో కొన్ని అనుకోని, ఊహించలేని ఆకస్మిక మార్పులు జరుగుతుంటాయి. దీని నివారణకు మనకున్న తరుణోపాయాలు రెండే. అందులో ఒకటి ‘నవగ్రహ హోర పూజ’, రెండోది ప్రాచీనకాలం నుంచి వచ్చే ‘నాగులచవితినాడు నాగశిలల ప్రతిష్ఠ’. కార్తీకశుద్ధ చవితిని నాగుల చవితిగా జరుపుకుంటారు. నాగుల చవితి పర్వదినం రోజున దేశవ్యాప్తంగా నాగశిలల ప్రతిష్ఠ జరుగుతుంది.
అనంత, కులిక, వాసుకి, శంఖ, పద్మ, మహాపద్మ, తక్షక, కర్కోటక, మహాశంఖ, పతాక, విషధర, శేషనాగ అని 12 రకాల కాలసర్పయోగాల గురించి పూర్వీకులు వివరించారు.
మూడు నెలల ముందే: నవంబర్ 6,7 తేదీల్లో నాగులచవితి రోజున ప్రతిష్ఠించే నాగశిలల తయారీ మూడు నెలల ముందే ప్రారంభం అవుతుంది. శిలల తయారీని శాస్త్రోక్తంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈ ప్రక్రియను నిష్ణాతులైన వేదపండితులు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభిస్తున్నారు.
తయారి: నదిలో అంతర్గతంగా ఉన్న శ్రేష్ఠమైన రాతిని విగ్రహాల తయారీకి ఎంచుకుంటారు. రాతిపై జంటనాగుల సర్పాలను చెక్కాలి. శాస్త్రంలో చెప్పిన విధంగా శిల్పుల ప్రావీణ్యతను ఉపయోగించి, శాస్త్రప్రకారం ప్రతి భాగానికి ఉలితో ఎన్ని దెబ్బలు కొట్టాలో, అన్ని దెబ్బలు కొట్టి, ఈ విగ్రహాలను తయారుచేస్తారు. ప్రతిష్ఠ సమయం వరకు తయారుచేసిన విగ్రహాల కంటి మీద మైనంపూతను ఉంచి, విగ్రహాలను ధాన్యంలో కానీ ధాన్యం ఊకలోగానీ ఉంచి ప్రతిష్టించ వలసిన ప్రదేశానికి తీసుకెళ్తారు.
రామేశ్వరంలోనే ఎందుకు: కల్పంలో చెప్పినట్లు నాగశిలలను గ్రామ సమీపంలోని చెరువు, నది, కాలువల గట్టున ఉండే రావి, మారేడు చెట్టు కింద లేదా సేతు సముద్రంగా పేరు గాంచిన రామేశ్వరంలో ప్రతిష్ఠించాలి. అలనాడు శ్రీరామచంద్రుడు తనకు ఉన్న శుక్రవంక నష్టరేఖ, కాలసర్పదోషాల నివారణకోసం కల్పంలో చెప్పినట్లు రామేశ్వరంలో నాగశిలలను ప్రతిష్ఠించాడు. అందుకే శాస్త్రం తెలిపినట్లుగా మన రాష్ట్రానికి చెందినవేదపండితులు రామేశ్వరంలో నదీతీరాన ఉన్న మారేడు, రావి చెట్ల కింద కొంత స్థలాన్ని కొనుగోలు చేసి, ఆ స్థలంలో ఒకటిన్నర రోజుల పాటు శాస్త్రం ప్రకారం పూజలు నిర్వహించి, ఎలాంటి సర్పదోషమో గుర్తించి, నవంబర్ 6,7 తేదీల్లో ఆయా దోషాలు ఉన్న వ్యక్తుల చేతుల మీదుగా శిలలను ప్రతిష్ఠింప చేస్తారు. ఈ విగ్రహాలకు మూడు సంవత్సరాల పాటు నిత్యం అభిషేకం, పూజ చేస్తారు. అదే సమయంలో మంత్ర సంపుటీకరణ కోసం హోమం చేస్తారు.
మారేడు చెట్టు కిందే ఎందుకు: శిలలపై మారేడు దళాల నీడ, ఆకులు, వర్షపునీరు, ఎండిన ఆకులు పడినా... అభిషేక ఫలం దక్కుతుందని రామేశ్వరంలో నాగశిలలు ప్రతిష్ఠించిన రాజమండ్రికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ చిర్రావూరి శ్రీరామశర్మ చెబుతున్నారు.
- సేకరణ: కోన సుధాకర్‌రెడ్డి