ఉపవాస భుక్తి | Naags Chaturthi special food | Sakshi
Sakshi News home page

ఉపవాస భుక్తి

Published Sat, Nov 10 2018 12:41 AM | Last Updated on Sat, Nov 10 2018 12:41 AM

Naags Chaturthi special food - Sakshi

ఆదిశేషుడిని విష్ణువు తల్పంగా చేసుకున్నాడు.శివుడు ఆభరణంగా మలుచుకున్నాడు.నాగభక్తి తెలుగువారి అనాది ఆచారం.నాగుల చవితికి ఉపవాసం మన ఆరాధన విధానం.ఉపవాసం అనంతరం తేలిగ్గా సింపుల్‌గా ఆహారం తీసుకుంటే భక్తి భుక్తి సమతులం అవుతాయి.  పర్వదినం ఫలవంతం అవుతుంది. 

చిమ్మిలి
కావలసినవి: వేయించిన నువ్వులు – ఒకటిన్నర కప్పులు; బెల్లం పొడి – ఒకటిన్నర కప్పులు; వేయించిన ఓట్స్‌ – అర కప్పు; వేయించిన బాదం పప్పులు – 10; వేయించిన జీడి పప్పులు – 10; వేయించిన పల్లీలు – ఒక టేబుల్‌ స్పూను; ఏలకుల పొడి – పావు టీ స్పూను; పాలు – ఒక టేబుల్‌ స్పూను
తయారీ: నువ్వులను మిక్సీలో వేసి మెత్తగా చేసి పక్కన ఉంచాలి ∙జీడిపప్పు, బాదం పప్పు, పల్లీలను మిక్సీలో వేసి కొద్దిగా పలుకులుగా ఉండేలా మిక్సీ పట్టాలి ∙ఒక పెద్ద పాత్రలో నువ్వుల పొడి, బాదంపప్పుల మిశ్రమం పొడి, ఏలకుల పొడి, నెయ్యి, బెల్లం పొడి వేసి బాగా కలిపి ఉండలు చేయాలి.

సాబుదానా ఇడ్లీ
కావలసినవి: సగ్గు బియ్యం – అర కప్పు; ఇడ్లీ రవ్వ – ఒక కప్పు; పెరుగు – 2 కప్పులు; నీళ్లు – తగినన్ని; ఉప్పు – రుచికి తగినంత; బేకింగ్‌ సోడా – చిటికెడు ; జీడి పప్పులు – 20; నూనె – ఇడ్లీ రేకులకు పూయడానికి తగినంత
తయారీ: ∙ఒక పెద్ద పాత్రలో సగ్గు బియ్యం, ఒక కప్పు ఇడ్లీ రవ్వ వేసి బాగా కలపాలి ∙రెండు కప్పుల పెరుగు, కొద్దిగా నీళ్లు జత చేసి బాగా కలిపి, మూత పెట్టి, సుమారు 8 గంటలసేపు పక్కన ఉంచాక, గరిటెతో బాగా కలపాలి. (సగ్గుబియ్యం మెత్తగా అయ్యేలా మెదపకూడదు). అవసరాన్ని బట్టి నీరు జతచేసుకోవాలి ∙ఉప్పు జత చేయాలి ∙ఇడ్లీలు వేసే ముందు పిండిలో కొద్దిగా తినే సోడా జత చేయాలి ∙ఇడ్లీ రేకులకు కొద్దికొద్దిగా నూనె పూయాలి  ∙ ఒక్కో గుంటలోనూ జీడిపప్పు ఉంచి, ఆ పైన గరిటెడు ఇడ్లీ పిండి వేయాలి  ∙ అన్నీ వేసిన తరవాత ఇడ్లీ రేకులను కుకర్‌లో ఉంచి స్టౌ మీద పది నిమిషాలు ఉంచి దింపేయాలి (విజిల్‌ పెట్టకూడదు). 

చలిమిడి
కావలసినవి: బియ్యం – ఒక కప్పు; బెల్లం పొడి – ఒక కప్పు; సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు – ఒక టేబుల్‌ స్పూను; ఏలకుల పొడి – అర టీ స్పూను; పాలు – ఒక టీ స్పూను; నెయ్యి – ఒక టేబుల్‌ స్పూను
తయారీ: ∙బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీళ్లన్నీ ఒంపేసి, పొడి వస్త్రం మీద ఆరబోయాలి ∙బియ్యంలోని తడి ఆరిపోగానే, బియ్యాన్ని మిక్సీలో వేసి మెత్తగా పిండి పట్టాలి. (జల్లెడ పట్టి మెత్తటి పిండితో మాత్రమే చలిమిడి చేయాలి) ∙ఒక పెద్ద పాత్రలో బియ్యప్పిండి, బెల్లం పొడి, ఏలకుల పొడి, నెయ్యి, కొబ్బరి ముక్కలు వేసి బాగా కలిపితే చలిమిడి సిద్ధమైనట్లే. 

ముర్మురా చాట్‌
కావలసినవి: నూనె – 2 టేబుల్‌ స్పూన్లు; వేయించిన పల్లీలు – పావు కప్పు; వేయించిన సెనగ పప్పు – 2 టేబుల్‌ స్పూన్లు; ఆవాలు – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 1 (ముక్కలు చేయాలి); ఇంగువ – చిటికెడు; కరివేపాకు – రెండు రెమ్మలు; పసుపు – పావు టీ స్పూను; కాశ్మీరీ మిరప కారం – అర టీ స్పూను; మరమరాలు – 3 కప్పులు; పంచదార పొడి  ఒక టీ స్పూను; ఉప్పు – పావు టీ స్పూను.
తయారీ: ∙స్టౌ మీద పెద్ద బాణలి ఉంచి వేడయ్యాక çనూనె వేసి బాగా కాగాక, పల్లీలు వేసి సన్న మంట మీద క్రిస్పీగా అయ్యేవరకు వేయించాలి ∙పుట్నాల పప్పు జత చేసి మరోమారు వేయించాలి ∙ఆవాలు, ఎండు మిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి మరోమారు వేయించాలి ∙పసుపు, మిరప కారం వేసి బాగా కలియబెట్టాలి ∙మరమరాలు జత చేసి జాగ్రత్తగా పెద్ద గరిటెతో రెండు మూడు నిమిషాలు కలిపి దింపేయాలి ∙పంచదార పొడి, ఉప్పు జత చేసి కలిపి, ప్లేట్లలో వేసి వేడివేడిగా అందించాలి.

కొసాంబరి సలాడ్‌
కావలసినవి: పెసర పప్పు – అర కప్పు (నీళ్లలో రెండు గంటలపాటు నానబెట్టాలి); పచ్చి కొబ్బరి తురుము – 3 టేబుల్‌ స్పూన్లు; పచ్చి మిర్చి తరుగు – ఒక టీ స్పూను; అల్లం తురుము – అర టీ స్పూను; కొత్తిమీర తరుగు – ఒక టేబుల్‌ స్పూను; నిమ్మ రసం – ఒక టీ స్పూను; ఆవాలు – అర టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; ఇంగువ – కొద్దిగా; నూనె – ఒక టీ స్పూను,  ఉప్పు – తగినంత
తయారీ: ∙పెసర పప్పులోని నీళ్లు ఒంపేసి, నీళ్లు పూర్తిగా పోయేవరకు వడకట్టాలి ∙ పెద్ద పాత్రలో పెసర పప్పు, కొబ్బరి తురుము, పచ్చి మిర్చి తరుగు, సగం కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి ∙చిన్న బాణలి స్టౌ మీద ఉంచి వేడయ్యాక నూనె వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడే వరకు వేయించాలి ∙ ఇంగువ, కరివేపాకు జత చేసి మరోమారు కలిపి దింపేసి, పెసర పప్పు మిశ్రమంలో వేసి బాగా కలపాలి ∙చివరగా ఉప్పు, నిమ్మరసం వేసి కలపాలి.

అటుకుల పులావ్‌
కావలసినవి: అటుకులు – ఒక కప్పు; ఉల్లి తరుగు – పావు కప్పు; పచ్చి మిర్చి తరుగు – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత కాయగూరలు... క్యారట్‌ తురుము – పావు కప్పు; బంగాళ దుంప తురుము – ఒక టేబుల్‌ స్పూను; బీన్స్‌ – 4 (చిన్న చిన్న ముక్కలు చేయాలి); క్యాబేజీ తరుగు – ఒక టేబుల్‌ స్పూను; పచ్చి బఠాణీ – ఒక టేబుల్‌ స్పూను; క్యాలీఫ్లవర్‌ తరుగు – ఒక  టేబుల్‌ స్పూను వేయించడానికి: నూనె – 3 టేబుల్‌ స్పూన్లు; దాల్చిన చెక్క – చిన్న ముక్క; లవంగాలు – 2

తయారీ: ∙అటుకులను ముందుగా శుభ్రంగా కడిగి నీళ్లన్నీ పోయేలా వడకట్టాలి ∙బాణలిలో నూనె వేసి కాగాక దాల్చిన చెక్క ముక్క, లవంగాలు వేసి వేయించాలి ∙ఉల్లి తరుగు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ∙పచ్చిమిర్చి జత చేసి మరోమారు కలపాలి ∙తరిగి ఉంచుకున్న కూరగాయల తురుము, ముక్కలు వేసి మెత్తబడేవరకు మధ్యమధ్యలో కలుపుతుండాలి ∙అటుకులు, ఉప్పు వేసి, కొద్దిగా నీళ్లు చిలకరించి బాగా కలిపి రెండు నిమిషాలు ఉంచి దింపేయాలి.

సాబుదానా ఉప్మా
కావలసినవి: సగ్గు బియ్యం – 2 కప్పులు; పల్లీలు – పావు కప్పు; పచ్చి మిర్చి – 4 (మధ్యకు నిలువుగా తరగాలి); ఎండు మిర్చి – 2 (చిన్న చిన్న ముక్కలు చేయాలి); పచ్చి సెనగ పప్పు – ఒక టేబుల్‌ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె / నెయ్యి – ఒక టేబుల్‌ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు. తయారీ: ∙ముందుగా సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి సుమారు నాలుగు గంటల పాటు నానబెట్టాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె లేకుండా పల్లీలను బాగా వేయించి తీసేయాలి ∙అదే బాణలిలో నూనె లేదా నెయ్యి వేసి కాగాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వరుసగా వేసి వేయించాలి ∙పచ్చి మిర్చి, కరివేపాకు వేసి మరోమారు సుమారు మూడు నిమిషాల పాటు వేయించుతుండాలి ∙సగ్గుబియ్యంలో నీళ్లు పూర్తిగా ఒంపేయాలి ∙పల్లీలు చల్లారిన తరవాత మిక్సీలో వేసి రవ్వలా వచ్చేలా మిక్సీ పట్టాలి ∙వేగుతున్న పోపులో సగ్గు బియ్యం, ఉప్పు వేసి బాగా కలపాలి ∙చివరగా పల్లీల పొడి వేసి బాగా కలిపి, కొద్ది సేపు ఉంచి దింపేయాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement