Nadella
-
సొంత గడ్డపై ట్రంప్‌ను వ్యతిరేకించిన నాదెళ్ల
ముంబై : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసవాదులపై విధించిన నిషేధంపై మైక్రోసాప్ట్ బాస్ సత్యనాదెళ్ల మరోసారి తన నిరసన గళం వినిపించారు. అమెరికా వలసవాదుల దేశమని, విదేశీయులపై నిషేధం విధించడం సరికాదని ఆయన ట్రంప్ పై మండిపడ్డారు. ఏకాకిగా ఏ దేశం ఉండలేదని పేర్కొన్నారు. అమెరికా విలువలను మైక్రోసాప్ట్ ఎప్పుడూ కాపాడుతూనే ఉంటుందని చెప్పారు. దేశీయ అతిపెద్ద డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ ఈవెంట్ ఫ్యూచర్ డీకోడెడ్ 2017 సందర్భంగా మాట్లాడిన సత్య నాదెళ్ల , వలసవాదులపై ట్రంప్ అనుసరిస్తున్న విధానాలపై స్పందించారు. అమెరికా ఇమ్మిగ్రేషన్ పాలసీతో తాను లబ్దిపొందానని, ఒంటరిగా ఏ దేశం జీవించలేదని మాత్రం తాను నమ్ముతున్నట్టు పేర్కొన్నారు. ఇండియన్ మార్కెట్ కోసం కొత్త స్కైప్ లైట్ యాప్‌ను ఆవిష్కరిస్తున్నట్టు నాదెళ్ల ప్రకటించారు. ప్రస్తుతం ఇది ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. తక్కువ బ్యాండ్ విడ్త్‌లో కూడా మెసేజింగ్, ఆడియో, వీడియో కాలింగ్ సదుపాయాలను ఇది కల్పిస్తుందని నాదెళ్ల చెప్పారు. గుజరాతి, బెంగాళి, హిందీ, మరాఠీ, తమిళ్, తెలుగు భాషలను సపోర్టు చేస్తూ ఈ యాప్‌ను విడుదల చేశారు. డివైజ్‌లోకి ఫైల్స్‌ను డౌన్ లోడ్ చేసుకోకుండానే యూజర్లు ఆ ఫైల్స్ ను షేర్ చేసేలా ఈ యాప్ సహకరించనుంది. డేటా ఆదా చేయడం కోసం ఇది ఎంతో ఉపయోగపడనుంది. దేశంలో మైక్రోసాప్ట్ ఎక్కువగా పెట్టుబడులు పెడుతుందని, ఇప్పటికే మూడు డేటా సెంటర్లను తాము కలిగి ఉన్నామని పేర్కొన్నారు. ఆధార్ డేటాను గుర్తించడానికి స్కైప్ లైట్ ఉపయోగపడనుంది. -
సత్యా నాదెళ్ళకు సలహా ఇచ్చిన బుడతడు!
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యానాదెళ్ళ ఇటీవల ఇండియా సందర్శించిన సందర్భంలో అనేకమంది ప్రముఖలు, పారిశ్రామిక, వ్యాపారవేత్తలతో చర్చలు జరిపారు. అభివృద్ధికి సహకరించే ఎన్నో ప్రశ్నలు సంధించి సమాధానాలకోసం సహనంతో వేచి చూశారు. అయితే ఆయన ప్రశ్నలకు సమాధానంగాని, సలహాలు గాని ఇచ్చేందుకు పత్రికా ప్రతినిధులు, నిపుణులు వంటివారెవ్వరూ ముందుకు రాలేదు. అయితే ఓ ఎనిమిదేళ్ళ ఏస్ డెవలపర్ మాత్రం సత్యా నాదెళ్ళకు తనదైన శైలిలో సలహాలు, సూచనలను అందించి ఆహూతులనూ అబ్బుర పరిచాడు. సాధారణంగా ఎనిమిదేళ్ళ పిల్లలు అంటే వీడియో గేమ్ లు ఆడటంలో బిజీ బిజీగా గడుపుతుంటారు. కానీ ఈ ఎనిమిదేళ్ళ కుర్రాడు మాత్రం 'లెట్ దేర్ బి లైట్' పేరున ఓ కొత్త గేమింగ్ యాప్ ను అభివృద్ధి చేయడంలో బిజీగా ఉన్నాడు. ఈ గేమ్ లో వినియోగదారులు తమ పట్టణాల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని, కర్మాగారాల నిర్మాణం, వ్యవసాయ అభివృద్ధి వంటివి చేపట్టేలా రూపొందిస్తున్నాడు. అయితే ఆర్థిక వ్యవస్థలో ప్రత్యేక స్థానంలో ఉన్న మీరు సైతం పారిశ్రామికాభివృద్ధి, వ్యవసాయం సమతుల్యతను కలిగి ఉండేలా ప్రయత్నిస్తే కాలుష్య పెరుగుదలను నియంత్రించే అవకాశం ఉంటుందని, దీంతో స్థిరమైన అభివృద్ధిని కూడ సాధించవచ్చని ఆ యువ డెవలపర్ తనదైన రీతిలో మైక్రోసాఫ్ట్ సీఈవో కు సలహా ఇచ్చాడు. ఇంకేముందీ... ఆ చిన్నారి మేధావి సలహాకు సరైన సమాధానం ఇవ్వాల్సి పని సత్యా నాదెళ్ళ వంతైంది. అంతేకాక ఆ ఛైల్డ్ డెవలపర్... తాను భవిష్యత్తులో మైక్రోసాఫ్ట్ సీఈవో కావాలని ప్రయత్నిస్తున్నానని, ప్రపంచంలోని అన్ని టెక్నాలజీ కంపెనీలు తన అధీనంలో పనిచేసేట్టు చేస్తానని చెప్పాడా వండర్ బాయ్... -
మరోసారి భారత్ కు సత్య నాదెళ్ళ!
న్యూఢిల్లీః అమెరికాకు చెందిన సాఫ్ట్ వేర్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ళ మే 30న మరోసారి భారత్ లో పర్యటించనున్నారు. ఈసారి పర్యటనలో భాగంగా ఢిల్లీలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఆయన యువ వ్యాపారవేత్తలు, విద్యార్థులు, విద్యావేత్తలను కలుసుకొంటారు. అలాగే సీఐఐ నిర్వహించనున్నమరోకార్యక్రమంలో పాల్గొని భారత్ లోని 150 మంది అత్యుత్తమ కార్పొరేట్ దిగ్గజాలతో కూడ సమావేశమౌతారు. భారత్ ను సందర్శించనున్న నాదెళ్ళ ఈసారి పర్యటనలో భాగంగా సాంకేతిక సంస్కృతి అభివృద్ధి, భారత్ లో పరివర్తన, ప్రపంచంలో వాస్త సమస్యల పరిష్కారం వంటి అనేక సాంకేతిక విషయాలపై నిపుణులతో చర్చిస్తారు. ఏడు నెలల వ్యవధిలో నాదెళ్ళ భారత్ కు రావడం ఇది మూడోసారి కాగా గత డిసెంబర్ లో ఇండియా సందర్శించిన సందర్భంలో ఆయన...ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడ్ని కలసి, అనంతరం హైదరాబాద్ లోని స్టార్ట్ అప్ ఇంక్యుబేటర్ టీ-హబ్ ను, మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ ను సందర్శించారు. నవంబర్ పర్యటనలో భాగంగా ముంబైలోని మైక్రోసాఫ్ట్ ఫ్యూచర్ అన్లీషెడ్ కార్యక్రమంలో కీలకోపన్యాసం చేసిన నాదెళ్ళ.. అనంతరం మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్ మనేజింగ్ డైరెక్టర్ శిఖా శర్మ వంటి వ్యాపారవేత్తలను, పరిశ్రమల అధినేతలను కలుసుకున్నారు. భారత్ లో ఇటీవల పెరుగుతున్న ప్రపంచ నేతల సందర్శనలు, ఒప్పందాలను చూస్తే దేశం ఒక్క ఔట్ సోర్సింగ్ కేంద్రగానే కాక, సాంకేతికంగా అభివృద్ధి పథంలో దూసుకుపోతోందన్న విషయం అర్థమౌతుంది.