సొంత గడ్డపై ట్రంప్ను వ్యతిరేకించిన నాదెళ్ల
సొంత గడ్డపై ట్రంప్ను వ్యతిరేకించిన నాదెళ్ల
Published Wed, Feb 22 2017 1:43 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM
ముంబై : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసవాదులపై విధించిన నిషేధంపై మైక్రోసాప్ట్ బాస్ సత్యనాదెళ్ల మరోసారి తన నిరసన గళం వినిపించారు. అమెరికా వలసవాదుల దేశమని, విదేశీయులపై నిషేధం విధించడం సరికాదని ఆయన ట్రంప్ పై మండిపడ్డారు. ఏకాకిగా ఏ దేశం ఉండలేదని పేర్కొన్నారు. అమెరికా విలువలను మైక్రోసాప్ట్ ఎప్పుడూ కాపాడుతూనే ఉంటుందని చెప్పారు. దేశీయ అతిపెద్ద డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ ఈవెంట్ ఫ్యూచర్ డీకోడెడ్ 2017 సందర్భంగా మాట్లాడిన సత్య నాదెళ్ల , వలసవాదులపై ట్రంప్ అనుసరిస్తున్న విధానాలపై స్పందించారు.
అమెరికా ఇమ్మిగ్రేషన్ పాలసీతో తాను లబ్దిపొందానని, ఒంటరిగా ఏ దేశం జీవించలేదని మాత్రం తాను నమ్ముతున్నట్టు పేర్కొన్నారు. ఇండియన్ మార్కెట్ కోసం కొత్త స్కైప్ లైట్ యాప్ను ఆవిష్కరిస్తున్నట్టు నాదెళ్ల ప్రకటించారు. ప్రస్తుతం ఇది ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. తక్కువ బ్యాండ్ విడ్త్లో కూడా మెసేజింగ్, ఆడియో, వీడియో కాలింగ్ సదుపాయాలను ఇది కల్పిస్తుందని నాదెళ్ల చెప్పారు. గుజరాతి, బెంగాళి, హిందీ, మరాఠీ, తమిళ్, తెలుగు భాషలను సపోర్టు చేస్తూ ఈ యాప్ను విడుదల చేశారు. డివైజ్లోకి ఫైల్స్ను డౌన్ లోడ్ చేసుకోకుండానే యూజర్లు ఆ ఫైల్స్ ను షేర్ చేసేలా ఈ యాప్ సహకరించనుంది. డేటా ఆదా చేయడం కోసం ఇది ఎంతో ఉపయోగపడనుంది. దేశంలో మైక్రోసాప్ట్ ఎక్కువగా పెట్టుబడులు పెడుతుందని, ఇప్పటికే మూడు డేటా సెంటర్లను తాము కలిగి ఉన్నామని పేర్కొన్నారు. ఆధార్ డేటాను గుర్తించడానికి స్కైప్ లైట్ ఉపయోగపడనుంది.
Advertisement
Advertisement