సత్యా నాదెళ్ళకు సలహా ఇచ్చిన బుడతడు!
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యానాదెళ్ళ ఇటీవల ఇండియా సందర్శించిన సందర్భంలో అనేకమంది ప్రముఖలు, పారిశ్రామిక, వ్యాపారవేత్తలతో చర్చలు జరిపారు. అభివృద్ధికి సహకరించే ఎన్నో ప్రశ్నలు సంధించి సమాధానాలకోసం సహనంతో వేచి చూశారు. అయితే ఆయన ప్రశ్నలకు సమాధానంగాని, సలహాలు గాని ఇచ్చేందుకు పత్రికా ప్రతినిధులు, నిపుణులు వంటివారెవ్వరూ ముందుకు రాలేదు. అయితే ఓ ఎనిమిదేళ్ళ ఏస్ డెవలపర్ మాత్రం సత్యా నాదెళ్ళకు తనదైన శైలిలో సలహాలు, సూచనలను అందించి ఆహూతులనూ అబ్బుర పరిచాడు.
సాధారణంగా ఎనిమిదేళ్ళ పిల్లలు అంటే వీడియో గేమ్ లు ఆడటంలో బిజీ బిజీగా గడుపుతుంటారు. కానీ ఈ ఎనిమిదేళ్ళ కుర్రాడు మాత్రం 'లెట్ దేర్ బి లైట్' పేరున ఓ కొత్త గేమింగ్ యాప్ ను అభివృద్ధి చేయడంలో బిజీగా ఉన్నాడు. ఈ గేమ్ లో వినియోగదారులు తమ పట్టణాల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని, కర్మాగారాల నిర్మాణం, వ్యవసాయ అభివృద్ధి వంటివి చేపట్టేలా రూపొందిస్తున్నాడు. అయితే ఆర్థిక వ్యవస్థలో ప్రత్యేక స్థానంలో ఉన్న మీరు సైతం పారిశ్రామికాభివృద్ధి, వ్యవసాయం సమతుల్యతను కలిగి ఉండేలా ప్రయత్నిస్తే కాలుష్య పెరుగుదలను నియంత్రించే అవకాశం ఉంటుందని, దీంతో స్థిరమైన అభివృద్ధిని కూడ సాధించవచ్చని ఆ యువ డెవలపర్ తనదైన రీతిలో మైక్రోసాఫ్ట్ సీఈవో కు సలహా ఇచ్చాడు. ఇంకేముందీ... ఆ చిన్నారి మేధావి సలహాకు సరైన సమాధానం ఇవ్వాల్సి పని సత్యా నాదెళ్ళ వంతైంది.
అంతేకాక ఆ ఛైల్డ్ డెవలపర్... తాను భవిష్యత్తులో మైక్రోసాఫ్ట్ సీఈవో కావాలని ప్రయత్నిస్తున్నానని, ప్రపంచంలోని అన్ని టెక్నాలజీ కంపెనీలు తన అధీనంలో పనిచేసేట్టు చేస్తానని చెప్పాడా వండర్ బాయ్...