బెజవాడలోనే ఏపీ సీఎం క్యాంపు కార్యాలయం!
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తాత్కాలిక క్యాంపు కార్యాలయం గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ నుంచి బెజవాడలోని స్టేట్ గెస్ట్‌హౌస్‌కు మారనున్నట్లు సమాచారం. ఈమేరకు స్టేట్ గెస్ట్ హౌస్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర విభజన జరగడంతో ఇక్కడ రాజధాని ఏర్పడే వరకు సీమాంధ్రలో వారానికి రెండు రోజులు ఉండాలని కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకోసం తాత్కాలికంగా విజయవాడ - గుంటూరు నగరాల మధ్య మంగళగిరికి సమీపంలోని నాగార్జున యూనివర్సిటీని తొలుత ఎంపిక చేశారు. అక్కడ క్యాంపు కార్యాలయం ఏర్పాటుకు సన్నాహాలు కూడా ప్రారంభించారు.
అయితే, భద్రతపరంగా యూనివర్సిటీకంటే విజయవాడ నగరంలోని స్టేట్ గెస్ట్‌హౌస్ ఉత్తమమని రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు సమాచారం. దీంతో క్యాంపు కార్యాలయం ఏర్పాటుకు స్టేట్ గెస్ట్‌హౌస్‌ను సిద్ధం చేస్తున్నారు. గెస్ట్‌హౌస్ మూడో బ్లాక్‌లో ఉన్న 10 సూట్లు, ఆరు సింగిల్ ఏసీ రూమ్‌లు, ఎనిమిది నాన్ ఏసీ గదులను పూర్తిస్థాయిలో ఆధునీకరించారు. ఒకటో బ్లాకులో రెండు ఏసీ, రెండు నాన్ ఏసీ గదులు, రెండో బ్లాకులో ఒక సూట్, నాలుగు నాన్ ఏసీ గదులను కూడా సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. భద్రత ఏర్పాట్లు చేసుకోవడానికి 1, 2 బ్లాకులు అధికారులకు అందుబాటులోకి తేవాలని అధికార యంత్రాంగం భావిస్తోంది.