nallakannu
-
నల్లకన్నుకు నీడ కరువు.. సర్వత్రా విమర్శలు
సాక్షి, చెన్నై: నిజాయితీకి ప్రతి రూపంగా ఉన్న సీపీఐ సీనియర్ నేత నల్లకన్నుకు పాలకులు నీడ లేకుండా చేశారు. గృహ నిర్మాణ విభాగం పరిధిలోని అద్దె గృహాన్ని అధికారులు ఖాళీగా చేయించారు. దీంతో ఆయన కేకే నగర్లో ఓ చిన్న ఇంటికి అద్దెకు తీసుకోవాల్సి వచ్చింది. పాలకుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీపీఐ సీనియర్ నేతగా నల్లకన్ను సుపరిచితుడే. నిజాయితీకి ప్రతి రూపంగా అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించే వాళ్లు, గళం వినిపించే వాళ్లు నల్లకన్నును చూస్తారు. ఆయనకు కనీసం సొంత ఇళ్లు కూడా లేదు. టీ నగర్లో గృహ నిర్మాణ విభాగం పరిధిలో గతంలో అద్దెకు కేటాయించిన గృహంలో ఒక దానిని ఆయన తీసుకున్నారు. ప్రతినెలా అద్దె చెల్తిస్తూ పన్నెండేళ్లకు పైగా అందులో నివాసం ఉంటూ వచ్చారు. అయితే, ఓ సీనియర్ నేత అన్న అంశాన్ని కూడా పరిగణించకుండా అధికారులు ఆయన్ను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. అద్దె నివాసాలకు మరమ్మతుల పేరిట అక్కడున్న వాళ్లందర్నీ ఖాళీ చేయించేందుకు నోటీసులు జారీ చేశారు. తన చేతికి నోటీసు అందగానే, ఎలాంటి ప్రత్యామ్నాయం కోసం కూడా వేచి చూడకుండా చటుక్కున నల్లకన్ను ఆ ఇంటిని ఖాళీ చేశారు. కేకేనగర్లో ఓ చిన్న ఇంటిని శనివారం అద్దెకు తీసుకున్నారు.ఈ సమాచారంతో సీపీఐ, సీపీఎం వర్గాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో కమ్యూనిస్టు పోరాట యోధుడిగా, సీనియర్ నేతగా ఉన్న కల్లకన్ను లాంటి వారికి ఇచ్చే గౌరవం ఇదేనా అని అధికారుల్ని నిలదీశారు. సీఎం పళనిస్వామి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని, నల్లకన్నుకు ఓ నివాసం కేటాయించేందుకు తగ్గ ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. అధికారుల తీరుపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, అమ్మమక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్, సీపీఐ నేత ముత్తరసన్, సీపీఎం బాలకృష్ణన్, రామకృష్ణన్, తమిళాభిమాన సంఘం నేత పల నెడుమారన్ తీవ్రంగా ఖండించారు. నిజాయితీకి ప్రతి రూపంగా ఉన్న నల్లకన్ను ఆర్థిక పరిస్థితి పాలకులు పరిగణించాలని, ఆయనకు ప్రభుత్వ పరంగా నివాసం కేటాయించాలని డిమాండ్ చేశారు. -
ప్రచారం షురూ
మంత్రులు ప్రచారానికి శ్రీకారం నేడు జయలలిత నామినేషన్ దాఖలు సీపీఐ అభ్యర్థిగా నల్లకన్ను..? ఉప సమరానికి కాంగ్రెస్ దూరం సాక్షి, చెన్నై:ఆర్కేనగర్ నియోజకవర్గంలో ఓటర్లను ఆకర్షించే పనిలో రాష్ట్ర మంత్రులు నిమగ్నం అయ్యారు. గురువారం తమ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. వీధివీధిన తిరుగుతూ జయలలితకు మద్దతుగా ఓట్ల వేటలో పడ్డారు. శుక్రవారం జయలలిత తన నామినేషన్ను దాఖలు చేయబోతున్నారు. ఆర్కేనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈనెల 27న ఉపఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. నామినేషన్ల పర్వం బుధవారం నుంచి ప్రారంభమైంది. ఇక, ఈ ఎన్నికల బరిలో నిలబడేందుకు సిద్ధ పడ్డ సీపీఐ అభ్యర్థి వేటలో పడింది. ఆ నియోజకవర్గప్రజలకు సుపరిచితుడైన ఆ పార్టీ సీనియర్ నేతల నల్లకన్నును బరిలో దించేందుకు కసరత్తులు జరుగుతున్నాయి. అయితే, ఇందుకు నల్లకన్ను అంగీకరిస్తారా..? అన్న ఎదురు చూపులో ఆ పార్టీలో నెలకొని ఉంది. ఈ ఎన్నికల రేసుకు దూరంగా ఉండేందుకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ ఎన్నికల బరిలో అన్నాడీఎంకే అభ్యర్థిగా నిలబడనున్న సీఎం జయలలిత తన నామినేషన్ దాఖలుకు సిద్ధం అయ్యారు. శుక్రవారం తండయార్ పేటలోని ఎన్నికల అధికారి కార్యాలయంలో నామినేషన్ను ఆమె సమర్పించనున్నారు. తమ అధినేత్రి, అమ్మ జయలలిత నామినేషన్ దాఖలుకు సిద్ధం కావడంతో, అన్నాడీఎంకే సేనలు ప్రచార బాట పట్టారు. ఓట్ల వేటలో మంత్రులు : ఆర్కే నగర్లో ఓట్ల వేట లక్ష్యంగా, ఎన్నికల ప్రచార బాధ్యతల్ని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల భుజాన జయలలిత వేసిన విషయం తెలిసిందే. యాభై మందితో జంబో జట్టును ప్రకటించి ఉన్నారు. ఆ మేరకు అమ్మ సేన ఎన్నికల ప్రచార బాట పట్టింది. గురువారం మంత్రులు ఓ పన్నీరు సెల్వం, నత్తం విశ్వనాథన్, వైద్యలింగం , పళని స్వామి, పళనియప్పన్, వలర్మతి, గోకుల ఇందిర, సెల్లూరు కే రాజు, టీకేఎం చిన్నయ్య, తంగమణి, సెంథిల్ బాలాజీ, రాజేంద్ర బాలాజీ ఆర్కే నగర్ పరిధిలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఆర్కేనగర్ పరిధిలో ఉన్న ఆలయాల్లో ఆయా మంత్రులు వేర్వేరుగా పూజాధి కార్యక్రమాలు ముగించుకుని సరిగ్గా 11 గంటలకు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టి, ఓట్ల వేటలో పడ్డారు. వీధివీధిన తిరుగుతూ ఓటర్లను ఆకర్షించడంలో నిమగ్నం అయ్యారు. ఎన్నికలు షురూ కావడంతో భారీ ఆధిక్యం లక్ష్యంగా ఓట్ల వేటలో పడ్డారు. రంగంలోకి ఈసీ : నామినేషన్ల పర్వం ఆరంభంతో ఎన్నికల యంత్రాంగం తన దృష్టిని ఆర్కేనగర్ మీద కేంద్రీకరించింది. ఎన్నికలో అభ్యర్థులు ఖర్చులు తదితర అంశాల పర్యవేక్షణాధికారిగా బెంగళూరుకు చెందిన ఆదాయ పన్ను శాఖ అధికారి మంజిత్ సింగ్ రంగంలోకి దిగారు. ఆయన ఎన్నికల అధికారులు, పోలీసు అధికారులతో సమాలోచించడంతో పాటుగా నియోజకవర్గం పరిధిలోని సరిహద్దులను గుర్తించి, ఆయా మార్గాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేయించారు. ఆ మేరకు ఆరు మార్గాల్ని తమ ఆధీనంలోకి తీసుకుని నగదు బట్వాడా, తాయిలాల పంపిణీ అడ్డుకట్ట లక్ష్యంగా వాహనాల తనిఖీని తీవ్రతరం చే శారు. -
జయతో భేటీకి సిద్ధం
టీనగర్: మాజీ ముఖ్యమంత్రి జయలలితను కలిసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇలంగోవన్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిని సీనియర్ నేతగా భావించి కలుసుకున్నానని ఇందులో ఎటువంటి రాజకీయ ఉద్దేశం లేదన్నారు. త్వరలో వామపక్ష నేతలు శంకరయ్య, నల్లకన్నుతోపాటు రాందాస్, వైగో, విజయకాంత్, తిరుమావళవన్లను కలిసి ఆశీస్సులందుకోనున్నట్లు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి జయలలితను కూడా కలుసుకునేందుకు సిద్ధం గా వున్నట్లు తెలిపారు. అయితే, ఆమె అనుమతి ఇస్తారా? అనే విషయం తెలియలేదన్నారు. అనుమతి లభించిన వెంటనే ఆమెను కలిసి మాట్లాడుతానని తెలిపారు. మంగళవారం నుంచి తిరునెల్వేలి, కన్యాకుమారి జిల్లాల్లో పర్యటించనున్నానని, ఆ తర్వాత నాగపట్నం, శివగంగై, పుదుక్కోట్టై, కోయంబత్తూరు, తిరుపూరు, మదురై, రామనాధపురం జిల్లాల్లో పర్యటిస్తానన్నారు. కాంగ్రెస్ నుంచి వైదొలగిన వారి గురించి బెంగలేదని, వారి గురించి ఇకపై వ్యాఖ్యలు చేయదలచుకోలేదన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు రంగభాష్యం, హార్బర్ రవిరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస మూర్తి, దేవరాజ్, దీనా, ఏలుమలై, గార్డెన్ కృష్ణమూర్తి, కుళత్తూరు సాలమన్, సుందరరాజ్ తదితరులు పాల్గొన్నారు.