ప్రచారం షురూ
మంత్రులు ప్రచారానికి శ్రీకారం
నేడు జయలలిత నామినేషన్ దాఖలు
సీపీఐ అభ్యర్థిగా నల్లకన్ను..?
ఉప సమరానికి కాంగ్రెస్ దూరం
సాక్షి, చెన్నై:ఆర్కేనగర్ నియోజకవర్గంలో ఓటర్లను ఆకర్షించే పనిలో రాష్ట్ర మంత్రులు నిమగ్నం అయ్యారు. గురువారం తమ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. వీధివీధిన తిరుగుతూ జయలలితకు మద్దతుగా ఓట్ల వేటలో పడ్డారు. శుక్రవారం జయలలిత తన నామినేషన్‌ను దాఖలు చేయబోతున్నారు. ఆర్కేనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈనెల 27న ఉపఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. నామినేషన్ల పర్వం బుధవారం నుంచి ప్రారంభమైంది. ఇక, ఈ ఎన్నికల బరిలో నిలబడేందుకు సిద్ధ పడ్డ సీపీఐ అభ్యర్థి వేటలో పడింది. ఆ నియోజకవర్గప్రజలకు సుపరిచితుడైన ఆ పార్టీ సీనియర్ నేతల నల్లకన్నును బరిలో దించేందుకు కసరత్తులు జరుగుతున్నాయి.
అయితే, ఇందుకు నల్లకన్ను అంగీకరిస్తారా..? అన్న ఎదురు చూపులో ఆ పార్టీలో నెలకొని ఉంది. ఈ ఎన్నికల రేసుకు దూరంగా ఉండేందుకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ ఎన్నికల బరిలో అన్నాడీఎంకే అభ్యర్థిగా నిలబడనున్న సీఎం జయలలిత తన నామినేషన్ దాఖలుకు సిద్ధం అయ్యారు. శుక్రవారం తండయార్ పేటలోని ఎన్నికల అధికారి కార్యాలయంలో నామినేషన్‌ను ఆమె సమర్పించనున్నారు. తమ అధినేత్రి, అమ్మ జయలలిత నామినేషన్ దాఖలుకు సిద్ధం కావడంతో, అన్నాడీఎంకే సేనలు ప్రచార బాట పట్టారు.
ఓట్ల వేటలో మంత్రులు : ఆర్కే నగర్‌లో ఓట్ల వేట లక్ష్యంగా, ఎన్నికల ప్రచార బాధ్యతల్ని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల భుజాన జయలలిత వేసిన విషయం తెలిసిందే. యాభై మందితో జంబో జట్టును ప్రకటించి ఉన్నారు. ఆ మేరకు అమ్మ సేన ఎన్నికల ప్రచార బాట పట్టింది. గురువారం మంత్రులు ఓ పన్నీరు సెల్వం, నత్తం విశ్వనాథన్, వైద్యలింగం , పళని స్వామి, పళనియప్పన్, వలర్మతి, గోకుల ఇందిర, సెల్లూరు కే రాజు, టీకేఎం చిన్నయ్య, తంగమణి, సెంథిల్ బాలాజీ, రాజేంద్ర బాలాజీ ఆర్కే నగర్ పరిధిలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఆర్కేనగర్ పరిధిలో ఉన్న ఆలయాల్లో ఆయా మంత్రులు వేర్వేరుగా పూజాధి కార్యక్రమాలు ముగించుకుని సరిగ్గా 11 గంటలకు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టి, ఓట్ల వేటలో పడ్డారు. వీధివీధిన తిరుగుతూ ఓటర్లను ఆకర్షించడంలో నిమగ్నం అయ్యారు. ఎన్నికలు షురూ కావడంతో భారీ ఆధిక్యం లక్ష్యంగా ఓట్ల వేటలో పడ్డారు.
రంగంలోకి ఈసీ : నామినేషన్ల పర్వం ఆరంభంతో ఎన్నికల యంత్రాంగం తన దృష్టిని ఆర్కేనగర్ మీద కేంద్రీకరించింది. ఎన్నికలో అభ్యర్థులు ఖర్చులు తదితర అంశాల పర్యవేక్షణాధికారిగా బెంగళూరుకు చెందిన ఆదాయ పన్ను శాఖ అధికారి మంజిత్ సింగ్ రంగంలోకి దిగారు. ఆయన ఎన్నికల అధికారులు, పోలీసు అధికారులతో సమాలోచించడంతో పాటుగా నియోజకవర్గం పరిధిలోని సరిహద్దులను గుర్తించి, ఆయా మార్గాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేయించారు. ఆ మేరకు ఆరు మార్గాల్ని తమ ఆధీనంలోకి తీసుకుని నగదు బట్వాడా, తాయిలాల పంపిణీ అడ్డుకట్ట లక్ష్యంగా వాహనాల తనిఖీని తీవ్రతరం చే శారు.