సాక్షి, చెన్నై: నిజాయితీకి ప్రతి రూపంగా ఉన్న సీపీఐ సీనియర్ నేత నల్లకన్నుకు పాలకులు నీడ లేకుండా చేశారు. గృహ నిర్మాణ విభాగం పరిధిలోని అద్దె గృహాన్ని అధికారులు ఖాళీగా చేయించారు. దీంతో ఆయన కేకే నగర్‌లో ఓ చిన్న ఇంటికి అద్దెకు తీసుకోవాల్సి వచ్చింది. పాలకుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీపీఐ సీనియర్ నేతగా నల్లకన్ను సుపరిచితుడే. నిజాయితీకి ప్రతి రూపంగా అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించే వాళ్లు, గళం వినిపించే వాళ్లు నల్లకన్నును చూస్తారు. ఆయనకు కనీసం సొంత ఇళ్లు కూడా లేదు. టీ నగర్‌లో గృహ నిర్మాణ విభాగం పరిధిలో గతంలో అద్దెకు కేటాయించిన గృహంలో ఒక దానిని ఆయన తీసుకున్నారు.
ప్రతినెలా అద్దె చెల్తిస్తూ పన్నెండేళ్లకు పైగా అందులో నివాసం ఉంటూ వచ్చారు. అయితే, ఓ సీనియర్ నేత అన్న అంశాన్ని కూడా పరిగణించకుండా అధికారులు ఆయన్ను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. అద్దె నివాసాలకు మరమ్మతుల పేరిట అక్కడున్న వాళ్లందర్నీ ఖాళీ చేయించేందుకు నోటీసులు జారీ చేశారు. తన చేతికి నోటీసు అందగానే, ఎలాంటి ప్రత్యామ్నాయం కోసం కూడా వేచి చూడకుండా చటుక్కున నల్లకన్ను ఆ ఇంటిని ఖాళీ చేశారు. కేకేనగర్‌లో ఓ చిన్న ఇంటిని శనివారం అద్దెకు తీసుకున్నారు.ఈ సమాచారంతో సీపీఐ, సీపీఎం వర్గాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
రాష్ట్ర రాజకీయాల్లో కమ్యూనిస్టు పోరాట యోధుడిగా, సీనియర్ నేతగా ఉన్న కల్లకన్ను లాంటి వారికి ఇచ్చే గౌరవం ఇదేనా అని అధికారుల్ని నిలదీశారు. సీఎం పళనిస్వామి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని, నల్లకన్నుకు ఓ నివాసం కేటాయించేందుకు తగ్గ ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. అధికారుల తీరుపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, అమ్మమక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్, సీపీఐ నేత ముత్తరసన్, సీపీఎం బాలకృష్ణన్, రామకృష్ణన్, తమిళాభిమాన సంఘం నేత పల నెడుమారన్ తీవ్రంగా ఖండించారు. నిజాయితీకి ప్రతి రూపంగా ఉన్న నల్లకన్ను ఆర్థిక పరిస్థితి పాలకులు పరిగణించాలని, ఆయనకు ప్రభుత్వ పరంగా నివాసం కేటాయించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment