నల్లారి సోదరులు భూ బకాసురులు
రూ.300 కోట్ల ప్రభుత్వ భూములు
ఆక్రమించిన కిరణ్ అనుచరులు
కుమ్మక్కు కుట్రలకు
కేంద్ర బిందువు చంద్రబాబు
చింతల రామచంద్రారెడ్డి ధ్వజం
పీలేరు, న్యూస్‌లైన్: అధికారాన్ని అడ్డుపెట్టుకొని నల్లారి సోదరులు భూ బకాసురులుగా మారారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీలేరు ఎమ్మెల్యే అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి ఆరోపించారు. పీలేరు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో సోమవారం మధ్యాహ్నం పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడేళ్లలో పీలేరులో రూ. 300 కోట్ల విలువగల ప్రభుత్వ భూములను ఆక్రమించారని ఆరోపించారు.
మరోవైపు పరిశ్రమల పేరిట భూములను లాక్కొని బడుగు రైతులను వేధించారని దుయ్యబట్టారు. అయితే కిరణ్ హయాంలో ఒక్క పరిశ్రమ కూడా స్థాపించిన దాఖలాలు లేవన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెం టనే ఆక్రమిత ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. కబ్జాదారులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదన్నారు. కిరణ్ పాలనలో పీలేరులో తాగునీరు బిందె రూ. 3 నుంచి 5, వాల్మీకిపురంలో 25 రోజులకు ఒకసారి తాగునీరు వదులుతున్నారని తెలిపారు.
గుర్రంకొండలో తాగునీరు లేద ని, కిరణ్ సొంత మండలం కలికిరిలోనూ తాగునీటి కోసం జనం అల్లాడుతున్నారని తెలిపారు. విద్యుత్ సబ్స్టేషన్లలో ఒక్కో ఉద్యోగాన్ని రూ.3 లక్షలకు అమ్ముకున్నారని ఆరోపించారు. కిరణ్ చరిత్రహీనుడుగా మిగిలిపోతారని అన్నారు. కిరణ్ కొమ్ముకాసి అధికార దుర్వినియోగం, దౌర్జన్యాలకు పాల్పడిన వారు త్వరలోనే శంకరగిరి మాన్యాలు చూడాల్సి వస్తుందన్నారు.
అధికారం కోసం చంద్రబాబు ఎంతటికైనా దిగుజారుతారని ధ్వజమెత్తారు. మతతత్వ బీజీపీతో పొత్తుపెట్టుకోవడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ముస్లీం మైనారిటీలు వాస్త వ పరిస్థితులను గుర్తించి టీడీపీని భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. ముస్లీం మైనారిటీలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం కల్పిం చామన్నారు. తాను జీవించినంత కాలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి కుటుంబానికి విధేయుడుగా ఉంటానని ఆయన పేర్కొన్నారు. ఈనెల 16న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీలేరు ఎమ్మె ల్యే అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నానని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌రెడ్డి హాజరవుతారని తెలి పారు. అలాగే ఈనెల 17న రాజంపేట లోక్‌సభ అభ్యర్థిగా పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి నామినేషన్ వేస్తారని తెలిపారు.
ఈ సమావేశంలో పార్టీ మండల కన్వీనర్ నారే వెంకట్రమణారెడ్డి, మాజీ ఎంపీపీ డాక్టర్ వెంకట్రామయ్య, జెడ్పీటీసీ అభ్యర్థి ఎం.రెడ్డిభాష, సర్పం చ్‌లు ఎం.రవీంద్రనాథరెడ్డి, ఆదినారాయణ, శ్రీనివాసులు, పార్టీ నేతలు ఏ.రాజారెడ్డి, షామియాన షఫీ, బీడీ.నారాయణరెడ్డి, కడప గిరిధర్‌రెడ్డి, కాకులారంపల్లె రమేష్‌రెడ్డి, దండు జగన్మోహన్రెడ్డి, ఎస్.హబీబ్భాష, కొత్తపల్లె సురేష్‌కుమార్‌రెడ్డి, ఉదయ్‌కుమార్, ఎల్ఐసీ ద్వారకనాథరెడ్డి, పీ.అమరనాథరెడ్డి, కేశవరెడ్డి, ధర్మరాజు పాల్గొన్నారు.