‘నల్లవాగు’... నిష్ఫలం
కల్హేర్, న్యూస్‌లైన్: జిల్లాలోని మధ్య తరహా ప్రాజెక్టు నల్లవాగు రైతన్నకు ఏ మాత్రం ప్రయోజనం చేకూర్చలేకపోతోంది. 5,300 ఎకరాలకు సాగునీరు అందించాల్సిన ప్రాజెక్టు కా ల్వలు, తూములు శిథిలం కాగా, మరమ్మతులు చేయిం చాల్సిన యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తోంది. దీంతో ఈ ప్రాజెక్టు చివరి ఆయకట్టు రైతులకు నీరందించలేకపోతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టం ఉన్నప్పటికీ అవి చివరి ఆయకట్టు వరకూ పారని పరిస్థితి నెలకొంది. శిథిలమైన తూములు, కూల్వల్లో పిచ్చిమొక్కలు భారీగా ఉండడంతో నల్లవాగు ఆయకట్టు రైతులకు సాగునీరు అందడం కష్టసాధ్యంగా మారింది. దీనికి తోడు ఇటీవలే సాగునీటి పారుదల శాఖ అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా నల్లవాగు ఆయకట్టును 4,500 ఎకరాలకే కుదించడం కూడా రైతన్నకు అశనిపాతంగా మారింది.
ముందస్తు చర్యలు శూన్యం..
రబీ సాగు కోసం ఈ నెలాఖరు నాటికి ఆయకట్టు భూములకు నీటిని విడుదల చేసేందుకు సిద్ధమైన నీటి పారుదల శాఖ అధికారులు, శిథిలావస్థకు చేరుకున్న నల్లవాగు తూములు, కాల్వల మరమ్మతులను మాత్రం మరచిపోయారు. 2009-10లోనే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రూ.14.19 కోట్లు మంజూరు చేసి నల్లవాగు కాల్వలను ఆధునీకరించారు. అయితే పనుల్లో నాణ్యత లోపించడంతో రెండేళ్లలోనే పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ప్రస్తుతం సీసీ లైనింగ్ పగిలి కాల్వలు ధ్వంసం కాగా, సిమెంట్ కట్టడాలు బీటలువారాయి.
అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు రైతులు సాగునీటి కోసం సిమెంట్ కట్టడాలను ధ్వంసం చేసి తొందరపాటు చర్యలకు పాల్పడ్డారు. పనుల్లో నాణ్యత లేక పోచాపూర్, బిబిపేట, ఖాజాపూర్ రోడ్డు, మార్డి, కృష్ణపూర్ వద్ద సిమెంట్ లైనింగ్‌కు గండ్లు పడ్డాయి. కొన్ని చోట్ల కాల్వల మధ్య పిచ్చి మొక్కలు పేరుకుపోయాయి. ఫలితంగా చివరి ఆయకట్టు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ప్రాజెక్టు స్థితి గతి మారకపోవడంతో అయకట్టు కింది రైతులు బోర్లు తవ్వుకుంటున్నారు. నల్లవాగు ప్రాజెక్టు నుంచి సాగునీటి విడుదలకు ముందుగానే శిథిలమైన కాల్వలు, తూములకు మరమ్మతులు చేయించాలని రైతులు కోరుతున్నారు.
ప్రాజెక్టు నేపథ్యమిది...
కల్హేర్ మండలంలోని సుల్తానాబాద్ వద్ద 1967లో రూ. 98 లక్షలతో నల్లవాగు ప్రాజెక్టు నిర్మించారు. అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మనందరెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి శీలం సిద్ధారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించారు. ప్రాజెక్టులో పూర్తి నీటి సామర్థ్యం 1493 అడుగులు. ప్రాజెక్టు కుడి కాల్వ పరిధిలో సుల్తానాబాద్, గోసాయిపల్లి, పోచాపూర్, బిబిపేట, మార్డి, ఖానాపూర్(కె), కృష్ణాపూర్, ఇందిరానగర్, కల్హేర్ వరకు 4,100 ఎకరాలు ఆయకట్టు ఉంది. ఎడమ కాల్వ పరిధిలో బోక్కస్‌గాం, అంతర్గాం, నిజామాబాద్ జిల్లా మార్దండ, తిమ్మనగర్ గ్రామల్లో 1,230 ఎకరాల వరకు ఆయకట్టు ఉంది.
కలెక్టర్ కు నివేదిస్తాం
నల్లవాగు కాల్వలను వెంటనే మరమ్మత్తులు చేయిస్తాం. కాల్వలు ధ్వంసం కావడంతో ఆయకట్టుకు నీటి సరఫరాలో ఇబ్బందులు వస్తాయి. కాల్వల్లో పిచ్చి మొక్కలు, నాచు ఉంది. కలెక్టర్‌కు నివేదించి వెంటనే పనులు చేపడతాం. నీటి సరఫరాలో రైతులకు ఇబ్బందులు లేకుండా ముందస్తుగా చర్యలు తీసుకుంటాం.
-ధన్‌రాజ్, ఇరిగేషన్ డీఈఈ